News

శాన్‌ఫ్రాన్సిస్కో మ్యూజియంలో వెయ్యేళ్ల శయన విష్ణుమూర్తి కాంస్య విగ్రహం ప్రదర్శన

5views

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో ఉన్న ఏషియన్ ఆర్ట్ మ్యూజియంలో వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన శయన విష్ణుమూర్తి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కంబోడియాలోని అంగోర్ నాగరికతకు చెందిన సుమారు ఆరు మీటర్ల పొడవైన ఈ అపురూప విగ్రహాన్ని ‘విష్ణువు యొక్క విశ్వ సముద్రం’ పేరుతో ప్రత్యేక ప్రదర్శనలో ఉంచారు. అక్టోబర్ 23న ప్రారంభమైన ఈ ప్రదర్శన వచ్చే ఏడాది జనవరి 25 వరకు కొనసాగనుంది. ఆగ్నేయాసియాలో ఇప్పటివరకు వెలుగుచూసిన అతిపెద్ద పురాతన కాంస్య శిల్పంగా దీనికి గుర్తింపు ఉంది.

కంబోడియా జాతీయ మ్యూజియం ఈ అరుదైన విగ్రహాన్ని తాత్కాలికంగా ప్రదర్శన కోసం అందించింది. ప్రదర్శన ముగిసిన అనంతరం తిరిగి కంబోడియాకు తరలించనున్నారు. ఈ సందర్భంగా అక్టోబర్ 25న వాట్ ధమ్మరారం ఆధ్వర్యంలో సంప్రదాయ ఖ్మేర్ బౌద్ధ ఆశీర్వాద కార్యక్రమాన్ని నిర్వహించారు. విగ్రహానికి, సందర్శకులకు రక్షణ, శాంతి, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. ఖ్మేర్ నృత్య ప్రదర్శనలు, పిల్లలు, కుటుంబాల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, కళా కార్యకలాపాలు, గైడెడ్ టూర్లు కూడా నిర్వహించారు.

నవంబర్ 1న సొసైటీ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా (SACHI) ఆధ్వర్యంలో ‘విష్ణువు యొక్క విశ్వ సముద్రం: ప్రశాంతత మరియు గందరగోళం’ అనే అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించనున్నారు. మ్యూజియం ఆగ్నేయాసియా కళల క్యూరేటర్ నటాషా రైఖిలే, మాజీ క్యూరేటర్ ఫారెస్ట్ మెక్‌గిల్ ఇందులో పాల్గొంటారు. ప్రాచీన ఖ్మేర్ రాజులు హిందూ పురాణాల్లోని క్షీరసాగర భావనను తమ రాజ్యపాలన, భారీ నీటి నిర్వహణ వ్యవస్థలు, రాజ వైభవంతో ఎలా అనుసంధానించారనే అంశాలను వారు వివరించనున్నారు.

ఈ విగ్రహం కంబోడియాలోని అంగోర్ ప్రాంతంలో ఉన్న వెస్ట్ మెబోన్ ఆలయానికి చెందినది. సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ఒక భారీ జలాశయం మధ్యలో నిర్మించిన కృత్రిమ ద్వీపంపై దీనిని ప్రతిష్ఠించారు. హిందూ పురాణాల ప్రకారం, విశ్వ సృష్టికి ముందు ఆదిమ సముద్రంలో ఆదిశేషుడిపై విష్ణుమూర్తి యోగనిద్రలో శయనిస్తాడు. ఈ విశ్వ సృష్టి భావనకు ప్రతిరూపంగానే జలాశయం మధ్యలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చారిత్రక పరిశోధకులు భావిస్తున్నారు. 1936లో ఈ విగ్రహం తిరిగి వెలుగులోకి వచ్చింది. ఖ్మేర్ శిల్పకళా వైభవానికి, ప్రాచీన హిందూ సంస్కృతి ప్రభావానికి ఇది గొప్ప నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ ప్రదర్శన ద్వారా ప్రాచీన భారతీయ హిందూ సంప్రదాయాలు ఆగ్నేయాసియా నాగరికతపై చూపిన ప్రభావాన్ని ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ముఖ్యంగా నీటి నిర్వహణ, ఆలయ నిర్మాణాలు, రాజరిక సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాల మధ్య ఉన్న అనుబంధాన్ని సందర్శకులు తెలుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వెస్ట్ మెబోన్ ఆలయంపై అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రదర్శనకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. వెయ్యేళ్ల క్రితమే హిందూ ధార్మిక భావనలు, కళా నైపుణ్యం, నిర్మాణ సాంకేతికత ఎంత ఉన్నత స్థాయిలో ఉండేవో ఈ అపురూప విష్ణుమూర్తి విగ్రహం మరోసారి చాటిచెబుతోంది.