News

భారత నాగరికత, భాషా వైవిధ్యాన్ని కొనియాడిన రష్యా అధ్యక్షుడు పుతిన్

0views

భారతదేశ ప్రాచీన నాగరికత, భాషా వైవిధ్యం, సాంస్కృతిక గొప్పతనంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. భారత్‌లోని భాషా వైవిధ్యం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు.

ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడుతూ.. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు. భారత్‌లో ప్రధాన భాషను ఎంతమంది మాట్లాడుతున్నారని మోదీని అడిగినప్పుడు, దేశ జనాభాలో సుమారు 60 కోట్ల మంది మాత్రమే ఆ భాషను మాట్లాడుతున్నారని, మిగిలిన వారు వివిధ ప్రాంతీయ భాషలను ఉపయోగిస్తున్నారని వివరించినట్లు తెలిపారు.

భారత్‌లో ఇన్ని భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ దేశం ఐక్యంగా కొనసాగడం అద్భుతమైన విషయమని పుతిన్ వ్యాఖ్యానించారు. భారత నాగరికత వేల సంవత్సరాల చరిత్ర కలిగినదని, దాని గురించి తెలుసుకునే కొద్దీ మరింత ఆసక్తి పెరుగుతోందని అన్నారు.

రష్యా నాగరికత గురించి ప్రస్తావిస్తూ.. తమ దేశంలోని వివిధ జాతులు, మతాలు, భాషలు, సంప్రదాయాలు తమ ప్రత్యేకతలను కాపాడుకుంటూ కలిసి జీవిస్తున్నాయని వివరించారు.

గత నెలలో మాస్కోలో జరిగిన కార్యక్రమంలోనూ పుతిన్ భారత్‌ను ప్రస్తావించారు. భారత్ ఒక పెద్ద దేశం మాత్రమే కాదని, ప్రత్యేకమైన నాగరికత, ఐక్యత కలిగిన దేశమని కొనియాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.