News

9 మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్

81views

జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో 9 మంది ఆల్‌ఖైదా ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరందరినీ పశ్చిమబంగాల్‌లోని ముర్షీదాబాద్‌, కేరళలోని ఎర్నాకుళంలో ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. వీరిలో ఆరుగురు ముర్షీదాబాద్‌కు చెందిన వారు కాగా, మిగిలిన ముగ్గురు ఎర్నాకుళంకు చెందిన వారని ఎన్‌ఐఏ తెలిపింది. దేశవ్యాప్తంగా జనసమ్మర్థ ప్రదేశాల్లో బాంబు దాడులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలు తీసేందుకు కుట్ర చేస్తున్నట్లు ఎన్‌ఐఏ ఆరోపించింది.

ఉగ్రవాదుల నుంచి భారీ ఎత్తున దస్త్రాలను, డిజిటల్‌ డివైస్‌లను, జీహాదీ సాహిత్యాన్ని, దేశీయంగా తయారైన తుపాకులు, శరీర కవచాలు,ఇంట్లోనే పేలుడు పదార్థాలు తయారు చేయడానికి అవసరమైన పరిజ్ఞానంతో కూడిన మెటీరియల్‌, పదునైన ఆయుధాలను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. వీరంతా పాకిస్థాన్‌ కేంద్రంగా పని చేసే అల్‌ఖైదా అనుబంధ సభ్యులని ఎన్‌ఐఏ వెల్లడించింది. సమాజిక మాధ్యమాల ద్వారా అల్‌ఖైదాలో చేరి దిల్లీ సహా, దేశ వ్యాప్తంగా దాడులకు కుట్ర చేసినట్లు పేర్కొంది. నిధుల సేకరణకు పాల్పడటం సహా, వీరిలో కొందరు దిల్లీ వెళ్లి ఆయుధాలు కొనుగోలు చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు వివరించింది.

”అల్‌ఖైదాకు చెందిన అంతర్రాష్ట్ర ఉగ్రముఠా పశ్చిమబెంగాల్‌, కేళలోని వివిధ ప్రాంతాల్లో సామాన్య ప్రజలే లక్ష్యంగా పేలుళ్లకు పాల్పడేందుకు పన్నాగం పన్నుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా మరి కొందరిలో ఉగ్రబీజాలు నాటేందుకు వీరంతా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో దాడులు నిర్వహించి వారందరినీ అరెస్టు చేశాం” అని ఎన్‌ఐఏకు చెందిన ఓ సీనియర్‌ అధికారి మీడియాకు వెల్లడించారు. ముర్షీద్‌ హసన్‌, యాకుబ్‌ బిస్వాస్‌, ముషారప్‌ హుస్సేన్‌లను కేరళలో అరెస్టు చేయాగా.. షకీబ్‌, అబు సోఫియాన్‌, మెయినల్‌ మోండల్‌, యీన్‌ అహ్మద్‌, మనుమ్‌ కమల్‌, రెహ్మాన్‌లను ముషీరాబాద్‌లో అరెస్టు చేసినట్లు చెప్పారు. వీరిని సంబంధిత కోర్టుల్లో హాజరుపరుస్తామని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.