News

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధ్వర్యంలో కబడ్డీ పోటీలు: యువకులలో వెల్లువెత్తిన ఉత్సాహం.

694views

అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అఖిల భారత ప్రహార్ దివస్ సందర్భంగా జరిగిన కబడ్డీ పోటీలు ఆ ప్రాంత యువతలో ఉత్సాహాన్ని నింపింది. ఈ పోటీలను యాడికి మండలాధ్యక్షులు రంగయ్య, స్థానిక BJPనాయకులు తిరంపురం లక్ష్మయ్యలు ప్రారంభించారు. అనంతరం వారు ప్రసంగిస్తూ 1972 లో జరిగిన భారత్ పాకిస్థాన్ యుద్దంలో డిసెంబర్ 16న భారత సైన్యం తమ వీరోచిత పోరాట ఫలితంగా 90239 మంది పాక్ సైనికులను యుద్ధ ఖైదీలుగా పట్టుకోవడం జరిగిందన్నారు. అంత మంది సైనికులను యుద్ద ఖైదీలుగా పట్టుకోవడం ప్రధమమని, మన సైనికులు తమ సాహసంతో ఆ ఘనతను సాధించారని తెలిపారు. ఆనాడు మన సైనికులు సాధించిన విజయానికి గుర్తుగా దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విజయ దివస్ గా జరుపుకుంటుందని, ఆ సందర్భంగా అన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖలలో ప్రహార్ దివస్ జరుగుతుందని, అందులో భాగంగానే ఈనాడు ఈ కబడ్డీ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

కాగా ఈ పోటీలలో యాడికి మండల కేంద్రానికి చెందిన వాగ్దేవి స్కూలు, హై స్కూలు, మోడల్ స్కూలు, ప్యారడైజ్ స్కూళ్ళ నుంచి 4 జట్లు పాల్గొన్నాయి. ఈ కబడ్డీ పోటీల ఫైనల్లో వాగ్దేవి స్కూలు, మోడల్ స్కూలు జట్లు తలపడ్డాయి. ఇరు జట్ల మధ్య హోరా హోరీగా జరిగిన పోరు ప్రేక్షకులను అలరించింది. క్రికెట్ వంటి విదేశీ ఆటల మోజులో పడి ఎంతో ఉత్సాహాన్ని, ఉత్సుకతను కలిగించే కబడ్డీ, ఖో వంటి క్రీడలు కనుమరుగవుతూ వుండడం అత్యంత బాధాకరమని పలువురు ప్రేక్షకులు వ్యాఖ్యానించడం కనిపించింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసి ఆది నారాయణ, టీడీపీ నాయకులు నరసింహులు, శేఖర్ మరియు స్థానిక ఆరెస్సెస్, BJP నాయకులు పాల్గొన్నారు.