
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం క్షేత్రంలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన దేవాలయంలో గల శ్రీరాముని విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది.
దుండగులు ఆలయ ద్వారాన్ని బద్దలుకొట్టి గర్భాలయంలోకి ప్రవేశించి విగ్రహం తలని విరగ్గొట్టి తీసుకెళ్లారు. ఒకే రాతి బండతో ఏర్పడిన నునుపైన కొండపై ఉన్న ఈ పురాతన దేవాలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలయిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల తోపాటు, ఒడిసా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల ప్రజలచే కూడా పూజలందుకుంటున్న విగ్రహం ధ్వంసం కావడం కోట్లాది హిందువుల హృదయాలను కలచివేసింది. దాడి ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు దాదాపుగా వంద దేవాలయాల పైన దాడి జరిగిందని, ఇప్పటివరకూ ఏ ఒక్కరిని ఈ ప్రభుత్వం అరెస్టు చేయలేదని, దాడి జరిగిన ప్రతిసారీ అధికారులు, పోలీసు వారు విచిత్రమైన కారణాలు చెబుతున్నారని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దేవాలయాలపై, తమ ఆరాధ్య దేవీదేవతల విగ్రహాలపై జరుగుతున్న వరుస దాడులపై తీవ్రంగా కలత చెందియున్న హిందూ సమాజాన్ని అధికార పక్ష నాయకులు చేస్తున్న నోటిదురుసు వ్యాఖ్యలు మరింతగా ఆవేదనకు గురిచేస్తున్నాయని బీజేపీ నేతలు దుయ్యబట్టారు.

ఈ ఘటనతో పాటు రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై, దేవీ దేవతల విగ్రహాలపై జరిగిన దాడులు, రథాల దహనాలకు కారకులైన వారిని ప్రభుత్వం వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతూ బిజెపి నాయకులు, కార్యకర్తలు రామతీర్థం కొండపైన ధర్నాకు దిగారు. రాత్రంతా కొండపైనే ఉండి తమ ధర్నాను కొనసాగించాలని వారు నిశ్చయించుకున్నారు. కాగా కొండ దిగువన పోలీసు వారు మోహరించి కొండపైకి ఎవరినీ వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఒక దశలో పైన ధర్నా చేస్తున్న కార్యకర్తలకు భోజనాలు అందించటానికి కూడా పోలీసు వారు అనుమతించలేదు. తీవ్ర ప్రతిఘటన తర్వాత వారికి భోజనాలు అందించటం సాధ్యమైంది.
దేవాలయంలోని స్వామివారి ఆభరణాలు, వెండి సామగ్రి జోలికి వెళ్ళని దుండగులు కేవలం స్వామివారి విగ్రహం తలని తొలగించి తీసుకువెళ్ళడాన్నిబట్టి చూస్తే…. విగ్రహాన్ని ధ్వంసం చేయడమే దుండగుల ఏకైక లక్ష్యంగా కనిపిస్తోందని భక్తులు పేర్కొంటున్నారు.





