
ఆధ్యాత్మిక నగరమైన విజయవాడలో అయ్యప్ప నామస్మరణ మార్మోగింది. విశ్వమాత ఫౌండేషన్, అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అయ్యప్ప మహా సంకల్పం’ మహా పడిపూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహత్తర ఆధ్యాత్మిక వేడుకకు స్వాములు, అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
నగరంలోని అజిత్‌సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో రెండో రోజైన ఆదివారం ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ప్రాంగణమంతా అయ్యప్ప స్వామి శరణుఘోషతో మార్మోగింది. భక్తులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
కేరళ సంప్రదాయంలో విశేష పూజలు, హోమాలు
శబరిమల నుంచి విచ్చేసిన పది మంది మున్మేల్ శాంతులు కేరళ సంప్రదాయ పద్ధతుల్లో పూజా కార్యక్రమాలను నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహాగణపతి పూజతో ప్రారంభమైన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సకల దోష నివారణార్థం నవగ్రహ పూజ, నవగ్రహ శాంతి హోమం, సహస్ర లింగార్చన, మహాలక్ష్మి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అలాగే చండీ హోమం, సుదర్శన హోమం, మృత్యుంజయ హోమాలను భక్తిశ్రద్ధలతో జరిపించారు. అయ్యప్ప స్వామికి ప్రత్యేక అర్చనలు, మహా నైవేద్య సమర్పణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
రాత్రి నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ వేడుక భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ముంచెత్తింది. స్వామివారికి మహా పుష్పాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప నామస్మరణలు, శరణుఘోషలతో స్టేడియం మొత్తం భక్తిమయంగా మారింది.
హరివరాసనం అవార్డు గ్రహీత వీరమణిరాజు, అభిషేక్ రాజుల బృందం ఆలపించిన భక్తి గీతాలు, భజనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంగీతం, భజనలతో కార్యక్రమ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.
అయ్యప్ప భక్తుల భారీ భాగస్వామ్యంతో ‘అయ్యప్ప మహా సంకల్పం’ మహా పడిపూజ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.
#AyyappaMahasankalpam #AyyappaSwamy #MahaPadipuja #Vijayawada #SwamiyeSaranamAyyappa





