News

సమరసతతోనే దేశాభివృద్ధి సాధ్యం : మాజీ కేంద్ర మంత్రి డా. సంజయ్ పాశ్వాన్

0views

సమాజంలో సామాజిక సమానత్వం, ఐక్యత, సామరస్యాన్ని పెంపొందించడంతో పాటు దేశ అభివృద్ధిని వేగవంతం చేయాలంటే అన్ని వర్గాల ప్రజలు పరస్పర సమన్వయంతో సమష్టిగా కృషి చేయాలని మాజీ కేంద్ర మంత్రి డా. సంజయ్ పాశ్వాన్ పిలుపునిచ్చారు. సమాజంలోని భిన్న వర్గాల మధ్య పరస్పర గౌరవం, సహకారం, సోదరభావం బలపడినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

విజయవాడలోని రామమోహన్ లైబ్రరీలో నవంబర్ 21న అంబేద్కర్ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి డా. సంజయ్ పాశ్వాన్ హాజరై ప్రసంగించారు. సమరసత సేవా ఫౌండేషన్ ప్రతినిధి తాళ్ళూరి విష్ణు, ఆంధ్రప్రదేశ్ సమరసత సేవా ఫౌండేషన్ అధ్యక్షులు, అమ్మా హాస్పిటల్స్ కు చెందిన డా. శ్రీలక్ష్మి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డా. సంజయ్ పాశ్వాన్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ, రామ్ మనోహర్ లోహియా, డా. బి.ఆర్. అంబేద్కర్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ వంటి ప్రముఖుల ఆలోచనల్లోని సమాజహిత భావాలను సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నలుగురు మహనీయుల ఆలోచనల సమ్మేళనంగా GLAD (Gandhi-Lohia-Ambedkar-Deendayal) భావజాలం సామాజిక సామరస్యం, సమానత్వ సాధనకు మార్గదర్శకంగా నిలుస్తుందని వివరించారు. అలాగే HINDU అనే పదంలోని విలువలను వివరిస్తూ H అంటే Humanity (మానవత్వం), I అంటే Integrity (నైతిక సమగ్రత), N అంటే Nobility (ఉన్నతమైన వ్యక్తిత్వం), D అంటే Divinity (దైవత్వం), U అంటే Unity (ఐక్యత) అని పేర్కొన్నారు. ఈ విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించినప్పుడే సమాజంలో పరస్పర విశ్వాసం, గౌరవం, ఐక్యత పెరుగుతాయని తెలిపారు.

సమరసతతోనే దేశాభివృద్ధి సాధ్యం
సామాజిక సమానత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా తమ సంస్థ వివిధ కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. ఇందులో భాగంగా 821 దేవాలయాలను నిర్మించి, వాటిలో దళిత పూజారులను నియమించినట్లు వెల్లడించారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా సామాజిక ఐక్యతకు వేదికలుగా కూడా నిలవాలని తమ సంస్థ ఆకాంక్షిస్తోందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన గౌరవం, భాగస్వామ్యం కల్పించడం ద్వారా సామాజిక సామరస్యాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.

అంబేద్కర్ ఆశయాల సాధనకు అధ్యయన వేదిక
సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ స్వర్ణ ఈశ్వర్ అరవింద్ మాట్లాడుతూ అంబేద్కర్ అధ్యయన వేదిక ఏర్పాటుకు సంబంధించిన లక్ష్యాలు, ఆశయాలను వివరించారు. డా. బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనలు, రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం, సమానత్వం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వేదిక కృషి చేస్తోందన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యాచరణ గురించి వివరించారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం, విద్యా, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడం, మహనీయుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై ఇటువంటి సమావేశాలు మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ కార్యక్రమంలో శ్చిగురుపాటి నరేష్, ఝాన్సీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.