
శబరిమల: అయ్యప్ప స్వామి భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు తమ పవిత్రమైన ఇరుముడి కట్టును విమానాల్లో క్యాబిన్ బ్యాగేజీగా తీసుకెళ్లేందుకు ఈ ఏడాది కూడా అనుమతులు కొనసాగించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.
ఈ ఏడాది నవంబర్ 12 నుంచి ఇరుముడి తీసుకెళ్లేందుకు అనుమతులు పునరుద్ధరించారు. దీనికి సంబంధించి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) అన్ని ప్రాంతీయ కార్యాలయాలు, CISF, విమానాశ్రయాల నిర్వాహకులకు అవసరమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి భక్తుల ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలను గౌరవిస్తూ గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇరుముడి కట్టును విమానాల్లో తీసుకెళ్లేందుకు అనుమతులు కల్పించినట్లు తెలిపారు. భక్తులు తమ పవిత్రమైన ఇరుముడితో విమాన ప్రయాణం చేసే సమయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న ఈ సమస్యను రెండేళ్ల క్రితమే గుర్తించిన రామ్మోహన్ నాయుడు, అప్పటి నుంచి ప్రతి యాత్రా సీజన్లోనూ ప్రత్యేక అనుమతులు లభించేలా చొరవ తీసుకుంటున్నారు. తాజాగా మరోసారి అనుమతులు పునరుద్ధరించడంతో శబరిమల యాత్రకు విమానాల్లో వెళ్లే లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు ప్రయోజనం కలగనుంది.
అయ్యప్ప భక్తుల ఆచారాలకు గౌరవం కల్పిస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై స్వామివారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వామియే శరణం అయ్యప్ప!





