
-
కరోనా విజృంభణ
మాస్కో: రష్యాలో కరోనా విజృంభించింది. దీంతో ఆ దేశంలో సంపూర్ణంగా లాక్‌డౌన్ విధించారు. భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతుండడంతో ఆ దేశం కఠిన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. రాజధాని మాస్కోలోని పాఠశాలలు, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లతో పాటు.. దుకాణాలన్నింటినీ అక్టోబర్ 28 నుంచి 11 రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించింది.
ఇప్పటికే దేశంలో నాలుగు రోజుల పాటు సెలవులను ప్రకటించారు. అయితే, రెస్టారెంట్లు, కేఫ్‌లు పార్శిల్ సర్వీసులను కొనసాగించవచ్చని.. మందుల దుకాణాలు సైతం తెరిచి ఉంటాయని మాస్కో నగర మేయర్ సోబియానిన్ ప్రకటించారు. మ్యూజియంలు, ఆర్ట్ థియేటర్లలోకి టీకాలు వేసుకున్న వారినే అనుమతించనున్నారు. రష్యాలో తాజాగా 36,339 కొత్త కేసులు, 1,036 మరణాలు నమోదయ్యాయి. దీనితో ఐరోపాలోనే అత్యధికంగా రష్యాలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్యను 2,27,389కి చేరింది. కొవిడ్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల జాబితాలో రష్యా ఐదో స్థానంలో ఉంది.





