News

రామ మందిర విషయం సుప్రీమ్ కు అప్రాధాన్య విషయమా? : సుప్రీమ్ తీరుపై మండిపడ్డ వి. హిం. ప అంతర్జాతీయ సహ కార్యదర్శి రాఘవులు.

558views

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వ‌చ్చే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడలో హిందూ ధార్మిక సంస్థలు కదం తొక్కాయి. 9/12/2018 ఆదివారం మధ్యాహ్నం 3 గంట‌ల‌కు పటమట హై స్కూల్ రోడ్లోని రైతు బజారు ఎదురుగానున్న సభా స్థలిలో హైందవ శంఖారావ సభ జరిగింది. ఈ సభకు వేలాది మంది రామ భక్తులు తరలి వచ్చారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని నినాదాలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వ హిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో ఇక్కడే భారీ హిందూ సభను నిర్వ‌హించారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే రామ మందిర నిర్మాణం గురించి ఇక ఏ శక్తులూ అడ్డుకోలేవని తెలియచెప్పేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వీహెచ్‌పీ అంతర్జాతీయ సహ కార్యదర్శి శ్రీ రాఘవులు వివరించారు.

శ్రీ రాఘవులు మాట్లాడుతూ ప్రస్తుతం రామ మందిర నిర్మాణానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో 25 ఏండ్లుగా పెండింగ్లో వుండడం విచారకరమన్నారు. 125 కోట్ల హిందువుల మనోభావాలతో కూడుకున్న అంశం సుప్రీమ్ కోర్టుకు అప్రాధాన్యమైన విషయంలా కనిపించటం వింతగా ఉందన్నారు. ఇదే సుప్రీమ్ కోర్టు తనకేమాత్రమూ సంబంధం లేని శబరిమల అంశంపై మాత్రం ఆఘమేఘాల మీద తీర్పును వెలువరించిందన్నారు. “ఒక వివాహిత స్త్రీ పర పురుషుడితో అక్రమ సంబంధం నెరపడం సక్రమమే” వంటి పనికిమాలిన తీర్పులు ఇవ్వడానికి సమయముంటుంది రామ మందిరం పై చర్చించడానికి ఈ న్యాయ మూర్తులకు తీరిక లేదా? అని ప్రశ్నించారు. “ కొందరేమో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోమంటున్నారు. ఎవరితో చర్చించాలి? అక్కడున్నది మందిరమని రుజువు చేసే ఆధారాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేసినవారితోనా? వందేమాతరం పాడని వారితోనా? భారతమాతాకీజై అని నినదించం పొమ్మన్న వారితోనా? అలాంటి వారితో ఏమి చర్చించగలం?” అని ప్రశ్నించారు. అయోధ్యలో రాముని కుమారుడు కుశుడు నిర్మించిన 12లక్షల సంవత్సరాల కాలం నాటి ఆలయాన్ని ధ్వంసం చేసి బాబర్ అక్కడ మందిర పునాదులపైనే మశీదు నిర్మించాడని, ఆ విధంగా మహమ్మదీయులు ఈ దేశంలో 33 వేల దేవాలయాలను కూల్చి వేశారని. 3 వేల దేవాలయాలపై మశీదులు నిర్మించారని తెలిపారు. రామ మందిర నిర్మాణం జరిగినప్పుడే రాజ్యాంగ స్ఫూర్తి నిలబడుతుందని, ఎందుకంటే రాజ్యాంగ ప్రతిలోని మొదటి పేజీలో సీతా రామ లక్ష్మణ హనుమంతుల చిత్రం ఉంటుందని. ఈ దేశంలో రామునికిచ్చిన స్థానం అదని తెలిపారు. రామ మందిర నిర్మాణం పూర్తయ్యేంతవరకు ఈ ఉద్యమం ఆగదని తెలిపారు. డిసెంబర్ 18 నుంచి 25 వరకు 7 రోజుల పాటు దేశం మొత్తం మీద 6 లక్షల గ్రామాలలోని దేవాలయాలలో రామ మందిర నిర్మాణ సంకల్పంతో పూజలు జరగాలని నిర్ణయించామన్నారు.

శైవ పీఠాధిపతి శివ స్వామి మాట్లాడుతూ హిందువులందరూ సంఘటిత శక్తిగా మారాలని, ఆ శక్తే విజయానికి హేతువవుతుందని పేర్కొన్నారు. ఉత్తర భారత దేశంలో హిందూత్వ చైతన్యం అధికంగా వుందని దానికి మన శక్తి కూడా తోడైతే విజయం తప్పక సిద్దిస్తుందని తెలిపారు. అందరూ “శ్రీ రామ జయ రామ జయ జయ రామ” అనే విజయ మంత్రాన్ని జపించి శక్తిని సముపార్జించి రామ కార్యానికి అందించాలని, విజయాన్ని సాధించి హిందూ జాతి ఖ్యాతిని జగద్విదితం చెయ్యాలని ఉద్ఘాటించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాతా శివ చైతన్యానంద, మాజీ మేయర్ శ్రీ జంధ్యాల శంకర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.