
వ్యక్తిగా సైతం మనం కేవలం మన హితానికే కాకుండా పరహితం కోసం జీవించడమే జీవిత పరమార్ధంగా భావించడం మన సంస్కృతిలో భాగం. అదేవిధంగా మన దేశం కూడా తన సంరక్షణ, సౌభాగ్యంతో పాటుగా ఎప్పుడూ ప్రపంచ మానవాళి హితాన్ని కాంక్షించే దేశంగానే ఉంటూ వస్తున్నది. అందుకే మన పూర్వీకులు “వసుధైవ కుటుంబకమ్”…. అంటే ఈ భూమండలమంతా ఒకే కుటుంబమన్న విశాల భావనతో ప్రపంచాన్ని దర్శించారు. ఈ భూమండలంలోనే కాదు సకల చరాచర సృష్టిలోని సమస్త జీవరాశీ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
అలాంటి మన పెద్దల వైఖరికి అనుగణంగానే మన ప్రభుత్వం కూడా ప్రస్తుతం ప్రపంచంలోని సుమారు 64 దేశాలలో 300 పైచిలుకు అభివృద్ధి కార్యక్రమాల కోసం 30 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది. వాటిలో సుమారు 240 ప్రాజెక్టులు పూర్తి కావస్తున్నాయి. రోడ్లు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, విద్యుత్ తయారీ మరియు సరఫరా సంస్థల కోసం, వ్యవసాయ, ఉత్పత్తి, వైద్య, విద్య రంగాలలో ఆయా దేశాలలో మన ప్రభుత్వం ఈ నిధులను వ్యయం చేస్తూ ఉన్నది.
వాటిలో ప్రధానంగా 16 బిలియన్ డాలర్లను బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మయన్మార్ వంటి ఆసియా దేశాలలోనే ఖర్చు చేస్తూ ఉండడం గమనార్హం. ఈ దేశాలలో సుమారు 98 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండగా వాటిలో సుమారు 44 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి కూడా.
ఆఫ్ఘనిస్థాన్లోని 34 ప్రావిన్స్ లలో సుమారు 400 పైచిలుకు ప్రాజెక్టులను మన దేశం చేపట్టింది.
అలాగే బంగ్లాదేశ్ లో 31 ప్రాజెక్టులు చేపట్టగా వాటిలో 13 ఇప్పటికే పూర్తయ్యాయి.
నేపాల్ లో 43 ప్రాజెక్టులకు గాను ఇప్పటికే 17 ప్రాజెక్టులు పూర్తయ్యున్నాయి. నిర్మాణ దశలో ఉన్న వాటిలో 4 విద్యుదుత్పత్తి కేంద్రాలుండగా వాటిలో ఒకటి ఇప్పటికే పూర్తయింది.
శ్రీలంకలో మన ప్రభుత్వం చేపట్టిన మొత్తం 19 ప్రాజెక్టులలో 11 ఇప్పటికే పూర్తయ్యాయి.
మయన్మార్ లో చేపట్టిన నాలుగు ప్రాజెక్టులలో 3 ఇప్పటికే పూర్తయినాయి. వాటిలో రైల్వే, రోడ్డు, విద్యుదుత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.
అనేక దేశాలలో అక్కడి స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి దానికి అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతూ ఉన్నది భారత ప్రభుత్వం. 2002 నుంచి 2021 వరకు దక్షిణాఫ్రికాలో మన ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, సేవాకార్యక్రమాలకు గాను మన ప్రభుత్వం 11 బిలియన్ డాలర్లను ఖర్చు చేసింది.
గాంబియాలో జరుగుతున్న పార్లమెంట్ భవన నిర్మాణం, సూడాన్ లో కోస్టి పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం, రువాండాలో జరుగుతున్న నైబరాంగో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం వంటివన్నీ భారత ప్రభుత్వ ఆర్థిక సహకారంతో జరుగుతున్నవే. అలాగే జిబౌటీలో మొట్టమొదటి సిమెంట్ ప్లాంట్ నిర్మాణం భారతదేశ ఆర్థిక సహకారంతోనే జరుగుతూ ఉండటం విశేషం.
అలాగే టాంజానియాలో పర్వత ప్రాంతాల ప్రజల నీటి అవసరాలు తీర్చడం కోసం భారత్ చేపట్టిన ప్రాజెక్టు అక్కడ చుట్టుపక్కల ఉన్న సుమారు 2 మిలియన్ల ప్రజల దాహార్తిని తీరుస్తుంది.
ఇది కాక దక్షిణాఫ్రికా, ఇరాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాలలోని ఎందరో విద్యార్థులకు స్కాలర్షిప్పులనందిస్తోంది భరత ప్రభుత్వం. మన ప్రభుత్వం అందిస్తున్న సాయం ఆయా దేశాల జీడీపీలో సగానికి పైగా వుండడం గమనార్హం.
ఇవి కాక ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ సమయంలో వందకు పైగా దేశాలకు మందులు, వివిధ వైద్య పరికరాలతో పాటు వ్యాక్సిన్లను కూడా భారత్ సరఫరా చేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇప్పుడు భారత్ ఆర్ధిక సహకారం ద్వారా ఆయా దేశాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తాము స్వయంగా చేపట్టాలంటే ఖచ్చితంగా మరో 20 సంవత్సరాలు తప్పక పడుతుంది. అవి ఆ దశకు చేరుకునేటప్పటికి మిగతా ప్రపంచం మరో 20 ఏళ్ళు ముందుకెళ్ళిపోతుంది. అంటే అవి ఎప్పటికీ మిగతా ప్రపంచానికన్నా ఓ ఇరవైయ్యేళ్ళు వెనుకబడే ఉండాలన్నమాట. కానీ ప్రస్తుతం భారత్ అందిస్తున్న సహకారంతో ఆ దేశాల ప్రగతి వేగవంతమవుతుంది.
ప్రపంచంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలపై పెత్తనం చెలాయించే, పెద్దన్ననంటూ జులుం ప్రదర్శించే అగ్రగామి దేశాలెన్నో ఉన్నాయి. కానీ మన దేశం మాత్రం ఆదినుంచి “సర్వేజనా సుఖినో భవంతు” అనే నినాదాన్ననుసరించి విశ్వ మానవాళి సంక్షేమం కోసమే…. శాంతి, సౌభ్రాతృత్వాలే ఊపిరిగా మనుగడ సాగిస్తున్నది.
ఇదంతా చూస్తూ ఉంటే “విశ్వ హితానికి భారతదేశం” అన్న తన నినాదాన్ని, విధానాన్ని అనుసరించి భారత్ ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా భారత్ తన విశ్వగురు స్థానాన్ని తిరిగి అలంకరించడానికి మరెంతో కాలం పట్టదన్న సంగతి మనకర్థమైపోతుంది.





