
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతంలో గురువారం స్థానిక టీవీ ఛానల్, వార్తాపత్రికల జర్నలిస్టు అజయ్ కుమార్ లాల్వాని అనే కొందరు గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.
అతను క్షౌరశాలలో క్షవరం చేయించుకుంటూ ఉండగా గుర్తు తెలియని దుండగులు అతనిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. పోలీసులు మొదట ఈ హత్యను వ్యక్తిగత శత్రువులెవరో చేసిన హత్యగా చూపించడానికి ప్రయత్నించారు. కానీ అతని కుటుంబం దానిని తీవ్రంగా నిరాకరించింది. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టుల కమిటీ, సింధ్ ప్రాంతంలో జరుగుతున్న జర్నలిస్టుల హత్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి కారకులైన నేరస్థులను వెలుగులోకి తీసుకురావాలని అధికారులను కోరింది.
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు లాల్ మాలాహి “సింధ్ లోని సలేహ్ పాట్ వద్ద మరో జర్నలిస్ట్ అజయ్ కుమార్ హత్యను తీవ్రంగా ఖండించారు. సింధ్ లో మీడియా వ్యక్తులు తాము సురక్షితంగా లేమని భావిస్తున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. బాధితులకు, వారి బంధువులకు తీవ్ర సంతాపం. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి. ” అని ట్వీట్ చేశారు.





