News

భారత్‌-మయన్మార్‌ అంతర్జాతీయ సరిహద్దులో భారీగా ఆయుధాల స్వాధీనం

396views

స్సాం రైఫిల్స్ విభాగం, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో మయన్మార్ నుంచి అక్రమంగా తరలిస్తున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు పారా-మిలిటరీ ట్రూపర్‌లతో, మణిపూర్ పోలీసులతో పాటు చేసిన ఆపరేషన్ లో టెగ్నౌపాల్‌ జిల్లాలోని సరిహద్దు పట్టణమైన మోరేలోని ఒక ఇంట్లో దాచిన ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని కనుగొన్నారు. స్వాధీనం చేసుకున్న మందుగుండు సామగ్రిలో రెండు ఏకే-47 రైఫిల్స్, రెండు ఎం16 రైఫిల్స్, మూడు 9 ఎంఎం పిస్టల్స్, ఒక చైనీస్ మేడ్ గ్రెనేడ్, ఏకే-56, ఎం-16 తొమ్మిది మ్యాగజైన్లు, 9 ఎంఎం పిస్టల్‌తో పాటు నాలుగు మ్యాగజైన్‌లు, 361 లైవ్ రౌండ్లు ఉన్నాయి.

మణిపూర్ పోలీసులు, అసోం రైఫిల్స్ సంయుక్త బృందం మోరే పట్టణం, ఎస్ మోల్జోల్ గ్రామంలోని ఒక వ్యక్తికి చెందిన ఇంట్లో సోదాలు నిర్వహించి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. పలు ఆయుధాల లైవ్‌ రౌండ్లు, చిన్న క్యాలిబర్, ఒక 8ఎక్స్ బైనాక్యులర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సెర్చ్‌ ఆపరేషన్‌ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. అరెస్టులు చేయలేదని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని మోరే పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు.

ఈశాన్యంలోని ఉగ్రవాద సంస్థల నుండి అధునాతన ఆయుధాలకు భారీ డిమాండ్ ఉంది. దాదాపు ప్రతిరోజూ, అస్సాం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వివిధ ఈశాన్య రాష్ట్రాల రాష్ట్ర పోలీసులు పేలుడు పదార్థాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. మయన్మార్ నుండి అక్రమంగా రవాణా చేసే వాటిలో భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉంటున్నాయి. ఇక డ్రగ్స్ వంటివి కూడా దొరుకుతూ ఉంటాయి. జంతువులు, సరీసృపాలు సహా మాదకద్రవ్యాలు, వివిధ ఇతర నిషేధిత వస్తువులు మయన్మార్ నుండి తరచుగా అక్రమంగా రవాణా చేయబడుతున్నాయని అధికారులు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ మరియు నాగాలాండ్‌ ల సరిహద్దుల్లో పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతూ ఉంది.

Source : Nationalist Hub

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.