
విజయనగరంలోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని గురువారం ‘జన్జాతీయ గౌరవ్ దివస్–2026’ నిర్వహించారు.
విశ్వవిద్యాలయ గిరిజన అధ్యయన విభాగం ఆధ్వర్యంలో “బిర్సా ముండా: గిరిజన గర్వం, అస్తిత్వం, అభివృద్ధి” అనే అంశంపై ఒకరోజు రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ విశ్వవిద్యాలయం సామాజిక శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ నాగరాజు గుండెమెడ మాట్లాడుతూ.. భగవాన్ బిర్సా ముండా కేవలం స్వాతంత్ర్య సమరయోధుడే కాకుండా, గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, భూమి, సంస్కృతి, అస్తిత్వ పరిరక్షణ కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు.
గిరిజన సమాజాల సంప్రదాయ విజ్ఞానం, ప్రకృతితో మమేకమైన జీవన విధానం, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. విద్య, సామాజిక చైతన్యం, ఆర్థికాభివృద్ధి ద్వారా గిరిజన యువత దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.





