
మనం ప్రతి రోజూ మన శాఖలలో “జై భవాని – వీర శివాజీ” అని నినదిస్తాం. మన పెద్దల భౌద్ధిక్ లలో శివాజీ జీవితంలోంచి అనేక ఉదాహరణలు మనం తరచుగా వింటూ ఉంటాం. ఎందుకని? అంటే మనం శివాజీ ఆరాధకులం. మనం శివాజీని అంతగా ఆరాధించడానికి కారణం ఏమిటి? ఆయనేమన్నా ఆజానుబాహువా? అందగాడా? కాదే? శివాజీలోని సుగుణాలను మాత్రమే మనం ఆరాధిస్తాం.
శివాజీ దేశ, కాల పరిస్థితులను అర్థం చేసుకుని దేశాన్ని కాపాడాడు. సమాజానికి సరియైన దిశా నిర్దేశం చేశాడు. ఆ కాలంలోనే శివాజీ ‘హిందవీ స్వరాజ్’ ని నిర్మించాడు. అప్పటి హిందూ రాజులకు భిన్నమైన రీతిలో సరికొత్తగా ఆలోచించాడు.
సర్వసాధారణమైన మావళీలను మహత్కార్య సాధకులను చేశాడు. తానాజీ మాన్సురే, సూర్యాజీ మాల్సురే, నేతాజీ ఫాల్కర్, యశాజీ కంక్, మురారి భాజీ, హీరాజీ ఫర్జంద్ వంటి అసమాన వీరులందరూ శివాజీ నేతృత్వంలో రూపుదిద్దుకున్న సామాన్య వ్యక్తులే. సమాజం బాగుపడాలంటే సాధారణ సమాజం యొక్క క్రియాశీలత, గుణగణాల పైననే ఆధారపడి ఉంటుందన్నది చరిత్ర చెప్పిన సత్యం. “సాధారణ సమాజం యొక్క దృష్టికోణం, నడవడిపైనే ఆ సమాజ మనుగడ ఆధారపడి ఉంటుంది” అన్న సత్యాన్ని శివాజీ అర్థం చేసుకున్నాడు. అందుకే మట్టిలోంచి మాణిక్యాలను వెలికి తీశాడు.
భోంస్లే రాజులకు చెందిన సీతా బర్డీ కోటపైనున్న యూనియన్ జాక్ ఆంగ్లేయ పతాకాన్ని తొలగించి అక్కడ భగవాధ్వజాన్ని ఎగురవేయాలన్న సంకల్పంతో వఝే మాస్టారు ఇంటిలో నుంచి సొరంగాన్ని త్రవ్వడానికి బాలకేశవుడు ప్రయత్నించిన సంఘటనను మనం సంఘ స్థాపకులు పరమ పూజనీయ డాక్టర్జీ జీవితంలో చూస్తాం. శివాజీ అతి చిన్న వయసులో తన స్నేహితులతో కలసి తోరణ దుర్గాన్ని జయించిన సంఘటన బాల కేశవునికి ప్రేరణ. శివాజీలోని స్వాభిమానము, దేశభక్తి, సాహస ప్రవృత్తి పుణికిపుచ్చుకుని పుట్టిన ఆజన్మ దేశభక్తులు పరమ పూజనీయ డాక్టర్జీ. ఛత్రపతి శివాజీ జీవితమే డాక్టర్జీ సంకల్పానికి ప్రేరణ.
స్వభావరీత్యా శివాజీ విరాగి. దాదాజీ ఖోండదేవ్, భక్త తుకారాం, సమర్ధ రామదాసుల సాహచర్యం వల్ల శివాజీలో వైరాగ్య భావనలు మొలకెత్తి ఉండవచ్చు. కానీ ఆయన ముక్తి మార్గ సాధనకంటే సమాజ రక్షణకు, తన కర్తవ్య నిర్వహణకే ప్రధమ ప్రాధాన్యతనిచ్చాడు. అదే సమయంలో స్వార్థము, అహంకారము, అధికార గర్వము వంటి వికృతులకు, దుర్లక్షణాలకు అతీతంగా కేవలం ధర్మ రక్షకుడుగా, ధర్మకర్తగానే ఆయన పాలన సాగించాడు. కేవలం సమర్థ రామదాస స్వామి ప్రతినిధిగానే శివాజీ తన పాలనను కొనసాగించాడు. నేటి పాలకులకు సైతం శివాజీలోని ఈ సద్గుణం ఆదర్శనీయం. రాగ ద్వేషాలకు, అవినీతి, అధికార వ్యామోహాలకు అతీతంగా కేవలం ప్రజా ప్రతినిధులుగా, ధర్మకర్తలుగా ప్రస్తుత పాలకులు వ్యవహరించాల్సి ఉంది.
అలెగ్జాండర్, ఘోరీ, గజనీ, మొఘలాయీల కుయుక్తులకు తగినట్లుగా వ్యూహాలు పన్నడంలో అప్పటి మన రాజులనేకులు విఫలం చెందారు. కొందరు రాజులు తమ మితిమీరిన ధర్మాచరణ, వ్యక్తిగత నియమాలు, కీర్తి కండూతి వంటి “సద్గుణ వికృతి” కారణంగా పరాజయం పాలైతే…. జయచంద్రుడు, అంబి రాజు వంటి వారు వ్యక్తిగత లక్ష్యాల సాధన కోసం శత్రువులకు సహకరించి జాతికి తీరని ద్రోహం చేశారు. కానీ శివాజీ శత్రువులతో వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. అవసరమైన చోట అనవసరమైన భేషజాలకు పోకుండా ఒకింత తగ్గి ప్రవర్తించాడు. “అనువుగానిచోట అధికులమనరాదు” అన్న సూక్తిని అనుసరించి తన తండ్రిని కాపాడుకోవడం కోసం మొఘలాయీలకి లేఖ వ్రాశాడు. ధనం అవసరమైనప్పుడు సూరత్ ను కొల్లగొట్టి స్వరాజ్య నిర్మాణానికి ఉపయోగించాడు. ఆగ్రా కోట నుంచి తెలివిగా తప్పించుకున్నాడు. ఈ సమయంలో మొఘలాయీ సేనలను భోల్తా కొట్టించడంలో శివాజీ చేతిలో తయారైన మరో తురుపు ముక్క భాజీ ప్రభు దేశపాండే చూపిన నేర్పు శివాజీ వ్యక్తి నిర్మాణ కౌశలానికి ఓ తార్కాణం. ఇలా ప్రతి సందర్భంలోనూ సమయానుకూలంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి తాను ఆపదల నుంచి గట్టెక్కుతూ తన లక్ష్యం దిశగా సాగిపోయాడు శివాజీ.
అప్పటివరకూ భారతీయ రాజులందరూ అనుసరించిన యుద్ధ నియమాలను విడచి గెరిల్లా యుద్ధ నీతిని అనుసరించాడు. శత్రువులపై మెరుపు దాడులు చేసేవాడు.
తన గూఢచారుల ద్వారానే తాను శత్రువుకు భయపడుతున్నట్లుగా ప్రచారం చేయించేవాడు. ఏమరుపాటుగా ఉన్నప్పుడు శివాజీ శత్రువుపై మెరుపు దాడి చేసి దెబ్బ తీసేవాడు. అఫ్జల్ ఖాన్ ని సంహరించినప్పుడు , షయస్త ఖాన్ వ్రేళ్ళు తెగ్గోట్టినపుడు, ఆగ్రా కోట నుంచి తప్పించుకున్నప్పుడు శివాజీ ఈ వ్యూహాన్నే అనుసరించాడు. ఊహకందని రీతిలో మెరుపు వేగంతో శత్రువు పై విరుచుకు పడేవాడు. ఒక నాయకుడికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణాలలో ‘త్వర’ (మెరుపు వేగం) ఒకటి.
శివాజీ కొలువులో మహమ్మదీయులు కూడా పని చేశారు. శివాజీకి ఆంతరంగికుడిగా, అంగరక్షకుడిగా వ్యవహరించిన మదారీ మెహతార్, శివాజీ ఆగ్రా కోట నుంచి తప్పించుకున్న రోమాంఛిత ఘట్టంలో కూడా ప్రధాన పాత్ర పోషించాడు. శివాజీ యొక్క ఫిరంగి దళాల అధిపతి కూడా ఒక మహమ్మదీయుడే. శివాజీ వారిలో కూడా జాతీయ భావనను నింపాడు.
ప్రస్తుత కాలంలో IAS, IPS శిక్షణ పొందే వ్యక్తులు తమ శిక్షణలో భాగంగా క్రింది స్థాయి నుండి అన్ని స్థాయిలలో పని చేసినట్లుగా శివాజీకి కూడా అన్ని స్థాయిలలో ప్రవేశం ఉంది. అందువల్ల శివాజీకి అన్ని విభాగాలలోని లోటుపాట్లు, లోపాలు తెలుసు. ఆ కారణంగానే ఆయన తన పాలనలో అన్ని రంగాలను సమర్థవంతంగా నిర్వహించగలిగాడు.
శివాజీని స్ఫూర్తిగా తీసుకుని, ఆయన యుద్ధ రీతిని అనుసరించి అతి చిన్న దేశం వియత్నాం శక్తివంతమైన అమెరికాతో పోరాడి గెలిచింది. అస్సాంకు చెందిన వీరుడు లాచిద్ బఢ్ ఫుకాన్, బుందేల్ ఖండ్ కు చెందిన రాజపుత్ర వీరుడు రాజా ఛత్రసాల్ లు శివాజీ నుంచి ప్రేరణ పొంది స్వధర్మ రక్షణ కోసం పోరు సలిపారు.
ఊహకి కూడా అందని రోజులలో మతం మారిన వారిని హిందూ ధర్మంలోకి పునరాగమనం చేయించాడు. తనతో బంధుత్వం కలుపుకోవడం ద్వారా మహమ్మద్ కులీ ఖాన్ అనే మతం మారిన యువకుడిని హిందూ ధర్మంలోకి తీసుకు వచ్చాడు. అతనే శివాజీకి ప్రధాన అనుచరుడిగా ఉండిన నేతాజీ ఫాల్కర్.
ప్రతి విషయాన్ని సునిశిత దృష్టితో పరిశీలించడం శివాజీ ప్రత్యేకత. తాను కొత్తగా కోటలు నిర్మించినప్పుడు కోట గోడలు దాటి వచ్చిన వారికి బహుమతులు వగైరాలంటూ వివిధ పరీక్షలు నిర్వహించి కోటలను మరింతగా దృఢతరం చేసుకునేవాడు. రాజాంతఃపురంలో సమయం మించిపోయి బయటకు వెళ్లడం వీలుకాక తన బిడ్డ పాల కోసం ఏడుస్తుంటాడేమో అన్న స్పృహతో కోట బురుజును దాటి వెళ్లిన హీరాకానీ అనే మహిళను సత్కరించి, ఆ బురుజును మరింత పటిష్ట పరచిన సంఘటన మనకు తెలిసిందే. ఆ బురుజు ఇప్పటికీ ‘హీరాకానీ బురుజు’ పేరుతో పిలవబడుతోంది.
శివాజీ తన రాజ్యాన్ని తమిళనాడులోని తంజావూరు, కర్ణాటకలోని జింజి వరకు విస్తరించాడు. అద్భుత రీతిలో నౌకాదళాన్ని నిర్మించాడు.
శివాజీ పోరాట స్ఫూర్తి, అంకితభావం అందించిన ప్రేరణ కారణంగా శివాజీ అనంతరం పీష్వాలు దేశమంతటినీ ఒకే ఛత్రం కిందకి తెచ్చారు. అంతేకాదు ఆ తదనంతరం కూడా సాధారణ సమాజమే తమను తాము సంఘటితంగా నిలుపుకుని రక్షించుకోగలిగింది.
తన 44వ ఏట కాశీకి చెందిన గాగాభట్టు అనే కాశీ పండితుడు శివాజీని పట్టాభిషిక్తుణ్ణి గావించాడు. పండితులు, పామరులు ఆయనను “హిందూ పద పాదషాహి” గా కీర్తించారు. సామాన్యులలో సైతం అసామాన్య పోరాట స్ఫూర్తిని, దేశభక్తిని నింపిన అసమాన స్వాభిమాన చక్రవర్తి ఛత్రపతి శివాజీ పట్టాభిషిక్తుడైన జ్యేష్ఠ శుక్ల త్రయోదశిని మనం “హిందూ సామ్రాజ్య దినోత్సవం” గా జరుపుకుంటున్నాం. శతాబ్దాలు గడిచినా కేవలం స్మరణ మాత్రం చేత గుండె గుండెలో స్వాభిమాన జ్వాలను రగిలించే శివాజీ జీవితం ప్రతి భారతీయుడికీ ప్రేరక మంత్రం. భారత్ మాతాకీ జై.





