News

తిరుప్పరంకుండ్రం కార్తిక దీపంపై ఉత్కంఠ.. కొండ చుట్టూ 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు

0views

తమిళనాడు: తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక దీపం వెలిగించే అంశం తమిళనాడులో తీవ్ర చర్చకు దారితీస్తోంది. కార్తిక పౌర్ణమి సందర్భంగా కొండపై ఉన్న స్తంభంపై దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయడంతో మంగళవారం సాయంత్రం దీపం వెలిగిస్తారా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు తిరుప్పరంకుండ్రం ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మదురై పోలీస్ కమిషనర్ రాజేంద్రన్ ఆదేశాలతో కొండ పరిసరాల్లో సుమారు 7 వేల మంది పోలీసులను మోహరించారు.

ఈ బందోబస్తులో నలుగురు డీఐజీలు, ఏడుగురు ఎస్పీలు, 10 మంది అదనపు ఎస్పీలు, 45 మంది డీఎస్పీలు, 100 మందికి పైగా ఇన్‌స్పెక్టర్లు సహా భారీ పోలీసు బలగాలు పాల్గొంటున్నాయి. తిరుప్పరంకుండ్రంలో ఇంత పెద్ద ఎత్తున పోలీసులను మోహరించడం ఇదే తొలిసారని సమాచారం.

ఇదిలా ఉండగా, కొండపై దీపం వెలిగించేందుకు బయలుదేరిన పలువురు బీజేపీ, హిందూ మున్నని నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పాలయంకొట్టైలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రను గృహనిర్బంధం చేశారు. తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాల్లో సోమవారం రాత్రి సుమారు 750 మందిని పోలీసులు వారి ఇళ్ల వద్దే నిలువరించారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సున్నిత ప్రాంతాల్లో అదనపు భద్రతను ఏర్పాటు చేశారు.