News

వివేకానంద ఆరోగ్య కేంద్రం సేవలు అభినందనీయం: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

8views

కుష్ఠు వ్యాధిగ్రస్తులకు గత ఐదు దశాబ్దాలుగా ఉచిత వైద్యం, పునరావాసం, విద్య, వృత్తి శిక్షణ అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న బొమ్మూరులోని శ్రీ వివేకానంద మహా రోగి ఆరోగ్య కేంద్రం సేవలు అభినందనీయమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని బొమ్మూరులో నిర్వహించిన శ్రీ వివేకానంద మహా రోగి ఆరోగ్య కేంద్రం 50వ స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్రీ శ్రీరామ్ భారత్ కుమార్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు.

అనంతరం కేంద్ర మంత్రి నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులను, గోశాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. గత 50 ఏళ్లుగా సమాజంలోని నిరుపేద, బాధిత వర్గాలకు వైద్య సేవలతో పాటు విద్య, ఉపాధి శిక్షణ, పునరావాసం కల్పిస్తూ సంస్థ చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.


మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో సంస్థ అభివృద్ధి, విస్తరణకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

ఐదు దశాబ్దాలుగా నిరంతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరో బాధితుల జీవితాల్లో మార్పునకు కృషి చేస్తున్న సంస్థ నిర్వాహకులు, సిబ్బంది, సేవకులను కేంద్ర మంత్రి అభినందించారు.