
కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ రెండో అర్ధ భాగంలో బలంగా కోలుకుందని ఆర్థిక శాఖ పేర్కొంది. దీనితో కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్న జీ-20 కూటమిలోని అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా ఉన్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు విడుదల చేసిన మే నెల నివేదికలో ఆర్థిక వ్యవస్థ 2020-21లో స్పష్టంగా V ఆకారపు రికవరీని నమోదు చేసినట్లు పేర్కొంది.
‘గత ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం క్షీణించింది. అంతకు ముందు జీడీపీ 8 శాతం క్షీణించొచ్చని అంచనాలు వచ్చినప్పటికీ.. V ఆకారపు రికవరీ వల్ల క్షీణత కాస్త తగ్గింది’ అని ఆర్థిక శాఖ వివరించింది.
కరోనా సంక్షోభం వల్ల 2020-21 తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు రికార్డు స్థాయిలో 24.4 శాతం క్షీణించింది. జీ 20 కూటమిలో అత్యధికంగా క్షీణతను నమోదు చేసిన దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. క్రమంగా అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో రెండో త్రైమాసికంలో క్షీణత 7.3 శాతానికి తగ్గింది.
మొత్తం మీద 2020-21 తొలి అర్ధభాగంలో వృద్ధి రేటు 15.9 శాతంగా నమోదైంది. పండుగ సీజన్లో డిమాండ్ పెరిగిన కారణంగా.. మూడో త్రైమాసికంలో అర శాతం సానుకూల వృద్ధి నమోదైంది. చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు 1.6 శాతంగా నమోదైంది. మొత్తం మీద రెండో అర్ధ భాగంలో వృద్ధి రేటు 1.1 శాతంగా నమోదైనట్లు గణంకాలు స్పష్టం చేస్తున్నాయని ఆర్థిక శాఖ వివరించింది.





