ArticlesNews

మాయమైపోయిన విగ్రహాలు ఎలా తిరిగొచ్చాయి?

561views

నకి డ్రగ్‌ మాఫియా తెలుసు..! దేశంలో లక్షల కోట్ల అక్రమ వ్యాపారమది. దాన్ని అరికట్టడానికి ప్రత్యేకంగా ‘నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో'(ఎన్‌సీబీ) ఉంది. మరి విగ్రహాల రవాణా మాఫియా గురించి విన్నారా! ఇది కూడా లక్ష కోట్ల రూపాయల్ని మించిన అక్రమ వాణిజ్యం. కానీ దీన్ని అడ్డుకోవడానికి మాత్రం మన రాష్ట్రాల్లో ఏ ప్రత్యేక విభాగమూ లేదు…! అయితేనేం – ఓ నలుగురి ‘స్వచ్ఛంద’ బృందం ముందుకు కదిలింది. ప్రపంచంలోనే అతిపెద్ద ‘విగ్రహాల డాన్‌’ని ధైర్యంగా ఎదుర్కొని… కటకటాల వెనక్కి నెట్టగలిగింది. కోట్ల రూపాయల విలువైన విగ్రహాలు దేశానికి తిరిగి రావడంలో కీలకపాత్ర పోషించింది. ఏ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాకీ తీసిపోని ఆ కథ… మనకి చెప్పే గుణపాఠాలూ ఎన్నో ఉన్నాయి. రండి చూద్దాం…

‘ప్రి యమైన భారతీయులకి..! మీరు మీ దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు చేసుకుంటున్న వేళ… మేం మా చరిత్రలోని ఓ చీకటి అధ్యాయాన్ని మూసేయాలనుకుంటున్నాం. మీ దేశం నుంచి అక్రమదారుల్లో మా వద్దకు వచ్చిన 14 పురాతన కళాఖండాల్ని తిరిగిచ్చేస్తున్నాం!’ – ఈ సందేశం వచ్చింది ఆస్ట్రేలియా నుంచి. అక్కడి ప్రఖ్యాత నేషనల్‌ ఆర్ట్‌గ్యాలరీ(ఎన్‌జీఏ) నుంచి. తప్పయిపోయిందని చెబుతూ ఆ సంస్థ ఇలా తిరిగి ఇస్తున్నవాటిలో మన తెలుగురాష్ట్రాలకి చెందిన కళాఖండాలూ ఉన్నాయి. ఆ మధ్య అమెరికా కూడా ఇలాగే… అక్రమంగా తమకి చేరిన 200 భారతీయ విగ్రహాలని తిరిగిచ్చేస్తామని ప్రకటించింది. ఈ రెండు దేశాలే కాదు బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు కూడా 1970 తర్వాత అక్కడి నుంచి కళాఖండాలని తిరిగిచ్చేస్తున్నాయి. వీటన్నింటి విలువ సుమారు లక్ష కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా! ఒకప్పుడు ‘భారతీయులకి కళాఖండాల విలువ తెలియదు. అవి మా దగ్గరుంటేనే సేఫ్‌’ అంటూ వితండవాదం చేసిన ఈ దేశాలన్నీ అకస్మాత్తుగా ఇలా మనసెలా మార్చుకున్నాయీ అంటే… ఇదంతా మా దౌత్య వ్యూహాల ఫలితం అంటోంది మన కేంద్రప్రభుత్వం. ‘అవిశ్రాంతంగా మేం చేసిన దర్యాప్తు కూడా ఇందుకు కారణమే’ అంటున్నారు అమెరికా పోలీసులు.

‘మొదట్నుంచీ ఇందుకోసం కృషి చేసింది మేము’ అంటున్నారు తమిళనాడు పోలీసులు. వీళ్లందరి వాదనా కాదనలేనిదేకానీ… వీళ్లకన్నా ముందు ఈ విగ్రహాల దొంగతనాల ఆనుపానుల్ని కనిపెడుతూ వచ్చిన స్వచ్ఛంద బృందం ఒకటి ఉంది. ఆ బృందమే మొట్టమొదటిసారి తమిళనాడు పోలీసులకీ, వాళ్ల ద్వారా అమెరికా దర్యాప్తు అధికారులకీ, ఆ తర్వాత భారతీయ దౌత్య సిబ్బందికీ ‘అక్రమ విగ్రహాల డాన్‌’ సుభాష్‌ కపూర్‌ నేరచరిత్రకి సంబంధించిన సాక్ష్యాధారాలు అందించింది. ఎవరీ సుభాష్‌ కపూర్‌ అంటే… 2010 దాకా పురావస్తువుల కళాపోషకుడిగా మన్ననలు అందుకున్నవాడు. అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయ కుబేరుల్లో ఒకడు. అలాంటివాడు గత పదేళ్లుగా మనదేశంలోని జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. అతని నేరచరిత్రలోకి వెళ్లే ముందు…

చందవరం… ప్రకాశం జిల్లాలో ఇదో చిన్నగ్రామమైనా అక్కడున్న సింగరకొండ ప్రసిద్ధి చెందిన బౌద్ధక్షేత్రం. ఇక్కడున్న స్థూపం సాంచీ తర్వాత అతిపెద్దదని ప్రకటించారు పరిశోధకులు. 1983లో ఇక్కడో మ్యూజియం ఏర్పాటుచేయడంతో… ప్రపంచం నలుమూలల నుంచీ ఇక్కడికి పరిశోధకులు రావడం మొదలుపెట్టారు. పదిహేడేళ్లు ఏ సమస్యా రాలేదుకానీ… 2000 అక్టోబరు 9న పెద్ద చోరీ జరిగింది. మ్యూజియంలోని రెండు భారీ రాతి తోరణాలని పెకిలించి మరీ దోచుకెళ్లారు. అక్కడితో ఆగలేదు… మూణ్నెళ్ల తర్వాత ఓ ట్రాక్టర్‌ని తీసుకొచ్చి- వాచ్‌మ్యాన్‌ని చెట్టుకి కట్టేసి మరికొన్ని అవశేషాలని తీసుకెళ్లారు. దాంతో అక్కడ పోలీసుల్ని కాపలా పెట్టింది ప్రభుత్వం. ఓ రోజు ఆ పోలీసులు మధ్యాహ్నం భోజనానికని వెళ్లాక… ఈసారి వాచ్‌మ్యాన్‌లకి మత్తు మందిచ్చి దోచుకెళ్లింది అదే ముఠా! ఈ వరస సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి. పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత… చందవరంలో దోపిడీకి గురైన ఓ సున్నపురాయి శిల్పం ఆస్ట్రేలియాలోని ‘నేషనల్‌ ఆర్ట్‌ గ్యాలరీ'(ఎన్జీఏ) మ్యూజియంలో బయటపడింది! ఆ మ్యూజియం వాటిని నాలుగున్నర కోట్ల రూపాయలకి కొంది. దాన్ని అమ్మినవాడు ఎవరూ అంటే… సుభాష్‌కపూర్‌!

హైదరాబాద్‌ దారుల్‌ షిఫా రోడ్డులో ‘అజా ఖానా జెహ్రా’ అని ఉంటుంది. మొహర్రం రోజున ఇస్లాం మతస్థులు ఇమాం హుసేన్‌ మరణానికి కన్నీటి నివాళులర్పించే కేంద్రమది. ఆ నివాళి వేళ జరిగే ఊరేగింపులో ‘ఆలమ్‌’ అనే పీర్ల పతకాన్ని వాడతారు. అలాంటి పతకం ఒకదాన్ని చివరి నిజాం రాజు మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ అజా ఖానాకి కానుకగా ఇచ్చాడు.
పంచలోహాలతో చేసిన ఈ ఆలమ్‌ బంగారు పూతతో ఉంటుంది. నిజానికి దీన్ని 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు తన ముస్లిం భటుల కోసం చేయించాడని చెబుతారు. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఇది హైదరాబాద్‌ని ఏలిన గోల్కొండ నవాబుల దగ్గరకీ, అట్నుంచి నిజాం ప్రభువుకీ వచ్చిందట. అంతటి చారిత్రక ప్రాధాన్యమున్న ఈ ఆలమ్‌… 2003 అక్టోబర్‌లో చోరీకి గురయింది. పన్నెండేళ్ల తర్వాత ఇది కూడా ఆస్ట్రేలియాలోని ‘ఎన్జీఏ’లో ఉన్నట్టు తెలిసింది. దీని వెనకా ఉన్నది సుభాష్‌కపూర్‌ హస్తమే!

సుభాష్‌ చంద్ర కపూర్‌ భారతదేశంలోనే పుట్టాడు. దేశవిభజన కాలంలో పాకిస్థాన్‌ నుంచి కాందిశీకులుగా వచ్చిన కుటుంబం అతనిది. విభజనప్పుడు భారతదేశం నుంచి పాకిస్థాన్‌కి వెళ్లిపోయినవాళ్లు వదిలేసిన అరుదైన పుస్తకాలూ, వస్తువుల్ని సేకరించి అమ్మడం మొదలుపెట్టాడు సుభాష్‌కపూర్‌ తండ్రి. అలా దిల్లీలో ఓ ఆర్ట్‌గ్యాలరీ పెట్టే స్థాయికి ఎదిగాడు. తండ్రి, అన్నలతోపాటూ ఆ వ్యాపారం నేర్చుకున్నాడు సుభాష్‌. మెల్లగా అతని దృష్టి భారతీయ కళాఖండాలని అక్రమంగా అమెరికాకి తరలించడంవైపు మళ్లింది. కోల్‌కతా దగ్గర ‘చంద్రకేతుదుర్గ్‌’ అనే పురావస్తు కేంద్రంలో జరిగిన పరిశోధకుల తవ్వకాలు ఇందుకు బాటవేశాయి. ఈ కేంద్రాన్ని 1950-60 మధ్య తవ్వి పరిశోధన చేసిన నిపుణులు… దాన్ని అలాగే వదిలేశారు. అలా వదిలేసిన చోట ఎన్నో అద్భుతమైన టెర్రకోట కళాఖండాలు దొరికాయి. వాటిని అక్రమంగా అమెరికాకి చేరవేయడంతోనే సుభాష్‌కపూర్‌ నేర సామ్రాజ్యం మొదలైంది. కేవలం ఇందుకోసమే 1974లో అమెరికా వచ్చి మన్‌హటన్‌లో ‘ఆర్ట్‌ ఆఫ్‌ పాస్ట్‌’ పేరుతో గ్యాలరీని ఏర్పాటుచేశాడు సుభాష్‌. 1994 దాకా చిన్నాచితక మ్యూజియాలకి కళాఖండాలని అమ్ముతూ ఉండేవాడు. ఆ ఏడాది అమెరికాలోని అతిపెద్ద మ్యూజియం ‘ఆర్ట్‌గ్యాలరీ ఆఫ్‌ న్యూ సౌత్‌వేల్స్‌'(ఏజీఎన్‌ఎస్‌డబ్ల్యూ)కి రెండు టెర్రకోట వస్తువుల్ని విక్రయించగలిగాడు. తొలిసారి ఓ భారీ ఆర్డర్‌ని రుచిచూసిన సుభాష్‌… ఇలాంటి సంస్థలకి రెగ్యులర్‌గా ఇంకా భారీ కళాఖండాల్ని అమ్మాలనుకున్నాడు. ఇందుకోసం మన దేవాలయాల చుట్టూ వలపన్నడం మొదలుపెట్టాడు…

ఇలా చేసేవాడు…

ఒక్క భారతదేశంలోనే సుభాష్‌ కపూర్‌కి మూడు పెద్ద నెట్‌వర్క్‌లుండేవి. సంజీవీ అశోకన్‌, దీనదయాళ్‌, వల్లభ్‌ ప్రకాశ్‌ అనే ముగ్గురు ఏజెంట్లు వాటిని పర్యవేక్షిస్తుండేవారు. భారతదేశంలో సులువుగా చోరీ చేయగల ఆలయాలూ, ఇతర ఆధ్యాత్మిక, చారిత్రక కేంద్రాల సమాచారం వీళ్లు సేకరిస్తారు. స్థానిక దొంగలచేత చోరీ చేయించి పదో పరకో వాళ్లకి పడేస్తారు. ఆ విగ్రహాలని తమ స్టోర్‌ హౌస్‌లో పెట్టి వాటిని పోలిన విగ్రహాలని తయారుచేస్తారు. వాటిని పురావస్తు శాఖకి చూపి ‘ఇవి కొత్త విగ్రహాలు… విదేశాలకి అమ్ముతున్నాం. అనుమతులివ్వండి’ అని అడుగుతారు. అధికారులు ఈ కొత్తవాటికి అనుమతించాక… వాటి స్థానంలో అసలైన పురాతన విగ్రహాలని పెట్టి తీరాలు దాటిస్తారు. సుభాష్‌ ముందుగా వీటిని లండన్‌లోని నీల్‌ పియరీ స్మిత్‌ అనే పునర్నిర్మాణ నిపుణుడికి (రిస్టోరర్స్‌ అంటారు)కి పంపిస్తాడు. విగ్రహాలని పెళ్లగించేటప్పుడూ, రవాణా సమయంలోనూ ఏవైనా పగుళ్లు ఏర్పడితే ఇతను వాటిని సరిచేస్తాడు. అక్కడి నుంచి అమెరికా తెచ్చి తన మాట వినే కళాపరిశోధకుల ద్వారా ఆ విగ్రహాలకి సంబంధించిన బ్రోచర్లు తయారుచేయిస్తాడు. వాటిని ప్రపంచంలోని మ్యూజియమ్‌లన్నింటికీ పంపిస్తాడు! ఎవరు కొనాలనుకున్నా పదికోట్లకి తక్కువకాకుండా అమ్ముతాడు. ఈలోపల ఆ విగ్రహాలన్నీ వివిధ వ్యక్తుల నుంచి 1970కి ముందు(అంటే పురావస్తువుల చట్టం రావడానికి ముందు) కొన్నట్లు దొంగబిల్లుల్ని సృష్టిస్తాడు. ఇలాంటి దొంగ బిల్లులూ సంతకాలూ సృష్టించడానికి ప్రపంచవ్యాప్తంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నోసార్లు ఓ మాజీ భారత రాయబారి భార్య సంతకాలని ఫోర్జరీ చేయించి మ్యూజియాలకి కోట్ల రూపాయల కళాఖండాలు అమ్మేశాడు. అంతేకాదు, మ్యూజియాలని దారికి తెచ్చుకోవడం కోసం కొన్నిసార్లు ఉచితంగానూ ఇస్తాడు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత మెట్‌, వాషింగ్టన్‌లోని స్మిత్‌సోనియన్‌ మ్యూజియాల్లో అడుగడుగునా దాతగా, కళాపోషకుడిగా సుభాష్‌కపూర్‌ పేరు కనిపిస్తుంటుంది!

తొలి వికెట్‌…

సుభాష్‌ కపూర్‌ తరపున దక్షిణాది కార్యకలాపాలు చూసే సంజీవి అశోకన్‌పైన 2008లో చెన్నై పోలీసులకి చిన్నగా అనుమానం మొదలైంది. సంజీవికి సుభాష్‌తో 2006లో పరిచయమైంది. ఇద్దరూ కలిసి పుదుచ్చేరి దగ్గర తమిళనాడు పరిధిలో ఉన్న సుత్తమల్లి గ్రామంలోని పురాతన వరదరాజస్వామి ఆలయంలోనూ, శ్రీపురంథాన్‌ గ్రామంలోని బృహదీశ్వరాలయంలోనూ ఉన్న చోళుల కాలంనాటి 29 విగ్రహాలని కొల్లగొట్టారు. నిజానికి చెన్నై పోలీసులు సంజీవి అశోకన్‌ని ఈ కేసుపైన కాకుండా ఓ చిన్న ఆలయ చోరీ కిందనే అరెస్టు చేశారు కానీ… అకస్మాత్తుగా అతను సుభాష్‌ కపూర్‌ గురించి నోరుజారాడు! దాంతో సుత్తమల్లి ఆలయంలోని భారీ చోరీ వ్యవహారం బయటపడింది. అయినా… సంజీవి ఒక్కడి సాక్ష్యంపైన అమెరికాలో ఉంటున్న సుభాష్‌లాంటి కుబేరుణ్ణి అరెస్టు చేయలేం కదా! ఆ’కళాపోషకుడు’ నా దగ్గర ఆ విగ్రహాలేవీ లేవూ అంటే… ఏం చేస్తారు? పైగా ‘ఫలానా విగ్రహం చోరీకి గురైంది’ అని చెప్పడానికి దాని పాత ఫొటోలు పోలీసుల దగ్గర లేవు. ఈ కేసుల్లో ఆ ఫొటోనే బలమైన ఆధారమవుతుంది. దాంతో అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చారు పోలీసులు. ఇక్కడే మన స్వచ్ఛంద హీరోలు ఎంట్రీ ఇచ్చారు…

ఆ హీరోలు నలుగురు. వివిధ దేశాలకీ రకరకాల వృత్తులకీ చెందినవాళ్లు. ఆలయ శిల్పకళపైనున్న అభిరుచి వాళ్లని కలిపింది. వాటిపైన జరుగుతున్న దోపిడీ కలిసి పనిచేయించింది. ఆ నలుగురికీ సమన్వయకర్త ఎస్‌.విజయ్‌కుమార్‌. సింగపూర్‌లోని ఓ ప్రైవేటు షిప్పింగ్‌ కంపెనీలో పనిచేస్తుంటాడు. సెలవులప్పుడు భారతదేశానికి వచ్చి ఆలయాల్లోని శిల్పకళని అధ్యయనం చేస్తుండేవాడు. ఆ వివరాలు రాయడానికి ‘పొయెట్రీ ఇన్‌ స్టోన్‌’ అనే బ్లాగ్‌ రూపొందించాడు. ఆ బ్లాగ్‌ ద్వారా అతనికి- భారతీయ శిల్పకళపైన అభిరుచి ఉన్న ప్రవాస భారతీయులు కొందరు పరిచయమయ్యారు. ఇక, రెండో హీరో 70 ఏళ్ల కిరీట్‌ మాన్కొడి! ఆయనో ప్రైవేటు ఆర్కియాలజిస్టు. ఉత్తరాది ఆలయరీతుల్ని అధ్యయనం చేస్తుంటాడు. శిల్పాలపైన జరుగుతున్న చోరీల్ని ఎఫ్‌ఐఆర్‌లతో సహా వివరిస్తూ ‘ప్లండర్డ్‌ పాస్ట్‌’ అనే వెబ్‌సైట్‌ నిర్వహిస్తుంటాడు. ఈ బృందంలో మూడో వ్యక్తి జేసన్‌ ఫెల్చ్‌. అంతర్జాతీయ విగ్రహాల దోపిడీపైన ‘ఛేజింగ్‌ అఫ్రోడైటిస్‌’ అనే పుస్తకం రాసి సంచలనం సృష్టించినవాడు. అదే పేరుతో వెబ్‌సైట్‌ కూడా నిర్వహిస్తుంటాడు. ఈ బృందంలో ఉన్న ఏకైక మహిళ మైఖెలా బోలాండ్‌. ఆస్ట్రేలియాలోని ఏబీసీ ఛానెల్‌ జర్నలిస్టు. భారతీయ కళాసంపదపైన చక్కటి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి తను. ఈ నలుగురిలో సుభాష్‌కపూర్‌ని జైల్లో పెట్టడానికి కీలకమైన ఆధారం ఇచ్చినవాడు… విజయ్‌కుమార్‌.

విజయ్‌కుమార్‌ బ్లాగ్‌ని చూసేవాళ్లలో- తమిళనాడు పోలీసు విభాగంలో విగ్రహాల చోరీ విషయాలని దర్యాప్తు చేసే ‘ఐడల్‌ వింగ్‌’ అధికారులూ ఉన్నారు. వాళ్లు సుభాష్‌కపూర్‌ దర్యాప్తు విషయం చెప్పి ‘సుత్తమల్లి’ ఆలయాల్లో ఈ విగ్రహాలకి సంబంధించిన పాత ఫొటోలు కావాలని అడిగారట. ఆ ఫొటోలు అప్పటికి లేకున్నా… పుదుచ్చేరిలో ఉండే ‘ఫ్రెంచ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పాండిచ్చేరి'(ఐఎఫ్‌పీ)లో వాటిని దొరకపుచ్చుకున్నాడు విజయ్‌. అంతేకాదు, ఈ చోరీ విగ్రహాలు సుభాష్‌కపూర్‌ దగ్గరే ఉన్నాయని చెప్పడానికి మరో బలమైన ఆధారం కూడా అందించాడు… అది కూడా ఓ ఫొటోనే! విజయ్‌కుమార్‌ నిర్వహిస్తున్న ‘పొయెట్రీ ఇన్‌ స్టోన్‌’ బ్లాగ్‌కి 2010లో ఓ భారతీయ అమెరికన్‌ ప్రొఫెసర్‌ దాన్ని పంపాడు. ‘నటరాజూ, ఆయన నాట్యం చూస్తున్న శివకామీ’ ఇద్దరూ ఉన్న అరుదైన జంట విగ్రహాలివి. అమెరికా మన్‌హటన్‌లోని సుభాష్‌కపూర్‌కి చెందిన ‘ఆర్ట్‌ ఆఫ్‌ పాస్ట్‌’ గ్యాలరీలో ఇది ఉంది. దానికింద ‘సుత్తమల్లి’ అని కూడా చెక్కి ఉంది. అలా ఊరిపేరుని చెక్కడం చాలా అరుదైన విషయం’ అని రాశాడట ఆ ప్రొఫెసర్‌. గుడిలో చోరీకి ముందు ఐఎఫ్‌పీ ద్వారా సేకరించిన ఫొటోకి, ఈ ప్రొఫెసర్‌ పంపిన చిత్రాన్ని జతచేస్తే రెండూ కలిసి బలమైన ఆధారాలుగా మారాయి. వాటితో సుభాష్‌కపూర్‌ని జర్మనీలో అరెస్టు చేశారు. అమెరికన్‌ పోలీసులూ సుభాష్‌ కపూర్‌ సామ్రాజ్యంపైన దాడులు మొదలుపెట్టారు. ఇందుకోసం ‘ఆపరేషన్‌ హిడన్‌ ఐడల్‌’ పేరుతో జరిపిన ఆ దాడుల్లో సుభాష్‌ కపూర్‌ స్థావరాల నుంచి 2900 కళాఖండాల్ని వెలికి తీశారు. వాటి మొత్తం విలువ ఏడున్నరవేల కోట్ల రూపాయలు! ఇవన్నీ కూడా సుభాష్‌ ఒక ఏడాది వ్యాపారం కోసం అట్టిపెట్టుకున్నవి. ఆ లెక్కన గత 30 ఏళ్లుగా ఈ అక్రమ వాణిజ్యంలో ఉన్న అతను ఎన్ని కోట్లు కొల్లగొట్టి ఉంటాడో ఊహించుకోవచ్చు! అందుకే అమెరికన్‌ ఎఫ్‌బీఐ ‘ప్రపంచం ఇప్పటిదాకా చూసిన అతిపెద్ద స్మగ్లర్‌లలో సుభాష్‌ కపూర్‌ ఒకడు’ అని ప్రకటించింది. ఈ దాడుల్లో అమెరికన్‌ పోలీసులకి ఓ పెద్ద యక్షిణి విగ్రహం దొరికింది. ఆ ఒక్కదానికే రూ.80 కోట్ల ధరపెట్టాడు సుభాష్‌. అది తనకి ఆఫ్రికాలో దొరికినట్టు దొంగ పత్రాల్లో సూచించాడు! ఈ విగ్రహం విషయంలో అమెరికా పోలీసులకి విజయ్‌కుమార్‌ ద్వారా పరిచయమైన కిరీట్‌ మాన్కొడి కీలకపాత్ర పోషించారు. అది మధ్యప్రదేశ్‌లోని ఖత్నీ జిల్లాకి చెందిందని… 2006లో చోరీకి గురైనప్పుడు పోలీసులు వేసిన ఎఫ్‌ఐఆర్‌ సహా అమెరికా పోలీసులకి చూపించారాయన. దాంతో వాళ్లు వెంటనే దాన్ని భారతదేశం పంపించేశారు. అవేకాదు, మరెన్నో విగ్రహాలు వెనక్కి రావడానికి ఆయన సాయపడ్డారు.

ఆ ఇద్దరి ద్వారానే…

చట్టప్రకారం సుభాష్‌ కపూర్‌ అమ్మిన దొంగ సరకుని కోట్లరూపాయలిచ్చి కొన్న మ్యూజియాలన్నీ వాటిని మనదేశానికి తిరిగివ్వాలి. కానీ వాటిని మరీ ఎక్కువ సంఖ్యలో కొన్న ఆస్ట్రేలియాలోని ఎన్జీఏ మ్యూజియం అందుకు నిరాకరించింది! శ్రీపురంథాన్‌ ఆలయంలోని నాలుగడుగుల నటరాజ విగ్రహాన్ని ఇవ్వాలని చెన్నై పోలీసులు లేఖరాసినా పట్టించుకోలేదు. దీనిపైన ఆస్ట్రేలియా పార్లమెంటులో చర్చకి వచ్చినా… ‘సుభాష్‌కపూర్‌ నుంచి కొన్నాం కానీ… అది దొంగ సరకు కాదు!’ అంటూ బుకాయించింది. ఇక్కడే విజయ్‌కుమార్‌ స్నేహితులు జేసన్‌ ఫెల్చ్‌, మైఖెలా బోలాండ్‌ తిరుగులేని పోరాటం చేశారు. జేసన్‌ తన వెబ్‌సైట్‌ ద్వారా విజయ్‌కుమార్‌ సేకరించిన ఫొటోని చూపించి… అది ఆస్ట్రేలియాకి ఏ దొంగమార్గంలో వచ్చిందో నిరూపించాడు. ఆస్ట్రేలియాలో జర్నలిస్టుగా ఉంటున్న మైఖెలా తమ టీవీ, పత్రికల నెట్‌వర్క్‌తో ఓ యుద్ధమే చేసింది. మెల్లగా ఇదో ఉద్యమంలా ప్రజల్లోకి పాకింది. ‘రిటర్నింగ్‌ ఆఫ్‌ ది డ్యాన్సర్‌’ పేరుతో ప్రజలూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. దాంతో ఎన్జీఏకి స్వయంగా ఆస్ట్రేలియా ప్రభుత్వమే గట్టిగా తలంటి… ఆ విగ్రహాల్ని తానే ఇవ్వడానికి ముందుకొచ్చింది. నటరాజు విగ్రహాన్ని 2014లో నాటి ఆస్ట్రేలియా ప్రధాని అబాట్‌… భారత ప్రధానికి లాంఛనంగా అప్పగించారు. మిగిలినవాటిని విడతలవారీగా అందిస్తున్నారు. 2016లో చందవరం బౌద్ధ శిల్పాన్ని అప్పగించారు. తాజాగా ఇస్తామని ప్రకటించిన 14 కళాఖండాల్లో హైదరాబాద్‌కి చెందిన ‘ఆలమ్‌’ కూడా ఉంది.

ఆస్ట్రేలియా తర్వాత సింగపూర్‌లోని ఆసియన్‌ మ్యూజియం కూడా ఇదే దారిపట్టింది. అమెరికా ఇదివరకే 200 విగ్రహాలని ఇస్తామని ముందుకొచ్చింది! అది చూశాక బ్రిటన్‌ కూడా 1950 తర్వాత తమదగ్గరకొచ్చిన కళాఖండాలని ఇవ్వడం ప్రారంభించింది. ఫ్రాన్స్‌ కూడా ఇస్తామంటోంది. వీటి వెనక అటు పోలీసులూ, ఇటు దౌత్యాధికారుల కృషి ఎంతో ఉన్నా… వాటికి సంబంధించిన పాత ఫొటోలూ, కొత్తవీ, ఎఫ్‌ఐఆర్‌లూ అందిస్తూ అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ చేసింది మాత్రం విజయ్‌కుమార్‌, జేసన్‌, మైఖెలా, కిరీట్‌ మాన్కొడిలేనని చెప్పాలి!

ఇంతకీ సుభాష్‌ కపూర్‌ ఇప్పుడెక్కడున్నాడూ అంటే… పదేళ్లుగా బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నా కోర్టులు నిరాకరిస్తూనే ఉన్నాయి. దాంతో విచారణఖైదీగా తిరుచ్చిరాపల్లి జైల్లో ఉన్నాడు. ఒకప్పుడు అత్యంత విలాసంగా బతికిన ఈ కుబేరుణ్ణి ఓ హత్యకేసులో అరెస్టైన సహఖైదీ ఒకడు బాగా కొట్టాడని ఆ మధ్య వార్తలొచ్చాయి. ‘దేవుడు వేసిన శిక్ష ఇది’ అనుకుంటున్నారా… ఆ నమ్మకాలతోనే తృప్తి పడొద్దంటున్నాడు విజయ్‌కుమార్‌! ఎందుకంటే… ఇప్పటికీ మనదేశం నుంచి ఏదోరకంగా విగ్రహాలు తరలిపోతూనే ఉన్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల నుంచే నెలకో కళాఖండం వెళ్తోందని అంచనా. వాటిలో తిరిగొచ్చేవి పదిలో ఒకటేనట! ఈ లూటీని ఆపలేకున్నా… కనీసం మన పరిధిలోని ఆలయాలూ, మసీదులూ, వాటిలో ఉన్న వారసత్వ సంపదని ఫొటోలు తీసిపెట్టుకోమంటున్నాడు.

తద్వారా- మందుముందు మన ఆలయాల్లో ఏదైనా చోరీ జరిగి ఆ వస్తువులు విదేశీ మ్యూజియాల్లో బయటపడితే… మనం దాచుకున్న ఇలాంటి ఫొటోలని చూపించి వాటిని తిరిగి తెచ్చుకోవచ్చంటున్నాడు! మన వారసత్వ సంపద కోసం ఆ మాత్రం చేయలేమా?!

ఈనాడు సౌజన్యంతో…..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.