News

అప్పులు చెల్లిస్తా మన్నించండి – విజయ్ మాల్యా

801views

భారతీయ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు 100 శాతం తిరిగి చెల్లిస్తానన్న తన ప్రతిపాదనను ప్రభుత్వం మన్నించాలని పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త, లిక్కర్‌ టైకూన్‌ విజయ్‌ మాల్యా మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. బకాయిలు తీసుకొని తన మీద ఉన్న కేసు కొట్టేయాలని కోరారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన భారీ ప్యాకేజీపై అభినందనలు తెలియజేస్తూ, తన విన్నపాన్ని ప్రభుత్వం విస్మరిస్తుందని వాపోయారు.
‘కొవిడ్ 19 రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రానికి నా అభినందనలు. వారు కావాలంటే ఎన్ని నోట్లు అయినా ముద్రించగలరు. కానీ ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న 100 శాతం రుణ బకాయిలు చెల్లిస్తానన్న నా అభ్యర్థనను ప్రతిసారి విస్మరించాలా? నా డబ్బు తీసుకొని నా మీద ఉన్న కేసు కొట్టేయండి’ అని మాల్యా ట్వీట్ చేశారు.

విజయ్ మాల్యా భారత్‌లోని వివిధ బ్యాంకుల్లో రూ.9000 కోట్ల రుణాలు పొంది, 2016లో దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆయన్ను తిరిగి రప్పించడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దానికి వ్యతిరేకంగా బ్రిటన్‌ హైకోర్టులో మాల్యా చేసిన అప్పీల్‌ను ఆ కోర్టు కొట్టివేసింది. దాంతో ఆయన అక్కడి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.