News

పూజా సామగ్రి, విగ్రహాల సేకరణకు జీహెచ్‌ఎంసీ ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’.. 12 కేంద్రాల ఏర్పాటు

33views

హైదరాబాద్ నగరంలో పాత దేవుడి విగ్రహాలు, ఫొటోలు, క్యాలెండర్లు వంటి పవిత్ర వస్తువులను గౌరవప్రదంగా సేకరించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’ కార్యక్రమాన్ని ప్రకటించింది. దీనిలో భాగంగా నగరంలోని ఆరు జోన్ల పరిధిలో 12 సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక డ్రైవ్‌ను రేపు ఉదయం 8:30 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పర్యావరణాన్ని పరిరక్షించడం, పవిత్ర వస్తువులు చెత్తలో లేదా నీటిలో కలవకుండా చూడటం. ప్రజలు తమకు సమీపంలోని కేంద్రాన్ని తెలుసుకోవడానికి అధికారిక పోస్టర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలని జీహెచ్ఎంసీ సూచించింది. షామ్‌షాబాద్, చార్మినార్, రాజేంద్రనగర్, గోల్కొండ వంటి జోన్లలోని పలు ఆలయాల వద్ద ఈ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

‘ప్రాజెక్ట్ ఉద్వాసన’ ద్వారా సేకరించిన వస్తువులకు సంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలకడంతో పాటు, వాటిని వేరుచేసి పునర్వినియోగానికి పంపుతారు. గాజు, కాగితం, కలప, లోహం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి పదార్థాలను రీసైక్లింగ్ చేస్తారు. గతంలో నిర్వహించిన డ్రైవ్‌లకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, వేల కిలోల పవిత్ర వస్తువులను సేకరించామని జీహెచ్ఎంసీ అధికారులు వివరించారు.