ArticlesNews

అపర భగీరధుడు : 30 ఏండ్లు కష్టపడి 3 కిలోమీటర్ల కాలువ తవ్వాడు

636views

న కోసం, తన వారి కోసం ఏదైనా చేయాలన్న తపన ఉండాలి గానీ ఎంతటి కార్యాన్నైనా సంతోషంగా పూర్తిచేస్తాం. బీడు వారిన తన పొలాలతోపాటు గ్రామాన్ని కూడా పచ్చగా చేయాలన్న సంకల్సమే ఆయనను ౩౦ ఏండ్లుగా కాలువను తవ్వేట్లుగా చేసింది. పశువులు కాసేందుకు నిత్యం వెళ్తూ రోజింత చొప్పున మట్టి తవ్వుతూ చివరకు గ్రామానికి సాగునీరందించే కాలువను పూర్తిచేశాడు బిహార్‌లోని గయా జిల్లాలకు చెందిన ఓ పెద్ద మనిషి.

బిహార్‌లోని గయా జిల్లాలోని లథువా ప్రాంతానికి చెందిన మారుమూల గ్రామం కోథిలావా. ఈ గ్రామానికి చెందిన లాంగి భూయాన్ అనే పశువుల కాపరి గ్రామానికి సమీపంలో ఉన్న కొండపైకి పశువుల్ని తీసుకెళ్లేవాడు. వానకాలంలో వర్షపునీరు తన గ్రామానికి కాకుండా వేరే ప్రాంతానికి పారుతుండటాన్ని చూసిన ఆ పెద్దాయన.. కాలువ తవ్వాలని నిర్ణయించుకున్నాడు. నిత్యం పశువులను తీసుకుని రావడం.. కొద్దికొద్దిగా కాలువ తవ్వడం పనులు చేస్తున్నాడు. ఇలా 30 ఏండ్లపాటు కాలువ తవ్వడం పూర్తిచేసిన ఆ పెద్దాయన చివరకు కొండప్రాంతంలో పడే వర్షపు నీటిని తన గ్రామం శివారులోని చెరువుకు రప్పించగలిగాడు. దాంతో వర్షపునీరు వృధాగా పోకుండా పడిన వర్షం అంతా ఆ కాలువ ద్వారా గ్రామ చెరువుకు చేరుకుని పంటలు పండించుకునేందుకు వీలుకలిగింది.

”వర్షాలు కురిసినా చెరువు నిండక పోవడంతో పంటలు పండించే వీలులేక ఎందరో గ్రామస్థులు పొట్టచేతపట్టుకుని పట్టణాలకు వలస పోయారు. అయితే తాను అందరిలా కాకుండా ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. నిత్యం పశువులను కాసేందుకు వెళ్తూ కాలువ తవ్వకం పనులు చేపట్టాను. 30 ఏండ్లకు 3 కిలోమీటర్ల పొడువైన కాలువ పూర్తయి వర్షపునీరు గ్రామ చెరువులోకి రావడం మొదలైంది. దాంతో పంటలు పండించుకుంటున్నాను. నా వ్యవసాయాన్ని చూసి మరికొందరు పట్టణాలను వదిలి గ్రామలకు తిరిగి వచ్చి వారు కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇది నాకెంతో సంతోషం కలిగిస్తుంది. ఒక్కడినే ఈ కాలువను తవ్వాను. తొలుత నన్ను చూసి నవ్వినవారే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు” అని లాంగి భూయాన్‌ చెప్పారు. తన కోసం కాకుండా గ్రామం కోసం పరితపించిన భూయాన్‌ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని గ్రామంలో పాఠాలు బోధించే రాం విలాస్ సింగ్‌ సూచించారు. ఆయన ఒక్కడు చేసిన పనికి ఇప్పుడు ఎందరో లబ్ధి పొందుతున్నారని, ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచించినప్పుడే మనం అభివృద్ధి సాధిస్తామని ఆయన చెప్పారు.

Source : నమస్తే తెలంగాణా

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.