ArticlesNews

ఉత్తుంగ స్వేచ్చా తరంగం శ్రీ సుబ్రహ్మణ్య భారతి

424views

20వ శతాబ్దికాలంలో తమిళనాడు ప్రాంతంలో జన్మించిన ప్రముఖ జాతీయకవి. వీరు సరళమైన భాషలో సహజసిద్ధమైన రీతిలో రచనలు చేసి, కవితలు వ్రాశారు. సమస్త భారతమూ ఒక్కటే అనే జాతీయ భావయుక్తమైన కవితలతో లక్షలాది ప్రజల హృదయాలలో దేశభక్తిని జాగృతమొనరించారు. వారు తమయొక్క తీవ్రమైన జాతీయ రచనల కారణంగా అనేక పర్యాయములు బ్రిటిష్ ప్రభుత్వముచే బంధింపబడి కారాగార జీవితముననుభవించారు.

బాల్యం నుంచే సాహిత్యాభిరుచి

తమిళనాడులోని ఎట్టియాపురంలో చిన్నస్వామి అయ్యర్, లక్ష్మి దంపతులకు 1882 వ సంవత్సరం, డిసెంబర్ 11 వ తేదీన శ్రీ సుబ్రహ్మణ్య భారతి జన్మించారు. సుబ్రహ్మణ్య ఐదేళ్ళ బాలుడిగా ఉండగా ఆయన తల్లి ఈ లోకాన్ని విడచిపెట్టింది. కంబ రామాయణాన్ని, తమిళ కవిత్వాన్ని అమితంగా అభిమానించి అస్తమానం పఠించే తన తాతగారి ద్వారా భారతికి సాహిత్యం పట్ల అభిరుచి ఏర్పడింది. ఆ అభిరుచే ఆయనను గొప్ప కవిగా తీర్చిదిద్దింది.

బాల్య వివాహాలు చాలా మామూలుగా జరుపుకునే ఆ రోజులలో…. సుబ్రహ్మణ్యభారతికి పదిహేనేళ్ళ వయసులో ఏడేళ్ళ చెల్లమ్మతో వివాహమయింది. అదే సమయంలో ఆనాటి చర్చాగోష్టిలలో చూపిన ప్రతిభ కారణంగా, ఎట్టియా పురం రాజావారికి సుబ్రహ్మణ్య పట్ల కలిగిన అభిమానానికి ఫలితంగా, ఆ ఆస్థానంలో ఒక చిన్న కొలువు లభించింది. కానీ దురదృష్టం 1898 సంవత్సరం, సుబ్రహ్మణ్య భారతి 16 ఏండ్ల వయస్సులో ఆయన తండ్రి చిన్నస్వామి గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు.

కవి, స్వాతంత్ర్య సమరయోధుడు

తండ్రి మరణంతో భార్యతో సహా వారణాశిలోని మేనత్త వద్దకు చేరుకున్న సుబ్రహ్మణ్య అక్కడి కేంద్ర హిందూ కళాశాలలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. అనంతరం ఆయన కొంతకాలం ఎట్టియాపురం రాజా వారి కొలువులో ఆస్థాన కవిగా పనిచేశారు. అనంతరం మధురైలోని సేతుపతి ఉన్నత పాఠశాలలో ఓ మూడు నెలల పాటు తమిళ అధ్యాపకునిగా పనిచేసి “స్వదేశీ మిత్రన్” అనే తమిళ పత్రికలో ఉప సంపాదకునిగా చేరారు. మరి కొద్దికాలానికి ‘ఇండియా’ అనే వార పత్రికలో చేరారు. చివరికి “బాల భారతి” పేరుతో తానే ఒక పత్రికను ప్రారంభించి నడిపేవారు. బ్రిటిష్ ప్రభుత్వం తనను అరెస్టు చేసే అవకాశముండడంతో స్నేహితుల బలవంతం మేరకు పాండిచేరి చేరాడు. బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించటంతో ‘ఇండియా’ పత్రికను కూడా మూసివేయవలసి వచ్చింది. అయినప్పటికీ ఆయన తన పదునైన రచనలతో తమిళ ప్రజలలో దేశభక్తిని జాగృతం చేస్తూనే ఉండినారు.

రాజకీయదృష్టితో ఆలోచిస్తే వారిది అతివాద వర్గంగా గోచరిస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్య భారతి గారు యోగి అరవిందుడు, చిదంబరం పిళ్ళై, బి.వి. ఎస్. అయ్యర్ మొదలగు దేశభక్తులతో పాటు అనేకమంది స్వాతంత్ర్య సంగ్రామ వీరులతో అతి సన్నిహితంగా మెలగిన వ్యక్తి. వైష్ణవభక్తులైన ఆళ్వారులు, శైవభక్తులైన నాయన్మారుల రచనాశైలికనుసరణీయంగా వీరు అనేక భక్తి గీతాలను రచించారు. వీరు దేశభక్తులేగాక గొప్ప సంఘసంస్కర్త కూడా. హిందూ సమాజంలోని కురీతులను తొలగించే ప్రయత్నం చేశారు.

సావిర జాతిగళిద్దరు ఇల్లి – విదేశీ కాలిదలంగు స్థల విల్ల
తాయియ మక్కలు కలహవాడిదరు – కొపిసి కొందరు, సోదరరెల్ల

(తత్త్వ విభేదాలు వేయి వుండనీ విదేశీయులకిక్కడ స్థానం లేదు. ఒక తల్లి బిడ్డలు కోపించి కలహించనీ – వారెప్పటికీ సహోదరులే!) అంటూ ఆయన తన రచనలలో జాతీయ భావనను ప్రతిబింబించారు.

భారతదేశం బానిసత్వంలో మ్రగ్గింది. శ్రీ సుబ్రహ్మణ్య భారతి రచన చేసిన కాలం అదే. ఆయన స్వేచ్ఛను అభిలషించి, ఆవేదనలో వ్రాసిన అనేక గీతాలు చిరస్మరణీయాలు. భారతీయులందరిలో స్వేచ్ఛా ప్రియత్వం లేనందున, కొందరిలో దేశభక్తి లోపించినందున వారికి చాలా బాధ కలిగేది.

“ఇక నేను తట్టుకోలేను ఒక ఆశయం లేని మనుషుల్ని. ఎక్కడున్నారు వాళ్ళు? ఓహో! ఏది చూసినా వెరచే వారు ఎక్కడున్నారు?” ఆయన ఆవేదనతో వ్రాసిన ఒక తమిళ కవిత భావమిది.

“ఎల్లారు వందే కుల, ఎల్లారు వందే జన

ఎల్లారు భారతద మక్కళ్ న్యాయవందెల్లారిగె, ఎల్లారిగె బేళె ఒందే

ఎల్లారు ఈ నాద దోరెగళ్-నావ

ఎల్లారు ఈ నాద దొరెగళ్”

“భారతీయులందరు ఒక్కటే! ఒకే కులం- భారతమాత బిడ్డలం ఒకటే న్యాయం- అందరం సమానం. మనకి మనమే రాజులం” అంటూ భారతీయులందరూ సమానులేనని ఎలుగెత్తి చాటారు.

స్వాతంత్ర్య గీతాలు, ఆధ్యాత్మిక గీతాలు అసంఖ్యా కంగా వ్రాసిన భారతి, పిల్లలకోసం కూడా వ్రాశారు. పాపర పట్టు’ (పిల్లల గీతాలు) ఆయన వ్రాసిన బాలగీతాల సంకలనం. బాలబాలికలలో దేశభక్తిని, దైవభక్తిని, క్రమశిక్షణని బోధిస్తూ సాగే గీతాలవి. అలాగే ‘పాంచాలీ శపథం’ ద్రౌపది చరితం. నాటి భారతదేశాన్ని ద్రౌపది పడిన బాధలతో పోల్చిన గాథ ఇది. అప్పట్లో ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసే కవితల్లో ఇదొకటి

“విజయ నమ్మధాగలి- సోలు ఆవగళే చారలి
నాల్లె ఒదంగి నిల్లులేవు గోషనెయెల్లి ధని ఏయలేవు
తాయి తలె బాగులేవు నినగె”

రానీ రానీ, విజయం రానీ
అపజయమే రానీ, మృత్యువే రానీ
కలిసికట్టుగా నిలబడదాం
కలసి మెలసి నినదిద్దాం
అమ్మా భారతీ వందనం.

జనగళాన్ని ఆయన తన కవిత్వంలో ప్రతిబింబించారు. ప్రతిధ్వనించారు. ఆయన ఆశయాన్ని మన హృదయాలలో పటిష్టంగా మనమే నిలబెట్టుకోవాలి.

“జ్ఞానదళి యోగ సమాధియల్లి
స్వాభిమానదళి జన్సురైవ కావ్యదళి
నమ్మ భరతవై జ్ఞానదలెల్ల శ్రేష్టనాడు
వీర సాహసదళి సమరశౌర్యదళి
కరుణాయేళి నెరవు నీడవాదరలి
అనుభవకె ఆలోచనేయ బెరసి చెళుసువదరళ్ళి
ఉజ్వల వాగి మీరివ భారత నమ్మనాడు”

భారతదేశం నాది
జ్ఞాన సంపద యందు, యోగ సమాధి యందు
స్వాభిమానమునందు, ఔదార్యమునందు
సంగీతమునందు, కార్యసాహిత్య నిధుల యందు
అద్వితీయమైనది నా భారత ఖండం
వీర సాహసమందు, సమరశౌర్యమందు
కారుణ్య సిరియందు పరోపకారమునందు
అనుభవమునందు, ఆలోచనల యందు
ఉజ్వల స్ఫూర్తి ప్రదాత నా భరత ఖండం

పిన్న వయసులోనే పరమాత్మ ఒడికి

ట్రిప్లికేన్ లోని పార్థసారథి కోవెల చాలా ప్రముఖమైనది. భారతి ఆ ఆలయానికి తరచూ వెళ్ళేవారు. అక్కడి ఏనుగులకు కొబ్బరికాయలు, పళ్ళు తొండానికి అందించేవారు. ఒకానొక రోజు ఆయన అలాగే చేస్తుంటే, ఎందుకో ఆ ఏనుగుకు కోపం వచ్చింది. అంతే! భారతిని తొండంతో చుట్టి అమాంతం ఎత్తి గిరగిరా త్రిప్పి నేలపైకి విసిరేసింది. భారతి స్నేహితుడు కువళై కణ్ణన్ ఆయనను ఆసుపత్రిలో చేర్చినా, ఫలితం లేకపోయింది. సెప్టెంబర్ పన్నెండు, 1921లో, ఆయన తన 39వ ఏటనే ఇహలోకాన్ని వీడి పరమాత్మలో లీనమయ్యారు.

భారతి కవి, గాయకుడు, నవలాకారుడు, వ్యాస కర్త, చిత్రకారుడు కూడా. ఆయన బ్రతికింది 39 సంవత్సరాలు మాత్రమే. అంత అల్పమైన ఆయుష్బుతో ఆయన అనంతమైన కార్యాచరణ చేశారు. అనేకమైన కష్టనష్టాలను అనుభవించి, వాటిని మథించి కవితలుగా మలచారు.

అనంత ప్రకృతిలో లీనమైన సుబ్రహ్మణ్యభారతి తమిళనాట ప్రతి ఇంటా, ప్రతినోటా పాటగా ప్రతిధ్వనిస్తూనే ఉంటారు. అమృతమూర్తిగా అమర జీవియై నిలచివుంటారు.

నేడు శ్రీ సుబ్రహ్మణ్య భారతి 138 వ జయంతి

సేకరణ : రాజశేఖర్ నన్నపనేని

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.