News

కేరళలో దారుణం.. ప్రియుడిని హత్య చేసేందుకు సఫానా స్కెచ్

0views

కేరళలో దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడిని వదిలించుకోవాలనే ఉద్దేశంతో అతడిని హత్య చేసేందుకు ఓ యువతి పక్కా ప్రణాళిక రచించింది. ఇందుకోసం తన స్నేహితుల సహకారం తీసుకుని, ఇద్దరు నేరచరిత్ర కలిగిన వ్యక్తులతో కలిసి యువకుడిపై దాడి చేయించింది. అయితే బాధితుడు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణ కుట్ర వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురు మహిళలు సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. పాలక్కాడ్ జిల్లా పట్టాంబికి చెందిన సఫానా (19) తన ప్రియుడిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తన స్నేహితుల సహాయం కోరగా వారు కూడా కుట్రలో భాగస్వాములయ్యారు. పథకం ప్రకారం యువకుడిని అర్ధరాత్రి సమయంలో తిరూరుకు రప్పించారు. ప్రియురాలిని కలుసుకోవచ్చనే నమ్మకంతో అక్కడికి వెళ్లిన యువకుడిని నిందితుల్లో ఒకరు ద్విచక్రవాహనంపై మరో ప్రాంతానికి తీసుకెళ్లాడు.

అక్కడ ముందుగానే సిద్ధంగా ఉన్న మిగతా నిందితులు యువకుడిని బలవంతంగా కారులోకి ఎక్కించి తీవ్రంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని తిరూరులోని తాళెపాలం నది ఒడ్డున వదిలేసి నిందితులు పరారయ్యారు. అంతేకాకుండా అతడి మొబైల్ ఫోన్‌ను కూడా లాక్కెళ్లారు.

తీవ్ర గాయాలతో బయటపడిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఘటనపై దర్యాప్తు ప్రారంభమైంది. తిరూర్ ఇన్‌స్పెక్టర్ జలీల్ కరుతేడత్ నేతృత్వంలోని పోలీసు బృందం రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చేపట్టింది.

బుధవారం తెల్లవారుజామున తాళెపాలం సమీపంలో ప్రధాన నిందితురాలు సఫానా (19), నదియా (20), రబీబా (25), ఇర్షాద్ (28), అజరుద్దీన్ (25)లను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని తిరూర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

ఈ ఘటనలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు ఇర్షాద్, అజరుద్దీన్‌లపై గతంలోనూ పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, హత్యాయత్నం, దాడులకు సంబంధించిన కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని, గతంలో జైలు శిక్ష కూడా అనుభవించారని పోలీసులు వెల్లడించారు.

అయితే సఫానా తన ప్రియుడిని హత్య చేయడానికి అసలు కారణం ఏమిటి? ఈ కుట్ర వెనుక మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రేమ పేరుతో పరిచయమైన వ్యక్తినే హత్య చేసేందుకు కుట్ర పన్నడం కేరళలో తీవ్ర చర్చకు దారితీసింది.