యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించడానికి వలపు వల : పాక్ ముఠాల వ్యూహం: కశ్మీర్‌లో ఇద్దరు మహిళల అరెస్టు.

ఉగ్రవాదంలోకి ఆకర్షించేందుకు పాక్ ముఠాల వ్యూహం
కశ్మీర్‌లో ఇద్దరు మహిళల అరెస్టు
దాదాపు రెండు వారాల కిందట నిఘా వర్గాలు చేపట్టిన ఒక ఆపరేషన్‌లో సయద్ షాజియా అనే మహిళ అరెస్టయ్యింది. ఆమె స్వస్థలం జమ్మూకశ్మీర్‌లోని బాందీపోరా. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక నెట్‌వర్కింగ్ సైట్లలో ఆమె అనేక ఖాతాలను నిర్వహిస్తోంది. వీటిని కశ్మీర్‌లోని అనేక మంది యువకులు అనుసరిస్తున్నారు. అధికారులు ప్రశ్నించినప్పుడు ఆమె సంచలన విషయాలను బయటపెట్టింది. ఉగ్రవాదంలోకి యువతను ఆకట్టుకోవడం కోసం కొందరు మహిళలనూ ఉగ్రవాదుల్లోకి తీసుకున్నట్లు వివరించింది. ఆమె అరెస్టు కావడానికి ఒక వారం ముందు జమ్మూకశ్మీర్ పోలీసులు అయిసియా జాన్ అనే యువతిని అరెస్టు చేశారు. ఆమె వద్ద గ్రెనేడ్లు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
గుట్టు బయటపడింది ఇలా..
కశ్మీర్ లోయలో లష్కరే తొయిబా అధిపతి అబు ఇస్మాయల్‌ను, చోటా ఖాసీంలను శ్రీనగర్ శివార్లలో భద్రతా దళాలు హతమార్చాయి. ఎన్‌కౌంటర్ స్థలంలో లభ్యమైన కొన్ని పత్రాలను పరిశీలించినప్పుడు ఈ ఉగ్రవాదులిద్దరికీ ఆయుధాలు, మందు గుండు సామగ్రిని చేరవేయడంలో ఉత్తర కశ్మీర్‌కు చెందిన గుర్తు తెలియని మహిళ ఒకరికి ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది. సదరు మహిళ పేరు సయద్ షాజియ అని ఈ ఏడాది ఏప్రిల్‌లో అధికారులు గుర్తించారు. అప్పటినుంచి ఆమెకు సంబంధించిన సామాజిక మాధ్యమాల సంభాషణలు, ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) చిరునామాలపై అధికారులు నిరంతరంగా నిఘా పెట్టారు. ఉగ్రవాదంవైపునకు యువతను ఆకర్షించేందుకు వలపు బాణం ప్రయోగించాలని ఆమెకు సరిహద్దు ఆవలి నుంచి నిరంతరం సందేశాలు వస్తున్నట్లు గుర్తించారు. పోలీసు శాఖలోని కొందరు అధికారులతోనూ ఆమె టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. జైషే మహ్మద్ ఉగ్రవాద ముఠాకు చెందిన షెర్వాన్ అలియాస్ అలీతో షాజియా నిత్యం సంప్రదింపుల్లో ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆమె జైష్ ఉగ్రవాద ముఠా కోసం పనిచేయడం మొదలుపెట్టింది. లోయలోని ఇతర ప్రాంతాలకు ఆయుధాలను బట్వాడా చేసే బాధ్యతను ఆమె తీసుకుంది.
Source: 3/12/2018, సోమవారం ఈనాడు దినపత్రిక.
http://www.eenadu.net/news/news.aspx?item=ap-main-news&no=10