
కేరళ: దత్తత తీసుకున్న పిల్లల విషయంలో వివక్షకు తావులేకుండా కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కన్నబిడ్డలకు, దత్తత పిల్లలకు మధ్య ఎలాంటి తేడా చూపించకూడదని స్పష్టం చేసింది. అధికారిక పత్రాల్లోనూ ‘దత్తత కుమారుడు’, ‘దత్తత కుమార్తె’ అని ప్రత్యేకంగా పేర్కొనడాన్ని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. సమాజం దత్తత పిల్లలను కూడా కుటుంబ సభ్యులుగా, కుమారులు, కుమార్తెలుగానే అంగీకరిస్తున్నప్పుడు ప్రభుత్వ రికార్డుల్లో ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం ద్వారా వారిలో వివక్ష భావన కలిగించకూడదని అభిప్రాయపడింది.
పెళ్లయి 16 ఏళ్లు గడిచినా సంతానం కలగకపోవడంతో ఓ దంపతులు 1990 జూన్లో నెల రోజుల వయసున్న పాపను దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమెను కన్నకూతురిలాగే ప్రేమతో పెంచారు. ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, విద్యార్హతల ధ్రువపత్రాలు సహా అన్ని అధికారిక పత్రాల్లోనూ ఆమెను తమ కుమార్తెగానే నమోదు చేయించారు.
2023లో తల్లి మరణించినప్పుడు జారీ చేసిన వారసత్వ ధ్రువీకరణ పత్రంలో ఆమెను కుమార్తెగానే పేర్కొన్నారు. అయితే 2024 అక్టోబర్లో తండ్రి మరణించిన అనంతరం త్రిసూర్ తహసీల్దార్ జారీ చేసిన వారసత్వ ధ్రువీకరణ పత్రంలో మాత్రం ‘దత్తత కుమార్తె’ అని పేర్కొన్నారు.
దీంతో తనను ప్రత్యేకంగా దత్తత కుమార్తెగా గుర్తించడం గౌరవానికి భంగం కలిగిస్తోందని భావించిన ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన హైకోర్టు దత్తత పిల్లల ఆత్మగౌరవం, సమానత్వ హక్కులకు ప్రాధాన్యం ఇచ్చింది. కుటుంబంలో భాగమైన పిల్లలను అధికారిక పత్రాల్లో ప్రత్యేకంగా గుర్తించడం ద్వారా వారి పట్ల భిన్నమైన భావన ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
దత్తత అనేది ఒక బిడ్డకు కొత్త కుటుంబాన్ని, ప్రేమను, భద్రతను అందించే గొప్ప బంధం. కన్నబిడ్డ అయినా, దత్తత బిడ్డ అయినా తల్లిదండ్రుల ప్రేమలోనూ, కుటుంబ గౌరవంలోనూ ఎలాంటి తేడా ఉండకూడదనే సందేశాన్ని ఈ తీర్పు మరోసారి చాటిచెప్పింది.





