ArticlesNews

ఈశాన్య భారతపు శివాజీ, మొగలుల పాలిట సింహస్వప్నం

0views

( 24 నవంబర్ – 1622 లచిత్ బర్ఫుకన్ జయంతి )

లచిత్ బర్ఫుకన్ అస్సాం కేంద్రంగా ఈశాన్యభారతదేశాన్ని మాత్రమే కాదు, యావత్ ఆగ్నేయాసియాను ఆనాటి మొగలుల మతోన్మాదం నుంచి కాపాడిన ఘనుడు. బెంగాల్‌ను దాటి మొగలులు సామ్రాజ్యాన్ని విస్తరించకుండా అడ్డుకున్న మహావీరుడు. అతితక్కువ వనరులు, చాలాకొద్ది ఆయుధాలూ పడవలే ఉన్నప్పటికీ, గిరిజనులను కూడగట్టుకుని లచిత్ బర్ఫుకన్ మొగలుల మహాసైన్యాన్ని సరాయ్‌ఘాట్ యుద్ధంలో చిత్తుగా ఓడించాడు. ఆ ఓటమి మొగలులకు ఎంత భయం పుట్టించిందంటే తర్వాత మరే మొగలు పాలకుడూ అస్సాంవైపు కన్నెత్తి చూడనేలేదు.

ముస్లిం దురాక్రమణదారులు సామాన్యశకం 1206 నుంచి 1671 వరకూ 465ఏళ్ళ వ్యవధిలో అస్సాం మీద 22సార్లు దండయాత్రలు చేసారు. కానీ అహోం పాలకుల వీరశూరత్వాల ముందు నిలువలేకపోయారు. 1662లో బెంగాల్ సుబేదార్‌ మీర్‌జుమ్లా తొలిసారి పాక్షికవిజయం సాధించాడు. గౌహతి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఫలితంగా 1663లో మీర్‌జుమ్లాతో అవమానకరమైన ఒప్పందానికి అహోంరాజు జయధ్వజసింగ్ తలొగ్గాల్సి వచ్చింది. అతని వారసుడు చక్రధ్వజసింగ్ మొగలులపై ప్రతీకారం తీర్చుకోడానికి సైన్యాన్ని సిద్ధం చేసాడు. దానికి లచిత్ బర్ఫుకన్‌ను సైన్యాధిపతిని చేసాడు. లచిత్ గౌహతిని మళ్ళీ చేజిక్కించుకున్నాడు. దాన్నే తన స్థావరం చేసుకుని మొగలులపై గెరిల్లా పద్ధతిలో దాడులు కొనసాగించాడు.

లచిత్ బర్ఫుకన్ విజయం గురించి తెలిసిన ఔరంగజేబు, అతన్ని ఓడించడానికి రాజా రాంసింగ్ నేతృత్వంలో భారీసైన్యాన్ని పంపించాడు. 30వేలమంది సైనికులు, 18వేలమంది ఆశ్వికులు, 15వేలమంది విలుకాండ్లతో కూడిన ఆ భారీ సైన్యాన్ని ఎదుర్కోవడం అతిచిన్న అహోం సైన్యానికి సాధ్యం కాదు. దాంతో లచిత్, మొగలులను ఒప్పందం కోసం చర్చల పేరిట కొన్ని నెలలు నిలిపి ఉంచాడు. వారితో ప్రత్యక్ష యుద్ధం చేయలేమని తెలిసి, దాదాపు రెండేళ్ళు గెరిల్లా యుద్ధం చేసాడు. ఆ క్రమంలో రెండుదళాలూ నష్టపోయాయి. 1669లో లచిత్ ఓటమి పాలయ్యాడు. మరో రెండేళ్ళు కష్టపడి సైన్యాన్ని సిద్ధం చేసాడు. అప్పటికి చక్రధ్వజసింగ్ కాలం చేసాడు, ఉదయాదిత్యసింగ్ తదుపరి అహోం రాజు అయ్యాడు.

లచిత్ 1671లో వ్యూహాత్మకంగా వ్యవహరించి, బ్రహ్మపుత్రానది చాలా తక్కువగా ప్రవహించే సరాయ్‌ఘాట్ దగ్గర మొగలులను ఎదుర్కొన్నాడు. యుద్ధం మొదట్లో లచిత్ అనారోగ్యం పాలవడంతో స్వయంగా పాల్గొనలేకపోయాడు. దాంతో మొగలులు పైచేయి సాధించసాగారు. అహోం సైన్యం కకావికలం అవుతున్న సమయంలో లచిత్ స్వయంగా రంగంలోకి దిగాడు. దాంతో ఉత్తేజితులైన సైనికులు మొగలులను ఓడించారు. మొగలుల నౌకాదళాధిపతి మునావర్ ఖాన్ సహా 4వేలమందికి పైగా సైనికులను తుదముట్టించారు. వారి సేనాధిపతి రాజా రామ్‌సింగ్ భయంతో పరారయ్యాడు. అహోం సైన్యంపై రామ్‌సింగ్ ప్రశంసల వర్షం కురిపించడం లచిత్ నాయకత్వ సామర్థ్యానికి ప్రతీక.

పాశ్చాత్య భావజాలానికి బానిసలైన చరిత్రకారులు నిజమైన భారతీయ యోధులను ఏనాడూ గుర్తించలేదు. అలాంటి మహావీరుల్లో ఒకడైన లచిత్ బర్ఫుకన్, భారత చరిత్రలో చిరస్మరణీయుడు. ఈశాన్య భారతపు శివాజీగా కీర్తి గడించిన లచిత్ జీవితం గురించి ప్రతీ భారతీయుడూ తెలుసుకోవాలి. అలాంటి వీరుల త్యాగాల ఫలితమైన మన దేశ వైభవాన్ని నిలబెట్టాలి. అదే వారికి మనం అర్పించగల ఘన నివాళి.