News

రామాయణం సినిమా వివాదం.. అభ్యంతరాలు వ్యక్తం చేసిన హిందూ జనజాగృతి సమితి

5views

ప్రముఖ నటులు రణ్‌బీర్ కపూర్, యశ్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం’ వివాదంలో చిక్కుకుంది. మహర్షి వాల్మీకి రచించిన రామాయణ ఇతిహాసంలోని అసలు కథకు భిన్నంగా సినిమాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారంటూ హిందూ జనజాగృతి సమితి (హెచ్‌జేఎస్‌) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సృజనాత్మకత పేరుతో పవిత్ర ఇతిహాసంలోని కీలక ఘట్టాలను మార్చడం తగదని పేర్కొంటూ, హిందువులు ఈ సినిమాను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.

మంగళవారం ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో హిందూ సంఘాల ప్రతినిధులు దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై పలు అభ్యంతరాలను లేవనెత్తారు. రామాయణంలోని పాత్రల స్వభావం, ఘట్టాల చిత్రీకరణలో అసలు ఇతిహాసానికి విరుద్ధమైన మార్పులు చేశారని ఆరోపించారు. ముఖ్యంగా రావణుడిని గొప్పగా చూపిస్తూ, లక్ష్మణుడి పాత్ర ప్రాధాన్యతను తగ్గించినట్లు కనిపిస్తోందని విమర్శించారు. రాముడు, లక్ష్మణుల వీరత్వాన్ని ప్రతిబింబించేలా పాత్రలను చిత్రీకరించలేదని అభిప్రాయపడ్డారు.

రామాయణం కోట్లాది మంది హిందువుల ఆరాధ్య ఇతిహాసమని హెచ్‌జేఎస్‌ ప్రతినిధులు గుర్తుచేశారు. తరతరాలుగా భారతీయ సమాజానికి ధర్మం, ఆదర్శం, సంస్కృతిని బోధిస్తున్న రామాయణాన్ని సినిమాగా తెరకెక్కించే సమయంలో దాని పవిత్రతను, మూల సాహిత్యంలోని విలువలను గౌరవించాలని కోరారు. ఈ చిత్రంలో కమ్యూనిస్టు అజెండాను ప్రోత్సహించే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోందని సంస్థ ఆరోపించింది. ఈ నేపథ్యంలో హిందువులు సినిమాను చూడకుండా బహిష్కరించాలని పిలుపునిచ్చింది.

సెన్సార్ బోర్డు తీరుపై ప్రశ్నలు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) వ్యవహారశైలిపైనా హెచ్‌జేఎస్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. సంస్థ రాష్ట్ర సమన్వయకర్త సునీల్ ఘన్వత్ మాట్లాడుతూ.. ఇతర మతాల మనోభావాలకు ప్రాధాన్యతనిచ్చే సెన్సార్ బోర్డు హిందువుల విశ్వాసాలు, భావాలను కూడా సమానంగా పరిగణించాలని అన్నారు. ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’, ‘ది డావిన్సీ కోడ్’, ‘కమల్ ధమాల్ మలామాల్’ వంటి చిత్రాలను ప్రస్తావిస్తూ, సినిమాల విషయంలో ఒకే విధమైన ప్రమాణాలు ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు.

పలు సన్నివేశాలపై అభ్యంతరాలు
సినిమాలో రావణుడు పేదలకు బంగారు ఇళ్లను బహుమతిగా ఇచ్చినట్లు చూపించడం, రాముడు, లక్ష్మణుడు రావణుడి సైన్యాన్ని చూసి పారిపోతున్నట్లు చిత్రీకరించడం, సీత రాక్షసులతో పోరాడే సన్నివేశాలు తమ అభ్యంతరాలకు కారణమని హెచ్‌జేఎస్‌ తెలిపింది. అలాగే శూర్పణఖ భర్త విద్యుజ్జిహ్వను పనిమనిషిని వేధించాడనే ఆరోపణతో రావణుడు హతమార్చినట్లు చూపించడంపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇదిలా ఉండగా, సీత రాక్షసులతో పోరాడే సన్నివేశంపై గతంలో దర్శకుడు నితీశ్ తివారీ వివరణ ఇచ్చారు. ఈ చిత్రాన్ని కేవలం వాల్మీకి రామాయణానికి మాత్రమే పరిమితం చేయకుండా, ఇతర ప్రాంతీయ రామాయణాలు, ప్రత్యామ్నాయ సాహిత్య సంప్రదాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని రూపొందించినట్లు స్పష్టం చేశారు.

తాజాగా హిందూ సంఘాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలపై సినిమా నిర్మాతలు ఇంకా అధికారికంగా స్పందించలేదు. రామాయణం వంటి కోట్లాది మంది హిందువుల విశ్వాసాలతో ముడిపడిన ఇతిహాసాన్ని వెండితెరపై ఆవిష్కరించే క్రమంలో చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక అంశాల ప్రామాణికతపై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.