
చైనా జనాభా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో స్థిరపడింది. దీంతో వారిని వాడుకొని డ్రాగన్ భారీగా సమాచారం సేకరిస్తోంది. ప్రస్తుత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోబల్ 2013లో చైనా నిఘా కార్యకలాపాలపై ఒక అధ్యయనపత్రాన్ని రాశారు. చైనా వ్యాపార సంస్థలు, మీడియా, బ్యాంకులు, 180 దేశాల్లోని కన్ఫ్యూషియస్ సంస్థలను వాడుకొంటుందని తెలిపారు. తాజాగా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పట్టుబడిన చైనా దేశస్థుడు హాన్ జున్వే పదేళ్లకు పైగా గూఢచారిగా పనిచేస్తున్నాడని తేలింది. అతను హోటల్ నిర్వహిస్తుండటం గమనార్హం. అసలే సరిహద్దు వివాదం రగులుతున్న సమయంలో చైనా గూఢచర్య కార్యకలాపాలు ఆందోళనకరంగా మారాయి.
ఎక్కడా సమాచారం ఉండదు..
ప్రపంచంలోనే అతి శక్తివంతమైన గూఢచర్య నెట్‌వర్క్ చైనాకు ఉంది. కానీ, అది చాలా నిశ్శబ్దంగా పనిచేస్తుంది. ఎటువంటి ప్రచార ఆర్భాటం ఉండదు. వీరు ప్రత్యర్థి దేశాలకు చెందిన కీలక వ్యవస్థల్లోకి చొరబడి ఉంటారు. అక్కడి చట్టాలను వాడుకొంటారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ స్టడీస్‌కు చెందిన డాక్టర్ సుభాష్ కపిల దాదాపు 20 ఏళ్ల కిందటే చైనా ఇంటెలిజెన్స్ సర్వీస్ పనితీరును విశ్లేషించారు.
చైనా నిఘా సంస్థను ‘మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సర్వీస్’ అని పిలుస్తారు. నిఘా సంస్థ అంటే రహస్యంగానే ఉండాలి.. అన్న సిద్ధాంతాన్ని చైనా బలంగా నమ్ముతుంది. అందుకే ఈ సంస్థ గురించి ఎక్కడా సమాచారం లభించదు. దానికి సంబంధించిన ఎటువంటి పుస్తకాలు కూడా పబ్లిష్ చేయదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా దీనిపై చర్చకు అవకాశం ఉండకుండా చేస్తుంది. దీంతో ఈ సంస్థపైకి ఎవరి దృష్టి పెద్దగా ఉండదు. భారత్‌లో కూడా మీడియా,రాజకీయ నాయకులు పాక్ ఇంటెలిజెన్స్ సర్వీసుపై ఎక్కువ దృష్టి నిలుపుతారు కానీ, చైనా విషయం పట్టించుకోరు. వాస్తవానికి బ్రిటిష్ పాలకుల సమయం నుంచే చైనా వేగులు భారత్‌లో పనిచేయడం మొదలుపెట్టారు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా పశ్చిమ దేశాల పక్షాన నిలవడంతో దాని వేగులకు భారత్‌లో పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. జపాన్‌కు వ్యతిరేకంగా బ్రిటిష్‌వారికి వీరు సాయపడ్డారు. యుద్ధ సమయంలో భారత్‌లో ఉన్న వేగులతో 1949 తర్వాత చైనా ఏర్పడ్డాక అవసరమైన ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేశారు.
1950,1960 సమయంలో చైనా ఇంటెలిజెన్స్ సంస్థలు భారత్‌లో కొన్ని కీలక ఆపరేషన్లు నిర్వహించాయి. టిబెట్ ఆక్రమణ సమయంలో భారీ సంఖ్యలో ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌ను అక్కడకు తరలించింది. వారు ఆక్రమణ తర్వాత ఇండో-టిబెట్ సరిహద్దుల్లో స్థిరపడ్డారు. ఆ తర్వాత భారత్‌లోగూఢచర్యం మొదలు పెట్టారు. టిబెట్‌లోని లాసాలో బోర్డర్ అఫైర్స్ ఆఫీస్ పేరుతో ఒక నిఘా కార్యలయాన్ని చైనా తెరిచింది. దాదాపు నాలుగు వందల మందిని ఇందులో నియమించింది. 1960 నుంచి ఈశాన్య భారత్‌లో వేర్పాటు వాదానికి చైనా ఇంటెలిజెన్స్ సంస్థలే కారణం అయ్యాయి. అప్పట్లో భారత్ రష్యాతో సన్నిహతంగా ఉండేది. దీంతో అమెరికాకు చెందిన సీఐఏ, చైనాకు చెందిన సీఐఎస్‌లు భారత్‌కు వ్యతిరేకంగా చేతులు కలిపాయి. చైనా నిఘా సంస్థలు భారత్‌లోని కొన్ని కీలక సమాచారాలను సేకరించడంపైనే దృష్టిపెడతాయి.
* అణ్వాయుధ మోహరింపులు, కమాండ్ కంట్రోల్ వివరాలు.
* క్షిపణుల అభివృద్ధి కార్యక్రమం, మోహరింపులు, సామర్థ్యాలు.
* భారత సైన్యంలో ఐటీ పరంగా చేస్తున్న మార్పులు చేర్పులు.
* అంతరిక్ష రంగంలో భారత పరిశోధనలు. ఉపగ్రహాల నిఘా సమాచారం.
* భారత్-అమెరికా సంబంధాలపై ఎక్కువ దృష్టిపెడుతుంది.
కొన్నాళ్ల కిందట గ్రీకు పత్రిక పెంటాపోస్టాగ్మా చైనా గూఢచర్యంలోని ఓ భాగాన్ని వెలుగులోకి తెచ్చింది. చైనా ‘వెయ్యి ఇసుక రేణువులు’ (థౌజండ్ గ్రెయిన్స్ ఆఫ్ శాండ్) విధానంలో సమాచార సేకరణ చేస్తుందని వెల్లడించింది. వేర్వేరు మార్గాల్లో సేకరించిన సమాచారాన్ని ఒక దగ్గరచేర్చి విశ్లేషించడమే దీని ప్రత్యేకత.
చైనా జిన్హూవా అనే న్యూస్ ఏజెన్సీ ఇంటెలిజెన్స్‌లో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోందని ఆ పత్రిక వెల్లడించింది. జిన్హూవా వార్తా సంస్థకు ఎనిమిది వేర్వేరు భాషల్లో దాదాపు 20 పత్రికలు.. డజను మ్యాగ్జైన్‌లు ఉన్నాయి. వివిధ దేశాల్లో దాదాపు 107 బ్యూరోలు పనిచేస్తున్నాయి. ఈ సంస్థకు విదేశాల్లోనే దాదాపు 10,000 మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు.
ఇది చైనా కమ్యూనిస్టు పార్టీ , నాయకులకు సంబంధించి సానుకూల ప్రచారం చేస్తుంది. దీంతోపాటు వారిపై వచ్చే వ్యతిరేక కథనాలను సాధ్యమైనంత వరకు ఆదిలోనే తుంచివేస్తుంది. జిన్హూవా న్యూస్ ఏజెన్సీ ప్రపంచంలోని వివిధప్రాంతాల్లో వార్తలను కవర్ చేస్తుంది. అదే సమయంలో చైనాకు, కమ్యూనిస్టు పార్టీ నాయకత్వానికి అవసరం అనుకొన్న వార్తలపై నివేదికలు తయారు చేసి చైనా స్టేట్ సెక్యూరిటీ మినిస్ట్రీకి పంపిస్తుంది.
అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే చైనా విద్యార్థులను నిఘా కార్యకలాపాలకు వాడుకొంటుంది. అమెరికా విశ్వవిద్యాలయాల్లోని చైనా విద్యార్థులపై నిఘా ఉంచడానికి అక్కడి కన్ఫ్యూషియాస్ ఇన్‌స్టిట్యూట్‌లను వాడుకొంటాయి.





