ArticlesNews

శిథిలాల నుంచి సజీవ చరిత్ర.. ఆలయ వైభవాన్ని ఆవిష్కరిస్తున్న యువతి

8views

శతాబ్దాల చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన పురాతన ఆలయాలు, రాతి మండపాలు, కోటలు, ప్రాకారాలు.. కాలక్రమంలో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఒకప్పుడు అద్భుతమైన శిల్పకళా వైభవంతో అలరారిన కట్టడాలు నేడు శిథిలాలుగా మిగిలిపోతున్నాయి. అలాంటి కట్టడాలను చూసి బాధపడటంతోనే ఆగిపోకుండా.. వాటి పూర్వ వైభవాన్ని నేటి తరానికి పరిచయం చేస్తున్నారు మహారాష్ట్రకు చెందిన యువ ఆర్కిటెక్ట్ పర్ణవి బాంగర్. ‘రెమినిసింగ్ హిస్టరీ’ పేరుతో డిజిటల్ చిత్రకళ ద్వారా భారతీయ చారిత్రక కట్టడాల గత వైభవాన్ని ఆవిష్కరిస్తున్నారు. చరిత్ర, శిల్పకళ, ఆధునిక సాంకేతికతను మేళవిస్తూ వారసత్వ సంపద పరిరక్షణకు తనవంతు కృషి చేస్తున్నారు.

హంపి శిల్పకళే స్ఫూర్తి!
మహారాష్ట్రలోని థానేకు చెందిన పర్ణవి బాంగర్‌కు చిన్నప్పటి నుంచే చిత్రకళపై ఆసక్తి. అదే ఆమెను ఆర్కిటెక్చర్ వైపు నడిపించింది. ఆర్కిటెక్చర్ ఐదో ఏడాది చదువుతున్న సమయంలో హంపి సందర్శించే అవకాశం లభించింది. అక్కడి విఠల ఆలయం, ప్రసిద్ధ రాతి రథం, శిల్పకళా వైభవం, శిథిలమైన మండపాలు ఆమెను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఒకప్పుడు ఆ కట్టడాలు ఎలా ఉండేవో తన తమ్ముడికి వివరించేందుకు ప్రయత్నించినప్పుడు, మాటలతో వాటి వైభవాన్ని పూర్తిగా అర్థమయ్యేలా చెప్పలేకపోయారు. దీంతో తన ఊహాశక్తికి చిత్రరూపం ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది. అలా హంపి ఆలయ శిల్పకళకు తన సృజనాత్మకతను జోడించి తొలి స్కెచ్ రూపొందించారు. ఆ చిన్న ప్రయత్నమే ఆమె జీవితానికి కొత్త దిశ చూపించింది.

అయితే కేవలం ఊహాశక్తితో చిత్రాలు రూపొందిస్తే సరిపోదని, వాటిలో చారిత్రక, నిర్మాణపరమైన కచ్చితత్వం ఉండాలని గుర్తించారు. అందుకే ప్రతి చిత్రానికి ముందు విస్తృతంగా పరిశోధన చేస్తున్నారు. పురావస్తు శాఖ నివేదికలు, పురాతన పత్రాలు, శాసనాలు, శిల్పశాస్త్ర గ్రంథాలు, నాణేలు, పాతకాలపు ఛాయాచిత్రాలను అధ్యయనం చేస్తున్నారు. ఆర్కిటెక్ట్‌గా తనకున్న పరిజ్ఞానాన్ని కూడా ఇందుకోసం ఉపయోగిస్తున్నారు.

ఉద్యోగం చేస్తూనే పార్ట్‌టైమ్‌గా ప్రారంభించిన ఈ ప్రయత్నం గతేడాది స్వచ్ఛంద సంస్థ (ఎన్‌జీవో) రూపంలోకి వచ్చింది. ప్రస్తుతం ‘రెమినిసింగ్ హిస్టరీ’ ద్వారా పూర్తిస్థాయిలో చారిత్రక వారసత్వ పరిరక్షణకు కృషి చేస్తున్నారు.

శిథిలమైన ఆలయానికి పూర్వ వైభవం చూపించే పుస్తకం!
చారిత్రక కట్టడాలపై చిత్రాలను ఎగ్జిబిషన్లలో ప్రదర్శించడం మాత్రమే కాకుండా, సందర్శకులు నేరుగా ఆయా కట్టడాల వద్దే వాటి పూర్వ వైభవాన్ని అనుభూతి చెందాలనే ఆలోచనతో ‘రెమినిసింగ్ హంపి’ పుస్తకాన్ని రూపొందించారు.

ఈ పుస్తకంలో ప్రత్యేకంగా రూపొందించిన పారదర్శక పేజీ ఉంటుంది. హంపిలోని శిథిలమైన ఆలయం లేదా మండపం ముందు నిలబడి, ఆ కట్టడానికి అనుగుణంగా ఈ పారదర్శక పేజీని ఉంచి చూస్తే.. ప్రస్తుతం కనిపిస్తున్న శిథిలాల స్థానంలో ఒకప్పుడు ఆ నిర్మాణం ఎలా ఉండేదో డిజిటల్ చిత్రాల ద్వారా స్పష్టంగా చూడవచ్చు. కూలిపోయిన నిర్మాణాలు, దెబ్బతిన్న శిల్పాలు, రాతి కట్టడాల పూర్వ రూపాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే ఈ ప్రయోగం విశేష ఆదరణ పొందింది.

హంపిలోనే ఈ పుస్తకాన్ని వేలాది మంది కొనుగోలు చేశారు. ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంది. భవిష్యత్తులో రాయ్‌గఢ్, బాదామి వంటి చారిత్రక ప్రాంతాలపై కూడా ఇలాంటి పుస్తకాలను రూపొందించాలని ఆమె భావిస్తున్నారు.

పురాతన వాడాల పరిరక్షణకు చేయూత!
మహారాష్ట్రలోని సంప్రదాయ నిర్మాణ శైలికి ప్రతీకలైన పాతకాలపు ఇళ్లను ‘వాడాలు’ అంటారు. ప్రస్తుతం వీటిలో చాలా వరకు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అద్భుతమైన నిర్మాణ శైలి, సంప్రదాయ వాస్తు విశేషాలు కలిగిన ఈ ఇళ్లను ఎలా పరిరక్షించుకోవాలో చాలామంది యజమానులకు తెలియడం లేదు.

తన స్వస్థలమైన బాంగర్‌పాడాలో ముత్తాతల కాలం నాటి ఇంటితో పర్ణవికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆ ఆస్తిపై తనకు హక్కులు లేకపోయినా, ఒక ఆర్కిటెక్ట్‌గా దాని వారసత్వాన్ని కాపాడటం తన బాధ్యతగా భావించారు. దీంతో ఇలాంటి పాత ఇళ్లను డాక్యుమెంట్ చేయడంతో పాటు వాటి పునరుద్ధరణకు సంబంధించి స్థానికులకు సూచనలు, మార్గదర్శకత్వం అందిస్తున్నారు.

నలంద నుంచి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఆలయాల వరకు!
త్వరలో బిహార్‌లోని చారిత్రక నలంద విశ్వవిద్యాలయ ప్రాంగణంపై పరిశోధన, డిజిటల్ చిత్రాల రూపకల్పన చేపట్టాలని పర్ణవి భావిస్తున్నారు. హైదరాబాద్‌తోనూ ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో నగరంలో నిర్వహించిన పలు కళా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ‘ఏక్ చిత్ర ఆర్ట్ గ్యాలరీ’ నిర్వహించిన ‘లివింగ్ టెంపుల్స్’ రెండు ఎడిషన్లలో తన డిజిటల్ చిత్రాలను ప్రదర్శించారు.

భవిష్యత్తులో హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పురాతన ఆలయాలు, వాటి శిల్పకళా విశేషాలపై కూడా పరిశోధన చేసి డిజిటల్ రూపంలో ఆవిష్కరించాలనుకుంటున్నారు.

వారసత్వాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత!
భారతదేశంలోని ప్రతి పురాతన ఆలయం, శిల్పం, రాతి కట్టడం వెనుక ఒక గొప్ప చరిత్ర, సంస్కృతి, నిర్మాణ విజ్ఞానం దాగి ఉన్నాయి. వాటిని కేవలం పర్యాటక ప్రదేశాలుగా చూడకుండా మన పూర్వీకుల కళా నైపుణ్యానికి, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకలుగా భావించాలి. శిథిలమవుతున్న కట్టడాలను గుర్తించడం, వాటి చరిత్రను డాక్యుమెంట్ చేయడం, భావితరాలకు వాటి విశిష్టతను తెలియజేయడం ఎంతో అవసరం.

ఈ దిశగా పర్ణవి బాంగర్ చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. ఆధునిక డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి ప్రాచీన భారతీయ కళా వైభవాన్ని మళ్లీ మన కళ్లముందుకు తీసుకువస్తున్న ఆమె కృషి.. చారిత్రక వారసత్వ పరిరక్షణలో యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.