News

ప్రపంచ దేశాలతో స్నేహమే భారత్ ఉద్దేశం… జి7 సదస్సులో మోడీ

495views

జీ 7తో సహా ప్రపంచంలోని అన్ని దేశాలతో భారత్‌ స్నేహాన్నే కోరుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. నిరంకుశత్వం, తప్పుడు సమాచారం, ఉగ్రవాదం, తీవ్రవాదం, ఆర్థికపరమైన ఒత్తిడి.. తదితరాల నుంచి ఉద్భవించే సవాళ్ల నుంచి సభ్యదేశాల భాగస్వామ్య విలువలను రక్షించుకునే దిశగా భారత్‌ తన కృషిని కొనసాగిస్తుందన్నారు. ‘జీ 7’ సదస్సులో ‘ఓపెన్‌ సొసైటీస్‌ అండ్‌ ఓపెన్‌ ఎకానమీస్‌’ అంశంపై ప్రధాని మోడీ ఆదివారం వర్చువల్‌గా ప్రసంగించారు.

ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ హక్కులకు భారత్‌ కట్టుబడి ఉందన్న విషయాన్ని ప్రధాని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఆధార్, ప్రత్యక్ష నగదు బదిలీ, జామ్‌ (జన్‌ధన్‌–ఆధార్‌– మొబైల్‌ అనుసంధానం)లను ఉటంకిస్తూ సామాజిక సమ్మిళితం, సాధికారతను సాధించడంలో సాంకేతికతను భారత్‌ ఎలా ఉపయోగించుకుందో వివరించారు. స్వేచ్ఛాయుత సమాజాల్లో దాగి ఉన్న ముప్పుపై హెచ్చరిస్తూ.. టెక్నాలజీ సంస్థలు, సోషల్‌ మీడియా సంస్థలు తమ వినియోగదారులకు సురక్షిత సైబర్‌ వాతావరణాన్ని అందించాల్సి ఉందన్నారు. ప్రధాని ప్రసంగ వివరాలను విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి పీ హరీశ్‌ మీడియాకు తెలిపారు.

స్వాగతించిన సభ్య దేశాలు..

ప్రధాని మోడీ అభిప్రాయాలను కార్యక్రమంలో పాల్గొన్న ఇతర నేతలు స్వాగతించారు. ‘స్చేచ్ఛాయుత, అంతర్జాతీయ నియమానుసార ఇండో పసిఫిక్‌ ప్రాంతం కోసం కృషి చేస్తామని ‘జీ 7’ నేతలు స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో మిత్రదేశాలతో కలిసి పనిచేస్తామన్నారు’ అని హరీశ్‌ వివరించారు. కోవిడ్‌ టీకాలకు పేటెంట్‌ మినహాయింపు కోరుతూ భారత్, దక్షిణాఫ్రికాలు చేసిన ప్రతిపాదనకు జీ7 సదస్సులో విస్తృత మద్దతు లభించిందన్నారు. జీ 7 సభ్య దేశాలుగా యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికా ఉన్నాయి. గ్రూప్‌ అధ్యక్ష స్థానంలో ఉన్న యూకే భారత్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికాలను అతిథి దేశాలుగా ఈ సదస్సుకు ఆహ్వానించింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.