News

బ్రహ్మంగారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు.

6views

మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండల పరిధిలో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. చిన్నచింతకుంట గ్రామ సమీపంలో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సుమారు 30 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన విగ్రహం ధ్వంసం కావడంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమైంది.

ఈ ఘటన విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, హిందూ సంఘాల ప్రతినిధులు, విశ్వకర్మ సంఘం సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు సుమారు కిలోమీటరు మేర నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రఘువీర్ రెడ్డి, గోడ రాజేందర్ మాట్లాడుతూ.. మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన బ్రహ్మంగారి పురాతన విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమన్నారు. ఈ ఘటనను విశ్వకర్మ సంఘంతో పాటు యావత్ హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు.

పోలీసులు తక్షణమే స్పందించి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, విగ్రహాన్ని ధ్వంసం చేసిన బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆలయ పునర్నిర్మాణం చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం సభ్యులు, బీజేపీ నాయకులు, హిందూ సంఘాల ప్రతినిధులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.