
(కార్తిక పూర్ణిమ – గురునానక్ జయంతి)
భారతదేశ ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక చరిత్రలో గురునానక్దేవ్కు విశిష్ఠమైన స్థానం ఉంది. సిఖ్ఖు మత స్థాపకుడిగా మాత్రమే కాకుండా, సమానత్వం, సోదరభావం, మానవత్వం, సేవాభావం వంటి ఉన్నత విలువలను సమాజానికి అందించిన మహనీయుడిగా ఆయన చిరస్మరణీయులయ్యారు. మతం పేరుతో సమాజంలో నెలకొన్న విభేదాలను తొలగించి, మానవులందరూ ఒక్కటేనని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప ఆధ్యాత్మికవేత్త గురునానక్.
నానక్ సామాన్యశకం 1469 కార్తిక పూర్ణిమ రోజున ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో ఉన్న తల్వండీ అనే గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని నన్కానా సాహిబ్‌గా పిలుస్తున్నారు. ఆయన తండ్రి మెహతా కళ్యాణ్ దాస్, తల్లి తృప్తాదేవి. నానక్ చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి, సేవాభావం పట్ల ఆసక్తి కనబరిచారు. సమాజంలోని కుల, మత, వర్గ వివక్షలను ప్రశ్నించారు. మూఢనమ్మకాలు, ఆడంబరమైన ఆచారాల కంటే నిజాయితీ, ప్రేమ, మానవత్వమే ముఖ్యమని భావించారు.
నానక్‌కు బాల్యంనుంచే సంప్రదాయ విద్యతోపాటు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువ. ఆయన భార్య సులఖనీ దేవి. వారికి శ్రీచంద్, లక్ష్మీదాస్ అనే ఇద్దరు కుమారులు జన్మించారు. నానక్ సుల్తాన్పూర్ లోధీలో పనిచేస్తున్న సమయంలో ఆయనకు ఆధ్యాత్మిక దివ్యానుభూతి కలిగింది. ఆ ఆధ్యాత్మిక సందేశాన్ని మానవాళికి అందించేందుకు నానక్ విస్తృతంగా పర్యటించారు. భారతదేశంలోని అనేక ప్రాంతాలతోపాటు మక్కా, మదీనా, టిబెట్ తదితర ప్రాంతాలను సందర్శించి వివిధ మతాల ప్రజలతో సంభాషించారు. భగవంతుడు ఒక్కడేనని, ఆయనను చేరుకోవడానికి ప్రేమ, భక్తి, సత్ప్రవర్తనలే మార్గాలని బోధించారు.
గురునానక్ బోధనల్లో ప్రధాన సూత్రాలు మూడు… ‘నామ్ జపో’, ‘కీరత్ కరో’, ‘వండ్ ఛకో’. అంటే భగవంతుని నామాన్ని స్మరించడం, నిజాయితీతో కష్టపడి పనిచేయడం, సంపాదించిన దానిని ఇతరులతో పంచుకోవడం. ఈ మూడు సూత్రాలు వ్యక్తిగత జీవితానికే కాకుండా సమాజ నిర్మాణానికి కూడా మార్గదర్శకాలుగా నిలుస్తాయి.
కులవివక్ష, అంటరానితనం, లింగవివక్షలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. స్త్రీలకు సమాజంలో సమాన గౌరవం, హక్కులు ఉండాలని చాటిచెప్పారు. అందరూ ఒకే వరుసలో కూర్చుని భోజనం చేసే ‘లంగర్’ సంప్రదాయం ద్వారా సామాజిక సమానత్వాన్ని అమలుచేసారు. ఆయన స్థాపించిన కర్తార్‌పూర్‌లో సామూహిక ప్రార్థన, సేవ, సమానత్వాలకు ప్రాధాన్యతనిచ్చే జీవన విధానాన్ని ప్రోత్సహించారు.
గురునానక్ రచించిన ఆధ్యాత్మిక కీర్తనలు, బోధనలు తరువాత సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌లో చోటుచేసుకున్నాయి. ఆయన రచనలు సంగీతాత్మకంగా, తాత్వికంగా, సామాజిక సందేశాలతో నిండి ఉంటాయి. 1539 సెప్టెంబర్ 22న గురునానక్ కర్తార్‌పూర్‌లో పరమపదించారు.
దాదాపు ఐదు శతాబ్దాలు గడిచినా గురునానక్ బోధనలు నేటికీ మానవాళికి మార్గదర్శకాలుగా నిలిచాయి. మతం కంటే మానవత్వం గొప్పదని, భక్తి కంటే సేవ గొప్పదని, సంపద కంటే పంచుకునే గుణం విలువైనదని ఆయన జీవితం చాటిచెబుతోంది. అందుకే గురునానక్ ఒక మత స్థాపకుడిగానే కాకుండా, సమస్త మానవాళికి శాంతి, సమానత్వం, సౌభ్రాతృత్వ సందేశాన్ని అందించిన విశ్వమానవుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.





