News

రామమందిర నిర్మాణానికి చట్టం చెయ్యాలి: ఆరెస్సెస్ నేత భయ్యాజీ జోషి.

393views

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి వ‌చ్చే పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ మరోసారి హిందూ ధార్మిక సంస్థలు కదం తొక్కాయి. ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఈ ర్యాలీ సాయంత్రం వ‌ర‌కు కొన‌సాగింది. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం నుంచి ప్రారంభ‌మైన ఈ ర్యాలీకి హిందూ ధార్మిక సంస్థలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని నినాదాలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వ హిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో ఇక్కడే భారీ హిందూ సభను నిర్వ‌హించారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే రామ మందిర నిర్మాణం గురించి ఇక ఏ శక్తులూ అడ్డుకోలేవని తెలియచెప్పేందుకే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వీహెచ్‌పీ జనరల్‌ సెక్రటరీ సురేంద్ర జైన్‌ వివరించారు. ఒకవేళ ఈ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టకపోతే భవిష్యత్తు కార్యాచరణను తర్వాత సభలో ప్రకటిస్తామని వెల్లడించారు. తర్వాత సభ (ధర్మ్‌ సన్‌సద్‌)ను అలహాబాద్‌లో జనవరి 31 నుంచి రెండు రోజులపాటు నిర్వహిస్తామని చెప్పారు.

ఈ భారీ ర్యాలీకి దాదాపు ఐదు ల‌క్ష‌ల మంది రామ భ‌క్తులు హాజ‌రైన‌ట్లు స‌మాచారం. ఉత్తర్‌ప్రదేశ్‌, ఘజియాబాద్‌, మీరట్‌ వంటి ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో రామ భక్తులను వీహెచ్‌పీ తరలించింది. ప్రస్తుతం రామ మందిర నిర్మాణానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. వచ్చే ఏడాది జనవరిలో దీని విచారణకు సంబంధించి షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఈ వ్యవహారం 25 ఏళ్ల నుంచి కోర్టులోనే ఉండడంతో…రామ మందిర నిర్మాణం చేపట్టేందుకు ముందుకెళ్లాల్సిందేనని హిందుత్వ సంస్థలు భావిస్తున్నాయి. ఈ భారీ ర్యాలీకి ఆరెస్సెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు భయ్యాజీ జోషీ, వీహెచ్పీ అధ్యక్షుడు సదాశివ్ కోక్జే, అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ లు కూడా హాజ‌ర‌య్యారు.

సీనియర్ ఆరెస్సెస్ నేత సురేష్ భయ్యాజీ జోషీ మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పార్లమెంటులో శాసనం తేవాలని కోరారు. అధికారంలో వున్న వారు తమ మాటను ఆలకించాలని అన్నారు. రామాలయ నిర్మాణానికి మార్గం సుగమం చెయ్యడం ద్వారా అధికార బీ.జే.పీ తను ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. “మేమేమీ మందిరం కోసం మిమ్మల్ని యాచించనవసరం లేదు. భావోద్వేగంతో చెబుతున్నాం ఈ దేశానికి రామ రాజ్యం కావాలి, ప్రజలకు న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసమేర్పడాలి. అప్పుడే అబివృద్ది సాధ్యమౌతుంది.” అని ఆయన అన్నారు. ప్రజల విశ్వాసాన్ని, సెంటిమెంట్ ను సుప్రీమ్ కోర్ట్ పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. తాము ఏ మతంతోనూ సంఘర్షణ కోరుకోవడం లేదని, సామరస్య పూర్వకంగానే వెళ్తున్నామని, అందుకే రామాలయ నిర్మాణం కోసం కేంద్రం శాసనం చెయ్యాలని కోరుతున్నామన్నారు. తమ లక్ష్యం నెరవేరే వరకు తమ ఈ ఉద్యమం ఆగదని పేర్కొన్నారు.

స్వామీ హన్సదేవాచార్య మాట్లాడుతూ రామాలయ నిర్మాణానికి ప్రధాని మోడీ చర్యలు తీసుకోవాల్సిందేనని, ఈ విషయంలో నిర్లిప్తత పనికిరాదని, రామాలయ నిర్మాణం కోసం కోట్లాది హిందువులు ఎదురు చూస్తున్నారన్నారు. రాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. వీ.హెచ్.పీ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ కొక్జీ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వోన్నతులని, ప్రజల అభీష్టం మేరకే అక్కడ రామ మందిర నిర్మాణం జరగాలని చెప్పారు. మశీదు స్థలంలో రామాలయం నిర్మించాలని కోరడం లేదని, అక్కడున్న రామాలయాన్ని కూలదోసి మసీదును నిర్మించారని, ఆ స్థలంలోనే మందిరాన్ని నిర్మించాలని కోరుతున్నామన్నారు. ఇది ఏ విధమైన రాజకీయ లబ్ది కోసమో చేస్తున్న ఎన్నికల నినాదం కాదని, కోట్లాది హిందువుల ఆకాంక్షను వెలిబుచ్చడమేనని చెప్పారు.