
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల దారుణాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఎన్నో కొత్త కొత్త నియమాలను, నిబంధనలను తాలిబాన్లు అమలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆడవారిపై కూడా తాలిబాన్ల దృష్టి పడింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న తాలిబాన్లు ఇప్పుడు ఇంటింటికీ వెళ్లి బాలికలు, యువతులు అన్న తేడా లేకుండా నచ్చినవారిని లాక్కెళ్ళిపోతున్నారు. రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదులు ఇప్పుడు 12 సంవత్సరాల పైబడిన వయస్సులో ఉన్న బాలికలను బలవంతంగా ‘పెళ్లి’ చేసుకోవడానికి, వారిని లైంగిక బానిసత్వంలోకి నెట్టడానికి ఇంటింటికీ తిరుగుతున్నారు.
డైలీ మెయిల్ నివేదిక ప్రకారం తాలిబాన్ కమాండర్లు, కొన్ని ప్రావిన్షియల్ రాజధానులను స్వాధీనం చేసుకున్న తర్వాత, తమ సైనికులు ‘ఖనిమాత్’ గా భావించి వివాహం చేసుకోవడానికి 12 నుండి 45 సంవత్సరాల వయస్సు గల అవివాహిత మహిళల జాబితాలను తీసుకురావాలని స్థానిక ఇమామ్‌లను ఆదేశించారు. తీసుకు వచ్చిన మహిళలను పంచుకోవాల్సిందిగా తాలిబాన్లకు వారి హెడ్లు ఆదేశించారు. ఇది యుద్ధంలో గెలిచినందుకు బహుమానంగా భావించాలని సూచించారు. తాలిబాన్ కమాండర్ల ఆదేశాల మేరకు, తాలిబాన్ టెర్రరిస్టులు తమ ‘బహుమతులు’ పొందడానికి ప్రతి ఇంటికీ వెళుతున్నారు. జిహాదీలు తమ లైంగిక బానిసలుగా బలవంతంగా లాక్కెళ్ళడానికి ముందు బాలికల వయస్సును ధృవీకరించడానికి ఆఫ్ఘనీల ఇళ్లలోకి ప్రవేశిస్తున్నట్లు సమాచారం.
ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లోని తన నగరం తాలిబాన్‌ల చేతిలోకి వెళ్ళిన తర్వాత తాను పారిపోవాల్సి వచ్చిందని ఒక మహిళా ఆఫ్ఘన్ జర్నలిస్ట్ తన బాధను వివరించింది. జిహాదీ గ్రూప్ యువతుల కోసం వెతికిందని, తాలిబన్లచే వేటాడబడతామో లేక ఉరితీయబడతామో అనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోవాల్సి వస్తోందని ఆమె చెప్పింది.
Source : Nationalist Hub





