
కేరళలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో 11 జాతీయ విపత్తు సహాయక దళాలు [National Disaster Response Forces (NDRF)), రెండు సైన్యం మరియు రెండు డిఫెన్స్ సర్వీస్ కాప్స్ (DSC) బృందాలతో సహా కేంద్ర బలగాలు కేరళ దక్షిణ మరియు మధ్య ప్రాంతాల్లో మోహరించి ఉన్నాయి.
భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) కి చెందిన రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వం శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఒక లేఖ వ్రాశారు. భారీ వర్షాలు కేరళను ముంచెత్తుతున్నాయని, కనుక దయతో తమ రాష్ట్ర పరిస్థితిపై దృష్టి సారించి, రాష్ట్ర ప్రభుత్వానికి సహాయపడాలని ప్రధానికి విన్నవించారు. NDRF దళాలను పంపించి కేరళ ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన ప్రధానిని కోరారు.
కేరళలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కొట్టాయంలోని కొట్టిక్కల్ మరియు ఇడుక్కి జిల్లాలోని కొక్కయార్ వద్ద కొండచరియలు విరిగిపడి నలుగురు మరణించారు, ఆరు జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించబడి ఉంది.
పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సెంటర్ అప్రమత్తంగా ఉంది. డ్యామ్ ల పరిస్థితిని అంచనా వేయడానికి KSEB మరియు ఇరిగేషన్ శాఖల ప్రతినిధులను నియమించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సంబంధిత శాఖాధిపతులందరికీ ఆదేశాలు జారీ చేయబడ్డాయి.
భారత వాతావరణ శాఖ (IMD) వెలువరించిన పత్రికా ప్రకటన ప్రకారం, పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్ జిల్లాలలో రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. కాగా, దక్షిణ కేరళలోని తిరువనంతపురం, కొల్లం, అలపుజ, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్ మరియు వయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది.





