డీఆర్డీవో అధీనంలోని వీలర్ ఐలాండ్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఛాందిపూర్) వంటి డీఆర్డీవో ఆయుధ ప్రయోగశాలలకు విపరీతమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. కానీ, ఇక్కడ నిర్వహించే కీలక పరీక్షలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సేకరించడం చాలా అవసరం. వీటిని ఆ తర్వాత విశ్లేషణలకు, మీడియాకు సమాచారం అందించే సమయంలో వినియోగిస్తారు. ఇలాంటి వాటిల్లో క్షిపణులు, క్లస్టర్ బాంబుల ప్రయోగాలను వీడియో తీయడానికి ఈశ్వర్ చంద్ర బెహెరా అనే వీడియో గ్రాఫరుకు 2007లో డీఆర్డీవో కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈశ్వర్ చంద్ర బెహెరా బాలాసోర్ పట్టణం బయట నివసించేవాడు. ఈ నియామకానికి ముందు డీఆర్డీవో అతనిపై పోలీస్ ఎంక్వైరీ కూడా చేయించింది. అన్నీ బాగానే ఉన్నాయనుకొని నియమించుకొంది. అతను ఈ క్షిపణులు, క్లస్టర్ బాంబులు ప్రయోగించే రెండు ప్రదేశాల్లో వీడియోలు తీసేవాడు. ఈ క్రమంలో 2013 నుంచి అతను కీలక ప్రదేశాల్లోకి ప్రవేశించి అక్కడి పరిస్థితులను ఫొటోలు తీసి, కెమెరా రిపేర్ వచ్చిందని చెప్పి కోల్ కతా వెళ్లి అక్కడ నుంచి పాక్ లోని ఐఎస్ఐ ఏజెంట్లకు చేరవేసేవాడు. దీనికి ప్రతిఫలంగా అతనికి వివిధ ప్రదేశాల నుంచి నగదు అందేది. 2015 జనవరి 22న నిఘా సంస్థలు ఇతని చర్యలను పసిగట్టి తొలిసారి ఎఫ్ఐఆర్ నమోదు చేశాయి.
వీలర్ ఐల్యాండ్ పై నిఘా పెట్టిన పాక్.. !!
భారత క్షిపణి పరీక్షలకు అత్యంత కీలక ప్రదేశం వీలర్ ఐలాండ్ చాందీపూర్. అక్కడ నుంచే భారత్ అన్ని కీలక క్షిపణి పరీక్షలు చేస్తుంది. పాక్ ఏకంగా ఇక్కడే తన వేగులను నియమించుకొంది. వారి నుంచి మన శతఘ్నులు, బాంబులు, లాంచ్ ప్యాడ్లు వంటి వాటి ఫొటోలు వీడియోలను సేకరించడం మొదలు పెట్టింది. వీటిని విశ్లేషించి మన ఆయుధాల లోటుపాట్లను కనుక్కోవచ్చు. యుద్ధ సమయాల్లో ఇలాంటి సమాచారం పాక్ కు అదనపు బలాన్ని సమకూరుస్తుంది. దీనంతటికీ సహకరిస్తోంది ఓ భారతీయ ఫొటోగ్రాఫరని తేలడంతో.. అధికారులు పక్కా ఆధారాలను సేకరించి అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు.
పాక్ నుంచి కాల్స్
భారత నిఘా సంస్థలు బెహెరాకు వచ్చిన ఫోన్ కాల్స్ పై నిఘా ఉంచి కీలక సమాచారాన్ని సేకరించాయి. వీటిల్లో తొమ్మిదంకెలు ఉన్న ఫోన్ నెంబర్ నుంచి కాల్స్ రావడాన్ని గుర్తించాయి. వాటి ముందు +91 సంఖ్య ఉండేది వాస్తవానికి ఈ సంఖ్య భారత్ దేశ కోడ్. కానీ, 10 అంకెలు ఉండాల్సిన నెంబర్ లో ఒక అంకె తగ్గేది. ఇలా చేస్తే ఆ తగ్గిన అంకె ఎక్కడిదో నిఘా సంస్థలు గుర్తించడం చాలా కష్టం. అప్పుడు కాల్ చేసినవారి వివరాలు గోప్యంగా ఉంటాయి. సాధారణంగా హ్యాకర్లు తమ ఐడీ, జరిమానాలను తప్పించుకోవడానికి ఈ విధానాన్ని అనుసరిస్తారు. పోలీసుల విచారణలో బెహెరా కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు. తాను హైదరాబాద్ నుంచి కల్నల్ శ్రీవాస్తవ అనే పేరుతో తొమ్మిదంకెల సంఖ్య ఉన్న నెంబర్ నుంచి కాల్స్ తీసుకొన్నట్లు వెల్లడించాడు. అతడు ఆయుధ పరీక్షల, టెస్ట్ సెంటర్ల వివరాలు కోరినట్లు తెలిసింది.
ఆసిఫ్ అలీ అనే పాకిస్తానీ వివిధ పేర్లతో బెహెరకు మనీ ఆర్డర్ల రూపంలోనూ, ఇతర మార్గాల ద్వారా నిధులను పంపినట్లు తేలింది. 2014 జులైలో రెండు సార్లు ఈ విధానంలో నిధులు చేతులు మారాయి. అబుదాబీ, ముంబయి, ఢిల్లీ, అలహాబాద్ ల నుంచి బెహెరా ఖాతాలో నిధులు జమయ్యాయి. 2014లో అరెస్టయిన అలీ నుంచి సేకరించిన సమాచారంతో ఈ విషయాలను పోలీసులు నిర్ధారించుకొన్నారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా సెషన్స్ జడ్జి బెహెరాకు జీవిత ఖైదు విధించారు. అంతేకాదు రూ.10,000 అపరాధ రుసుం విధించారు. వాస్తవానికి సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో పాక్ వేగుల కార్యకలాపాలు ఉంటాయి. కానీ, కొన్నేళ్లుగా భారత తూర్పుతీర ప్రాంతంలోని వైజాగ్, ఒడిశాల్లో కూడా పాకిస్తాన్ వేగుల కదలికలు పెరిగాయనడానికి బెహెరా కేసే ఓ ఉదాహరణ.