
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలపై భద్రతా దళాలు నిఘా మరింత పెంచాయి. ఈ నేపథ్యంలో భద్రతా దళాలకు కావలసిన నలుగురు ఉగ్రవాదుల ఆచూకీ తెలిపిన వారికి భారీ బహుమతి అందిస్తామని కోరుతూ ఆదివారం శ్రీనగర్‌లోని లాల్ చౌక్ ప్రాంతంలో ఓ ఫ్లెక్సీ బ్యానర్ ప్రత్యక్షమైంది. ప్రతాప్ పార్క్‌లోని ఓ గోడకు ఈ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.
బ్యానర్‌లో మహమ్మద్ లతీఫ్ భట్, బిలాల్ అహ్మద్ మీర్, మహమ్మద్ ఉమర్ మీర్, అబిద్ ఖయూమ్ లోన్ అనే నలుగురు ఉగ్రవాదుల పేర్లను పేర్కొన్నారు. వీరంతా బారాముల్లా జిల్లాకు చెందినవారిగా వెల్లడించారు. వీరి ఆచూకీ, కదలికల గురించి విశ్వసనీయమైన సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాచారం అందించే వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచడంతో పాటు, నమ్మదగిన సమాచారం అందించిన వారికి భారీ బహుమతి ఇస్తామని బ్యానర్‌లో పేర్కొన్నారు.
కాగా, ఈ నలుగురిలో ఒకడైన మహమ్మద్ లతీఫ్ భట్‌పై ఈ ఏడాది జూలైలో అనంతనాగ్‌లో ఓ పోలీసు అధికారిని హత్య చేసిన ఘటనలో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు, జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి అక్టోబర్ 17న ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కేరన్ సెక్టార్‌లోని జుమ్‌గుండ్ ప్రాంతంలో అనుమానాస్పద కదలికలను గుర్తించిన అప్రమత్తమైన సైనికులు వెంటనే స్పందించారు. దీంతో అనుమానిత ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం, నియంత్రణ రేఖను దాటి భారత్‌లోకి ప్రవేశించేందుకు ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులు ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున వారి కదలికలను గుర్తించిన సైనికులు వారిని అడ్డుకోవడంతో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.
కాల్పుల అనంతరం భద్రతా దళాలు ఆ ప్రాంతంలో గాలింపు, కూంబింగ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. చొరబాటు ప్రయత్నం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నప్పటికీ, అనుమానితులు ఎవరైనా నియంత్రణ రేఖను దాటారా అనే విషయాన్ని అధికారులు ఇంకా ధృవీకరించలేదు.





