ArticlesNews

భారత సంతతి హక్కులు – రాజ్యాంగ రక్షణ

315views

పౌరసత్వ సవరణ చట్టం 2019 అనేది చాలా తక్కువ మందికి, అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లలో మత పీడనకు గురైన వారికి, మాత్రమే వర్తించే చట్టం. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ యొక్క రాజ్యాంగము లోని 2 వ అధికరణము ఆ దేశంలో ఇస్లాం రాజ్య మతముగా ఉండాలని నిర్దేశించింది. అలాగే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ రాజ్యాంగము లోని 2 వ అధికరణము ఇస్లాం ఆ రాజ్య మతముగా ఉండాలని నిర్దేశించింది. వీటిలాగానే రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ రాజ్యాంగము కూడా అలానే నిర్దేశించింది.

ఎప్పుడైతే ఒక మతము ఓ దేశానికి అధికారిక మతముగా ఉంటుందో, ఆ దేశంలోని ఇతర మతాల ప్రజలు సమదృష్టి తో చూడబడరు అన్న దానికి ఎటువంటి నిరూపణలూ అవసరం లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, తగ్గిపోతున్న వారి జనాభా, వారి స్వేచ్చను, గౌరవాన్ని కాపాడుకోవడానికి ఆయా దేశాలను వదిలి వాళ్ళు పారిపోవడం వంటివి  అక్కడ మతపరంగా అల్పసంఖ్యాకులు అణచివేతకు గురి అవుతున్నరన్న విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. మతపరంగా అల్పసంఖ్యాకులు అయిన వారి సంఖ్య అక్కడ దారుణంగా తగ్గిపోయింది. 1941 జనాభా లెక్కల ప్రకారం, తరువాతి కాలంలో పాకిస్తాన్ గా విడిపోయిన భూభాగంలో హిందువుల జనాభా మొత్తం జనాభాలో 19. 52 శాతం. ముస్లీములు 72.45 శాతంగా ఉండేది. దేశ విభజన తరువాత పాకిస్తాన్ హిందువులను దాదాపుగా వదిలించుకుంది.

1951 పాకిస్తాన్ జనాభా లెక్కల ప్రకారం పశ్చిమ పాకిస్తాన్ లో ముస్లిమేతరులు 2.9 శాతం ఉంటే, ముస్లిములు 97.1 శాతం ఉన్నారు.  దేశ విభజనకు ముందు అవిభాజ్య భారత దేశంలో 15 కోట్ల మంది ముస్లిములు ఉండగా, విభజన తరువాత 3.5 కోట్ల మంది ముస్లిములు భారత దేశంలో ఉండిపోగా, మిగిలినవాళ్ళు పాకిస్తాన్ కి వెళ్ళిపోయారు.  అలా కొంతమంది ముస్లిములు పాకిస్తాన్ కి వెళ్ళిపోయాక అవిభాజ్య భారత దేశంలో 25 శాతంగా ఉన్న వారి సంఖ్య 9 శాతానికి పడిపోయింది. (మాధవ్ గోద్బోలె : ‘ది హోలోకాస్ట్ ఆఫ్ ఇండియన్ పార్టిషన్, యాన్ ఇంక్వేస్ట్ : పేజి 207)

1998 జనాభా లెక్కల ప్రకారం (బంగ్లాదేశ్ విడిపోయిన అనంతరం) పాకిస్తాన్ జనాభా వివరాలు

ముస్లీలులు – 96.28 %

హిందువులు – 1.6 %

క్రైస్తవులు – 1.59 %

(ది టైమ్స్ ఆఫ్ ఇండియా – ఆగస్ట్ 20, 2012 – పేజి 20 )

ఆ దేశాల నుండి ముస్లిములు కూడా భారతదేశానికి వచ్చారన్నది వాస్తవం.  అయితే వాళ్ళు వచ్చింది అక్కడ మత పరమైన పీడనకు గురి అయ్యి కాదు.  వాళ్ళు అక్కడి అధికార మతానికి చెందిన వాళ్ళు కాబట్టి, వాళ్ళు మత పీడనకు గురి అయ్యే ప్రసక్తే రాదు. వాళ్ళు భారతదేశానికి వచ్చింది మెరుగైన ఉపాధి అవకాశాల కోసం, లేదా కొంతమంది  ఇక్కడ విద్రోహ కార్యకలాపాలలో పాలు పంచుకోవడం కోసం. వాళ్ళను మత పీడనకు గురై వచ్చిన వాళ్ళతో పోల్చలేము.  ఈ విషయంలో విభజన చాలా స్పష్టంగా ఉంది. అర్హత లేనివాళ్ళని ఇక్కడి ప్రజలతో సమానంగా చూడలేము. భారత రాజ్యాంగం లోని 14 వ అధికరణం ‘చట్టం ముందు అందరూ సమానం అని, చట్టాలు అందరినీ సమానంగా రక్షించాలని’ పేర్కొంది. దాని ముఖ్య ఉద్దేశ్యం ‘ఒకే రకమైన ప్రజలందరినీ సమానంగా చూడాలి” అని.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలోని అల్పసంఖ్యాకులు చాలా కాలం క్రితమే భారతదేశంలోకి ప్రవేశించారు. వాళ్ళు ఇక్కడ ఉండటానికి అనుమతించబడిన కాలాన్ని భారత ప్రభుత్వం 8-1-2016 న మరియు 19-9-2016 న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పొడిగించింది.

భారత రాజ్యాంగం 19 వ అధికరణ ప్రకారం కల్పించబడిన ప్రాధమిక హక్కులు విదేశస్తులకు వర్తించవు. భారత దేశ పౌరులకు మాత్రమే వర్తించే 19 వ అధికరణం లోని అంశాలను దృష్టిలో ఉంచుకుని 14 వ అధికారణాన్ని అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ, కమ్యునిస్ట్ పార్టీలు కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో  మైనారిటీలుగా ఉన్న వాళ్లకి భారత పౌరసత్వం కల్పించాలని అధికారికంగా డిమాండ్ చేసి ఉన్నాయి.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వం, అది ఎన్నుకోబడిన కాలానికి అధికారంలో కొనసాగే హక్కును కలిగి ఉంటుంది.  ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్య సూత్రాలు, రాజ్యంగా నైతికత ను అనుసరించి ప్రభుత్వము చేసే చట్టాలను వ్యతిరేకించే రాజకీయ పక్షాలు ఆ చట్టాలను ఉపసంహిరించుకోమని ప్రభుత్వాన్ని బలవంత పెడుతూ హింసకు పాల్పడరాదు. శాసన నిర్మాణ ప్రక్రియ కేంద్ర, రాష్ట్రాల మధ్య పంచబడిన సమాఖ్య వ్యవస్థలో , ఏదన్నా చట్టం రాజ్యాంగ పరిధిలో ఉందా లేదా అనే విషయాన్ని న్యాయ వ్యవస్థ (కోర్టులు) నిర్ణయిస్తుంది. ప్రజాస్వామ్యము లో అసమ్మతి ఒక భాగమైనప్పటికి అది ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే ఆయుధంగా ఉపయోగించడరాదు.  అసమ్మతి అనేది ఎల్లప్పుడూ ధిక్కారముగా ఉండరాదు. వ్యక్తులు తమ సమస్యలను వ్యక్తం చేసినప్పుడు ఒక్కోసారి అది అసమ్మతి రూపాన్ని సంతరించుకోవచ్చు. సమూహాలు, సంస్థలు సరి కానటువంటి తమ అసమ్మతిని సరి అయినదిగా భావించవచ్చు. రాజకీయ పక్షాలు తమ ‘న్యాయబద్ధమైన’ కోరికలను సాధించడం కోసం ప్రభుత్వం మీద వత్తిడి తీసుకురావడానికి ఉపయోగించే అసమ్మతి, వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వాన్ని పడదోయడం కోసం హింసాత్మక పద్దతులలో వ్యక్తపరచే అసమ్మతి కన్నా చాలా భిన్నమయినది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అటువంటి అసమ్మతిని ఎంత మేరకు సహించాలి అనేది ప్రస్తుతం ఆలోచించాల్సిన విషయము. అసమ్మతి హింసకు దారితీయవచ్చా? సమాజములోని ఒక వర్గము వ్యక్తము చేసే అసమ్మతి న్యాయబద్ధమైనదా కాదా అనేది దాని యొక్క ప్రయోజనాన్ని బట్టి నిర్ణయించాలి కానీ, దానిని సాధించడం కోసం చెలరేగిన హింసను ఆధారంగా నిర్ణయించకూడదు.

సంయమనం ఇప్పుడు చాలా అవసరం. ఇప్పటికే విభజన అనేది బాగా వ్యాపిస్తోంది. CAA వలన బాధితులు ఎవరూ లేరు. ఒక సమస్యను పరిష్కరించడానికి చేసిన ఇటువంటి చట్టాన్ని న్యాయబద్ధం కాని కారణాలు చూపి వ్యతిరేకించడం సరి కాదు.  ఈ చట్ట పరధిలోకి రాని పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుండి అక్రమంగా ఈ దేశంలోకి ప్రవేశించిన ముస్లీములను ప్రత్యేకంగా పరిగణించవలసి ఉంటుంది.  వాళ్ళు ఆయా దేశాలలో మతపరమైన పీడనను ఎదుర్కున్న వాళ్ళు కాదు కాబట్టి, వాళ్ళు తమను కూడా  ఆయాదేశాలలో మత పీడనకు గురైన మైనారిటీ లతో సమానంగా పరిగణించమని  కోరలేరు.

CAA రాజ్యాంగబద్ధమా కాదా అనే అంశం సుప్రీమ్ కోర్ట్ లో న్యాయ నిర్ణయం కోసం సమర్పించబడి ఉంది. కేసు యొక్క ప్రాధాన్యత దృష్ట్యా, మరో ఆరు నెలలలో కోర్టు తీర్పు వెలువడవచ్చు. ప్రస్తుత ప్రభుత్వానికి పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉందన్న అంశాన్ని , అది చేసిన చట్టాలు రాజ్యంగా బద్ధంగా ఉన్నాయా లేవా అనే అంశాన్ని తేల్చడంలో పరిగణన లోకి తీసుకోలేము.  రాజ్యాంగ చట్టాలలో నిపుణుడైన లారెన్స్ ట్రైబ్ చెప్పినట్టుగా, “ రాజ్యాంగము చే పరిరక్షించబడే ప్రతి హక్కూ, అధిక సంఖ్యాకులు చే చేయబడ్డ చట్టలనుంచి కూడ రక్షణ కలిగి ఉంటుంది.’’ (Laurence H.Tribe & Michael C.Dorf – On reading the Constitution p.29)

CAA కి వ్యతిరేకముగా ఆందోళన చేస్తున్న రాజకీయ పక్షాలు, సంస్థలు సుప్రీం కోర్ట్ తీర్పు వెలువడే దాకా వేచి ఉండటం మంచిది.

ఆంగ్ల మూలం : Justice M.N.Rao

తెలుగు అనువాదం : శేషశాయి దీవి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.