
జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలపై దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల కదలికలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. లష్కరే తోయిబా కమాండర్ మహమ్మద్ లతీఫ్ భట్, అతడి సహాయకుడు ఉమర్ నిసార్ దార్ కలిసి దాడికి ముందు పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. కుల్గామ్ జిల్లాలో నవంబర్ 11న సీఆర్పీఎఫ్ బలగాలపై జరిగిన దాడికి ముందు రోజు వీరిద్దరూ అనుమానాస్పదంగా సంచరించినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా బయటపడింది.
దర్యాప్తు సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. నవంబర్ 10న లతీఫ్ భట్, ఉమర్ నిసార్ దార్ కలిసి కుల్గామ్ జిల్లాలోని మీర్ బజార్, అఖ్రాన్, హబ్లిష్, కిలామ్ ప్రాంతాల్లో తిరిగారు. భద్రతా బలగాల కదలికలను గమనించడంతో పాటు దాడులకు అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు రెక్కీ నిర్వహించారు. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఆ ఇద్దరి కదలికలు బయటపడ్డాయి. దాడి అనంతరం వారు అక్కడి నుంచి పారిపోయిన దృశ్యాలు కూడా రికార్డయ్యాయని అధికారులు తెలిపారు.
నవంబర్ 11న అఖ్రాన్ ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ చెక్‌పోస్ట్‌పై వీరిద్దరూ దాడి చేసినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. కాల్పుల అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. నవంబర్ 16న కుల్గామ్‌లో లతీఫ్ భట్, ఉమర్ నిసార్ దార్‌ను భద్రతా బలగాలు గుర్తించడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఉమర్ నిసార్ దార్ హతమయ్యాడు. లతీఫ్ భట్ మాత్రం గాయాలతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అతడి కోసం భద్రతా బలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.





