Articles

రాళ్ళేస్తూ నాలుగు రాళ్ళు సంపాదించుకుంటున్నాం : భారత సైనికులు, పోలీసులపై రాళ్ళేసినందుకు మాకు నెలకు రూ|| 7000లు చెల్లిస్తారు : కాశ్మీర్ యువత వెల్లడి. .

980views

జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని ఒక గుర్తు తెలియని ప్రదేశంలో కాశ్మీర్లో పోలీసులు మరియు సైనికులపై రాళ్ళేసే యువకులు ఇండియా టుడే TV అండర్ కవర్ రిపోర్టర్ల ముందు అసలు గుట్టు విప్పారు. అంతే కాకుండా కాశ్మీర్ లోయలో హిజ్బుల్ ముజాహిద్దిన్ కమాండర్ బుర్హాన్ వని మృతి అనంతరం జరిగిన అల్లర్ల వెనుక అసలు నిజాలను వెల్లడించారు.

జాకీర్ అహ్మద్ భట్, ఫరూక్ అహ్మద్ లోన్, వసిం అహ్మద్ ఖాన్, ముస్తాక్ వీరి, ఇబ్రహీం ఖాన్ తదితర యువకులు సమస్యాత్మక ప్రాంతాల్లో భారత రక్షక దళాలపైన, ప్రభుత్వ వుద్యోగులపైన, ఆస్తులపైన రాళ్ళేసే బృందాలను నడిపిస్తూ వుంటారు.

“రాళ్ళేసే బృందంలోని సభ్యులకు ఒక నెలకు రూ||5000ల నుంచి రూ|| 7000ల వరకు చెల్లిస్తారు. ఒక్కొక్క సారి, బట్టలు, షూస్ కూడా ఇస్తారు” అని భట్ అనే యువకుడు వెల్లడించాడు. 2008 – 2010 మధ్య కాలంలో ఈ రాళ్ళేసే బృందాలు కాశ్మీర్ లోయలో భారీ విధ్వంసాలు సృష్టించాయి. తర్వాతి కాలంలో ప్రభుత్వం పట్ల, అధికారుల పట్ల తమ ఆగ్రహాన్ని ప్రదర్శించటానికి ఇదే వారి ప్రధాన సాధనమైంది.

భట్ గాజు సీసాలు, పెట్రోల్ బాంబులు విసరడంలో సిద్ద హస్తుడు. గత సంవత్సరం బుర్హాన్ వని మృతి చెందిన తర్వాత కాశ్మీర్ వ్యాలీలో పెద్ద ఎత్తున చెలరేగిన అల్లర్లలో భట్ కీలక భూమిక పోషించాడు. ఈ విధంగా చెయ్యడానికి తానేమి చింతించటం లేదని కూడా భట్ చెప్పుకొచ్చాడు. “ మేము రక్షణ దళాలపైన, జమ్మూ కాశ్మీర్ పోలీసులపైన, ఆర్మీ జవాన్లపైన, ఎమ్మేల్యేలపైన, ప్రభుత్వ వాహనాలపైన పలుసార్లు రాళ్ళ దాడులకు తెగబడ్డామని చెప్పుకొచ్చిన ఈ వేర్పాటువాది తమకు నిధులను సమకూరుస్తున్న వారి వివరాలను వెల్లడించడానికి మాత్రం నిరాకరించాడు. “ మేము చావనైనా చస్తాం గాని వాళ్ళ పేర్లను మాత్రం వెల్లడించం. ఎందుకంటే ఇది మా బ్రతుదెరువుకి సంబంధించినది” అని చెప్పుకొచ్చాడు.

బారాముల్లా, సోపూర్, పట్టన్ వంటి చోట్ల రాళ్ళు వేయడానికి ఇతను నియమించబడ్డాడు. “ ఇప్పుడు మనం శుక్రవారాలు మేం ప్రదర్శనలు నిర్వహించే చోటుకు వెళ్తున్నాం” అంటూ ముందుకు కదిలాడు భట్. అతను పెట్రోల్ బాంబులను తయారు చేసి వివిధ ప్రాంతాలకు పంపిస్తాడు, వినియోగిస్తాడు. “ మాకు పెట్రోల్ బాంబుల తయారీకి కావలసిన నిధులు వేరేగా సమకూరుస్తారు” అని చెప్పుకొచ్చాడు భట్. పేలుడు రసాయనాలు, గ్యాస్ నింపిన సీసాలు తయారు చేస్తే ఒక్కొక్క సీసాకు రూ 700 లు చొప్పున చెల్లిస్తారని చెప్పుకొచ్చాడు. “నేను 50 నుంచి 60 బాంబులు తయారు చెయ్యాల్సివుంటుంది. వాటిల్ని మా ప్రదర్శనల సమయం మధ్యలో వచ్చే వాహనాలపై వేస్తాం.” అని కూడా చెప్పుకొచ్చాడు.

వార్తల ప్రకారం గత సంవత్సరం జూలై నుంచి అక్టోబర్ మధ్యలో రాళ్లు విసిరే మూకలు, భద్రతా దళాల మధ్య జరిగిన గొడవల్లో దాదాపు 19000 ల మంది ప్రజలు గాయపడ్డారు, 92 మంది చనిపోయారు. 4000 ల మంది రక్షణ సిబ్బంది గాయపడి ఉంటారని అంచనా. ఇద్దరు జవానులు మృతి చెందారు. కాని ఫరూక్ అహ్మద్ లోన్ వంటి యువకులకు రాళ్ళు విసరటమే జీవనాధారం.

“ఇలాంటి అల్లర్లను నడపడం ద్వారా నాకు ఒక రోజుకి వెయ్యి నుంచి ఐదు వేల వరకు ఆదాయముంటుంది” అని చెప్తున్నాడు అహ్మద్.

“ మేము 2008 నుంచి ఇలా రాళ్ళు విసిరే పనిలో వున్నాం.” అని చెబుతున్న వసిం అహ్మద్ ఖాన్ రాళ్ళు విసరడం ద్వారా తనకు నెలకు 5000ల నుంచి 6000ల వరకు ఆదాయం లభిస్తుందని చెబుతున్నాడు. వీరీ అనే యువకుడి విషయానికి వస్తే అతను వారాంతాల్లో రోజుకు 7 వందలు, పవిత్ర శుక్రవారాల్లో అయితే వెయ్యి రూపాయలు సంపాదించుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.

“ అయితే మీకు పైకం చెల్లించే వ్యక్తి మీ ఊరి వాడేనా?” అని ప్రశ్నించిన ఇండియా టుడే రిపోర్టర్ కు “అతను నా స్నేహితునికి తెలిసిన వాడు. అప్పుడప్పుడూ వస్తూ ఉంటాడు”. అని మాత్రమే చెప్పాడు తప్ప అతని పేరు వెల్లడించటానికి మాత్రం ఇష్ట పడలేదు. తమకు పైకం చెల్లించే వారి పేర్లను వెల్లడిస్తే భవిష్యత్తులో తాము ఆ పని చెయ్యడానికి వీలుండదన్నది వారి భయం.

తమ రహస్య నేతలు జమ్మూ కాశ్మీర్ లోని వివిధ ప్రాంతాల్లో రాళ్ళు విసిరే కార్యక్రమాన్ని ఇంటర్నెట్ సాయంతో పర్యవేక్షిస్తారని ఇబ్రహీం ఖాన్ అనే యువకుడు చెప్పుకొచ్చాడు. ఏ ప్రాంతంలో దాడులు చెయ్యాలి, దేని లక్ష్యంగా దాడులు చెయ్యాలి, ఎవరు దాడులు చెయ్యాలి అనే వివరాలు తమకు వాట్సప్ గ్రూపుల ద్వారా అందుతాయని ఖాన్ వెల్లడించాడు. పోలీసులపైన, సైనికులపైన దాడులు చెయ్యమని తమకు స్పష్టమైన ఆదేశాలున్నాయని ఈ కార్యకలాపాల ద్వారా నెలకు రూ|| 20,000ల వరకూ సంపాదించే ఖాన్ చెప్పుకొచ్చాడు.

“దాడులలో పాల్గొనడం కోసం నియమించబడిన యువకులకు ఏ మాత్రం చెల్లిస్తారు?” అని ప్రశ్నించిన టీవీ రిపోర్టర్ తో అది వారి వారి శారీరిక దారుఢ్యాన్ని బట్టి ఉంటుందని చెప్పాడు భట్. మంచి దేహ దారుఢ్యం వుండే యువకులకు నెలకు 7000ల నుంచి 7500ల వరకు చెల్లిస్తారని, అదే కొంచెం బలహీనంగా వుండే వారికైతే 5000ల నుంచి 5500ల వరకూ చెల్లిస్తారని పన్నెండేళ్ళ లోపు పిల్లలకైతే రూ||4000లు చెల్లిస్తారని వెల్లడించాడు.

“ మేము 2014లో ఒక బ్రిడ్జిపై ఆగివున్న ఒక వాహనంపై పెట్రోల్ బాంబులు వేశాం. ఇద్దరు వ్యక్తులు మాడి పొయ్యారు”. అంటూ గర్వంగా చెప్పుకొచ్చాడు భట్. తాను ఇప్పటి వరకు కనీసం 30 నుంచి 35 మంది రక్షణ బలగాలకు చెందిన వ్యక్తులను గాయ పరచి ఉంటానని వీరి చెప్పుకొచ్చాడు. “నేను PSA [పబ్లిక్ సేఫ్టీ యాక్ట్] కింద అరెస్టై ఆర్నెల్లు జైల్లో వుండొచ్చాను.” అని చెప్పుకొచ్చాడు వీరి. 2009 లో ఇదే సెక్షనుపై ఏడాది పాటు జైల్లో గడిపొచ్చిన వసిం అహ్మద్ ఖాన్ తాను పోలేసులపైన, సైనికులపైన, ప్రభుత్వ వాహనాలపైన అనేక సందర్భాలలో దాడులు చేసినట్లు చెప్పుకున్నాడు.

ఏది ఏమైనా భారత్ ను బలహీన పరచే పొరుగు దేశాల కుట్రలలో అన్నెం పుణ్యం ఎరుగని చిన్నారులు సైతం సమిధలుగా మారుతూ ఉండడమే అతి పెద్ద విషాదం. అదే సమయంలో కాశ్మీర్ ప్రజల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని, వారిలో మత భావనలు రెచ్చగొట్టి స్వదేశం మీదకే ఉసిగొలిపేందుకు వారిని పావులుగా వాడుకునే పొరుగు దేశం కుట్రలు ఇండియా టుడే పరిశోధనతో మరో సారి ప్రపంచానికి వెల్లడయ్యాయి. ఈ నిజాల వెల్లడితోనన్నాకాశ్మీర్ విషయంలో ప్రపంచ దేశాలకు స్పష్టత వస్తే అంతే చాలు.

SOURCE: DAILY MAIL.