
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మార్ఫింగ్ వీడియోను దిగ్విజయ్ ట్విటర్‌లో షేర్ చేయడమే కేసు నమోదుకు గల ప్రధాన కారణం. ఆ వీడియోలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా దిగ్విజయ్ మార్ఫింగ్ చేశారని భాజపా ఆరోపించింది. కాంగ్రెస్ హయాంలో మద్యం విధానంపై శివరాజ్ సింగ్ మాట్లాడిన మాటల్ని దిగ్విజయ్ సింగ్ తారుమారు చేశారని భాజపా నేత, మాజీ హోంమంత్రి ఉమాశంకర్ గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను, ఇతర ఆధారాలను ఆయన క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అందజేశారు. ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని కించపరిచే ఉద్దేశంతోనే దిగ్విజయ్ సింగ్ ఆ వీడియో షేర్ చేశారని ఉమాశంకర్ ఆరోపించారు.
ఫిర్యాదుపై క్రైమ్ బ్రాంచ్ అధికారి నిశ్చల్ ఝారియా మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్ని పర్యవేక్షించే సైబర్ విభాగం దిగ్విజయ్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని చెప్పారు. దిగ్విజయ్ సింగ్‌ను ఫోర్జరీ, పరువునష్టం కేసుల్లో నిందితుడిగా చేర్చామని తెలిపారు. అమర్యాదకర వ్యాఖ్యలు జోడించి రీట్వీట్ చేసిన మరో 11 మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
అయితే రాజకీయ కక్షతోనే ప్రభుత్వం తనపై కేసు నమోదు చేసిందని దిగ్విజయ్ విమర్శించారు. గిరిజనుల సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందునే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. అసలు వీడియోను ఎవరు మార్ఫింగ్ చేశారో కూడా దర్యాప్తు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ‘ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏజెంట్లు బుద్నికి చెందిన గిరిజనులకు రూ.4.5 కోట్లు మోసం చేశారు. మోసానికి పాల్పడిన వారిపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని’ పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోకపోతే ముఖ్యమంత్రి నివాసం ఎదుట బైఠాయించి ధర్నాకు దిగుతానని చెప్పడంతో భాజపా తనపై తప్పుడు కేసులు పెట్టిందని చెప్పారు.





