News

శబరిమల: అటవీ మార్గం ప్రారంభం.. భక్తులకు హెచ్చరికలు!

0views

కేరళలో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం పశ్చిమ కనుమల గుండా సాగే సంప్రదాయ అటవీ మార్గం ‘పులిమేడు’ ప్రారంభమైంది. ఇడుక్కి జిల్లాలోని సత్రం మీదుగా వెళ్లే ఈ మార్గంలో ఉదయం 7.30 గంటలకు తొలి భక్తుల బృందం ప్రయాణాన్ని ప్రారంభించింది. మొదటి గంటలోనే 600 మందికి పైగా భక్తులు టోకెన్లు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

వండిపెరియార్ ఫారెస్ట్ సెక్షన్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన కౌంటర్‌లో అవసరమైన తనిఖీలు పూర్తయ్యాక యాత్రకు అనుమతించారు. సత్రంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్‌లో భక్తులకు టోకెన్లు జారీ చేస్తున్నారు. పీర్మేడ్ ఎమ్మెల్యే సిరియాక్ థామస్, అటవీ శాఖ అధికారులు తొలి బృందానికి జెండా ఊపి, యాత్రను ప్రారంభించారు.

ఈ మార్గం దట్టమైన అడవులు, ప్రకృతి అందాల మధ్య సాగుతుంది. అయితే కొండ ప్రాంతాలు, మారుతున్న వాతావరణ పరిస్థితులు, వన్యప్రాణులు.. ముఖ్యంగా ఏనుగుల మందల సంచారం కారణంగా భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్లాస్టిక్ వస్తువులు, వాటర్ బాటిళ్లు, శానిటైజర్లు తీసుకెళ్లడంపై నిషేధం విధించారు.

నవంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ఈ ప్రాంతంలోని దుకాణాలు, తాత్కాలిక స్టాళ్లలో నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల విక్రయాలు, వినియోగాన్ని కూడా నిషేధించారు. అటవీ మార్గంలో చెత్త సేకరణ వంటి చర్యలు చేపట్టారు.

భక్తుల భద్రత కోసం అటవీ, పోలీసు, వైద్య, స్థానిక సంస్థల శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. పులిమేడు మార్గంలోని సత్రం, పులిమేడు టాప్, పెద్దపాదం మార్గంలోని అలుదా, కరిమల ప్రాంతాల్లో అటవీ సిబ్బంది, పోలీసులను మోహరించారు. ఎకో గార్డులు, ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్, స్నేక్ రెస్క్యూ బృందాలు అందుబాటులో ఉంటాయి. వన్యప్రాణుల కదలికలను పరిశీలించిన తర్వాతే భక్తులను ముందుకు అనుమతిస్తారు.

తాగునీరు, వైద్య సేవల కోసం సత్రంలో తాత్కాలిక వైద్యశాల, మొబైల్ మెడికల్ యూనిట్ ఏర్పాటు చేశారు. పులిమేడులోనూ వైద్య సదుపాయాలు కల్పించారు. అత్యవసర సమాచార మార్పిడి కోసం పలు ప్రాంతాల్లో వీఎచ్ఎఫ్ కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అటవీ మార్గంలో ప్రయాణించే భక్తులు అధికారుల సూచనలు పాటించాలని, చెత్త వేయకుండా ప్రకృతిని, వన్యప్రాణులను కాపాడాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.