
అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో ఆలయ నిర్మాణానికి సమయం ఆసన్నమైంది.
కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామ చంద్రుడు. మర్యాదా పురుషోత్తముడు, ధర్మానికి నిలువెత్తు రూపం. యుగ యుగాలుగా తర తరాలుగా మనందరికీ ఆదర్శ పురుషుడు. ఒక పుత్రుడిగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక రాజుగా అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తమ మానవుడిగా ఆదర్శ జీవనానికి చిరునామా శ్రీరామ చంద్రుడు.
అట్టి శ్రీరామ చంద్రుని జన్మభూమి అయోధ్య. సగరుడు, భగీరధుడు, సత్య హరిశ్చంద్రుడు వంటి మహాపురుషుల పరంపరలో జన్మించిన మహా పరాక్రమశాలి, సత్యవాక్పరిపాలకుడు, ఏక పత్నీ వ్రతుడు మన శ్రీరామ చంద్రుడు. శ్రీరామ చంద్రుని జన్మ స్థలమైన కారణంగా అయోధ్య సప్త పురాలలో ఒకటిగా ప్రఖ్యాతి గాంచింది. అయోధ్య మందిరాల నగరం. అక్కడ వేలాది మందిరాలున్నాయ్. అనీ శ్రీరామునివే. ఆ కౌసల్యా సుతుడు నడయాడిన ఆ పుణ్య భువిలో అడుగడుగునా ఆయన స్మృతి మందిరాలే.
అయితే ఆ సాక్షాత్తూ ఆ శ్రీరామ చంద్రుడే జన్మించాడని, ఆయనకు కౌసల్యా దేవి జన్మనిచ్చిన ఆ మందిరం అక్కడనే ఉండినదని యుగాలుగా హిందువులు భావిస్తూ, విశ్వసిస్తూ వచ్చిన ఆ పవిత్ర భూభాగం శతాబ్దాలుగా విదేశీ దురాక్రమణదారుడు బాబర్ మిగిల్చిపోయిన కళంకాన్ని మోసింది. అయితే డిసెంబర్ 6, 1992న లక్షలాది హిందువుల సంఘటిత శక్తి ముందు ఆ వివాదాస్పద కట్టడం పేకమేడలా నేలకొరిగిన ఒకటిన్నర దశాబ్దాల తర్వాత కూడా ఆ భూభాగంలో రామ జన్మభూమి న్యాస్ తలపెట్టిన భవ్య మందిర నిర్మాణం ఎందుకు జరగలేదు?
ఓసారి చరిత్రను పరికిద్దాం:
శ్రీరామ జన్మభూమిలో ఎప్పటినుండో ఒక భవ్య విశాల మందిరం వెలసి వుంది. క్రీ. శ 1526లో బాబర్ భారతదేశంపై దాడి చేశాడు. 1528లో అయోధ్య చేరాడు. బాబర్ ఆదేశంపై బాబర్ సేనాని మీర్ బాకీ ఫిరంగులతో జన్మభూమిలోని మందిరాన్ని ఒపెల్చివేయడానికి విఫల యత్నం చేశాడు. అది సాధ్యం కాలేదు. 15 రోజులు స్థానిక హిందువులు తీవ్ర ప్రతిఘటన చేశారు. లక్షా డెబ్భై నాలుగు వేల మంది హిందువులు బలిదానమయ్యారు. చివరికి ఆ మందిరం పైనే మశీదు వంటి భవనాన్ని పైపైన మీర్బాకీ నిర్మించాడు. దార్వేష్ మూసా అసీఖాన్ సలహా మేరకు ఈ పని సాధ్యమైంది. ఈ దుష్క్రుత్యంతో హిందూ సమాజం మస్తిష్కంలో ఎప్పటికీ నిలచిపోయే అవమానకర కళంకం ఏర్పడింది. ఈ స్థలాన్ని తిరిగి స్వాధీన పరచుకోవడానికి అయోధ్య హిందూ సమాజం 1528వ సంవత్సరం నుండి నిరంతర సంఘర్షణ చేస్తూ వస్తున్నది. 1528 నుండి పందొమ్మిది వందలా నలభై తొమ్మిది వరకు జన్మభూమిని స్వాధీన పరచుకోడానికి డెబ్భయ్యారు యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలలో హిందూ సమాజానికి పూర్తి విజయం లభించలేదు. అయినప్పటికీ సమాజం ఎన్నడూ తన ధైర్యాన్ని కోల్పోలేదు. బీభాత్సకారులను ఎన్నడూ ప్రశాంతంగా కూర్చోనివ్వలేదు. మళ్ళీ మళ్ళీ పోరాటం చేస్తూనే వుంది. ప్రతి పోరాటంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూనే వుంది. 1934లో జరిగిన పోరాటంలో అయోధ్య ప్రజలు గుమ్మటాలకు భారీ నష్టం కలిగించారు. ఈ సంఘర్షణలన్నింటిలో రామ భక్తులు తమ సర్వస్వాన్ని సమర్పణ చేసి ఆహుతయ్యారు. 1990 అక్టోబర్ 30న సాధు సంతులు అయోధ్యలో కరసేవ తలపెట్టారు. ఆనాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ములాయం సింగ్ యాదవ్ “అయోధ్యలో పక్షి కూడా తన రెక్క కదల్చలేదు” అని ప్రకటన చేశారు.అయోధ్యకు వెళ్ళే అన్ని మార్గాలనూ మూయించివేశారు. అన్ని రైలు బండ్లను రద్దు చేయించారు. అయినప్పటికీ 1990 అక్టోబరు 30న రామభక్తులు వానరుల వలె గుమ్మటాల పైకెక్కి భాగావాధ్వజాన్ని ఎగురవేశారు. 1990 నవంబరు 2న ప్రభుత్వం కాల్పులు జరిపించింది. గుమ్మటాలపై ధ్వజం ఎగురవేసిన కలకత్తా నివాసులైన కోతారీ సోదరులలో ఒకరిని ఇంటి నుండి బయటకు లాగి కాల్చివేశారు. చిన్నవాడు అన్నాను కాపాడడానికి వస్తే అతనిని కూడా అక్కడే కాల్చివేశారు. ఈ నిరంతర సంఘర్షణలకు అంతిమ పరిణామం 1992 డిసెంబర్ 6నాటి సంఘటన. ఆనాడు బానిసత్వానికి ప్రతీకగా నిలచిన మూడు గుమ్మటాల కట్టడం కూలిపోయింది. శ్రీరామ జన్మ భూమిలో మళ్ళీ మందిర నిర్మాణానికి మార్గం తెరువబడింది.
తాత్కాలిక మందిర నిర్మాణం:
1992 డిసెంబరు 6న ఆ కట్టడం కూలిపోయిన తర్వాత వెంటనే ఆనాడు మధ్యన ఉన్న గుమ్మటం స్థలంలోనే భగవానుని సింహాసనం స్థాపించి, ఆ కట్టడం క్రిందనే పరంపరగా ఉంటూ కొనసాగుతున్న బాలరాముని విగ్రహాన్ని ఆ సింహాసనంపై వుంచి పూజ ప్రారంభం చేయబడింది. వేలాదిమంది భక్తులు రాత్రింబవళ్ళు సుమారు 36 గంటలు కష్టపడి పనిముట్లు [సాధనాలు] లేకుండా కేవలం చేతులతో ఆ స్థలం నాలుగు మూలల్లో దుడ్డుకర్రలు పాతి, బట్టలు చుట్టారు. ఇటుకలతో గోడకట్టి మందిరం పూర్తి చేశారు. ఈనాడు కూడా ఆ స్థలంలోనే పూజ జరుగుతున్నది. దానికి ఇప్పుడు భవ్యమైన రూపం ఇవ్వాలి.
భవ్య మందిర నిర్మాణానికి ఏర్పాట్లు: కేవలం శిలలతోనే నిర్మించ తలపెట్టిన ఈ మందిరం యొక్క గోడలు, స్తంభాలు, ద్వార బంధాలు, నిర్మాణానికి ఉపయోగించే రాళ్ళను చెక్కడానికి అయోధ్య, రాజస్థాన్ యొక్క పిండవాడ మరియు మక్రానాలలో కార్యశాలలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు దాదాపు మందిర నిర్మాణానికి అవరమయ్యే అన్ని శిలలు తయారయ్యాయి.
అయోధ్య వివాదంపై కోర్టు కేసులు, పరిణామాలు:
శ్రీరామ జన్మభూమిపై హిందువుల వైపునుండి జిల్లా కోర్టులో మొదటి కేసు 1950 జనవరిలో వేయబడింది. రెండవ కేసు రామానంద సంప్రదాయం యొక్క నిర్మోహి అఖాడా వైపు నిండి పంతొమ్మిది వందలా యాభై తొమ్మిదిలో వేయబడింది. సున్నీ ముస్లిం వక్ఫ్ బోర్డు వైపునుండి 1961 డిసెంబరులో కేసు వేయబడింది. 40 సంవత్సరాల వరకు ఫైజాబాదుజిల్లా కోర్టులో ఈ కేసులు అవిధంగానే పడివున్నాయి. పంతొమ్మిది వందలా ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి దేవకీనందన్ అగర్వాల్ [స్వర్గస్తులు] స్వయంగా బాలరాముడు మరియు జన్మభూమిని వాడిగా పేర్కొంటూ న్యాయస్థానంలో దావా వేశారు. దావా స్వీకరించబడినది.అన్ని కేసులూ ఒకే స్థలానికి సంబంధించినవి కావున అన్నింటిని ఒక చోటికి చేర్చి ఒకేసారి తీర్పు వినిపించేందుకు ఉత్తర్వులు ఇవ్వబడ్డాయి. సున్నితమైన ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ, కేసులన్నిటినీ జిల్లా కోర్టు నుండి ఎత్తివేసి హైకోర్టు బెంచికి మార్చివేయడం జరిగింది. ఇద్దరు హిందూ న్యాయమూర్తులు, ఒక ముస్లిం న్యాయమూర్తితో కూడిన బెంచ్ ఏర్పాటైంది.ఈ బెంచ్ సమక్షంలో 20 సంవత్సరాల పాటు కేసుల వాదనలు వినిపించటం జరిగింది. ఈ బెంచి 12 సార్లు మార్పులతో ఏర్పాటు చేయబడింది.
30 సెప్టెంబర్ 2010న జస్టిస్ అగర్వాల్, జస్టిస్ డీ.వీ. శర్మ, జస్టిస్ సిబగతుల్లా ఖాన్లతో కూడిన లక్నో ధర్మాసనం హిందువుల విశ్వాసాల ప్రకారం ప్రధాన గుమ్మటం క్రింద రామ్లాలా విగ్రహం వున్నచోటును రామజన్మభూమిగా నిర్ధారిస్తూ, సువిశాలమైన వివాదాస్పద ఆవరణలో దేవాలయ శిధిలాల పైనే మశీదు నిర్మాణం జరిగిందనే విషయాన్ని ధృవీకరిస్తూ, దానికి తగిన చారిత్రిక, పురావస్తు ఆధారాలున్నాయని నిర్ధారిస్తూ, దశాబ్దాలుగా హిందువులు, ముస్లిములు వివాదాస్పద ప్రాంతాన్ని వాడుకొంటున్నందున మధ్య గుమ్మటం క్రింద వున్నా భూమిని తాత్కాలిక రాంలాలాకు కేటాయిస్తూ, మొత్తం భూభాగాన్ని రాంలాలా విరాజమాన్కు , నిర్మోహి అఖాడాకు, సున్నే వక్ఫ్ బోర్డుకు ఒక్కొక్కరికి 1/౩ వ వంతు భూభాగాన్ని సమానంగా కేటాయించాలని పేర్కొంటూ తన ఏడు వేలా నూట ఎనభై ఐదు పేజీల తీర్పును వెల్లడించింది.
ఆ వెనువెంటనే కేసు సుప్రీమ్ కోర్టుకు అప్పీలు చేయబడింది. నాటి నుంచి యావద్దేశంలోని ప్రజలు సుప్రీమ్ తీర్పు కోసమా ఎదురు చూస్తూ వున్నారు. 2018 అక్టోబర్ 28 నాటికి అయోధ్య అంశంపై తీర్పు వెలువడుతుందని ఆశతో యావత్ హిందూ సమాజము ఎదిరు చూసింది. అయితే అయోధ్య పై తీర్పుకు తొందరేమీ లేదని సుప్రీమ్ తీర్పును వాయిదా వెయ్యడంతో ఉసూరుమంది.
హిందూ సంస్థలు, సాధు సంతులు కోరుతున్నదేమిటి?:
శ్రీరామ జన్మభూమి సాధారణ భూమి కాదని, అది హిందువుల శ్రద్దా కేంద్రమని, అందువలన ఈ వివాదం కేవలం ఆస్తికి సంబంధించిన వివాదం కాదని, ఈ కారణంగా ఇది కోర్టు పరిధిలోనికి వచ్చేది కాదని, విశ్వాసాలపై కోర్టులు సరియైన తీర్పులు ఇవ్వలేవనే విషయం ఈ మధ్య అనేక కేసుల విషయంలో రుజువవుతూనే వుందని, కోర్టు తీరుకి ఇక నిరీక్షించజాలమని హిందూ సంస్థలు, సాధుసంతులు అభిప్రాయపడుతున్నారు. అందుకోసమే దీనికొరకు ఒక కార్యాచరణ రూపొందించుకొంటున్నారు. సంత్ ఉచ్చాధికార సమితి అక్టోబర్ 5 2018న సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని తదనుగుణంగా గౌరవ రాష్ట్రపతిని కలిసి అభ్యర్థనపత్రం సమర్పించటం జరిగింది.
సోమనాధ మందిరం విషయంలో జరిగినట్లుగా అయోధ్యలో మందిర నిర్మాణానికి పార్లమెంటులో చట్టం చేసి శ్రీరామ జన్మ భూమిని హిందూ సమాజానికి అప్పగించాలని వారు ప్రభుత్వాన్ని అభ్యర్దిస్తున్నారు. నిజానికి మందిర నిర్మాణానానికి అదొక్కటే మార్గం కూడా. దీని కోసం 2018 నవంబరు 25 నుంచి డిసెంబరు 9 వరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలోనూ భారీ ఎత్తున సంకల్ప సభలు, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. అయోధ్య, డిల్లీ, ముంబై వంటి నగరాలలో లక్షల మంది రామభక్తులు పాల్గొనే అవకాశముందని భావిస్తున్నారు. ఏదేమైనా అనేక దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోక నలుగుతున్న ఈ సమస్యకు న్యాయబద్దమైన పరిష్కారం లభించాలని కోరుకుందాం.
Article prepared by : Syam Prasad Korsipati





