News

2వేల ఏళ్లనాటి అఫ్గాన్‌ కోటలో తవ్వేకొద్దీ బౌద్ధ ఆనవాళ్లు

Pottery and other artifacts from the historic Bala Hissar fortress compound are arranged in trays during restoration work at the site in Kabul, Afghanistan, Thursday, Oct. 8, 2026. (AP Photo/Siddiqullah Alizai)
33views

అఫ్గానిస్తాన్ తాలిబన్ల రాజ్యంలో రెండు వేల ఏళ్ల నాటి ఓ పురాతన కోటలో బౌద్ధ విగ్రహాలు, బౌద్ధ ఆరామాలకు సంబంధించిన చారిత్రక ఆనవాళ్లు దొరుకుతున్నాయి. బాలా హిస్సార్‌ అనే ఆ కోటలో తవ్వేకొద్దీ పురాతన నాణేలతో పాటు మొగల్‌ సామ్రాజ్యానికి చెందిన ప్యాలెస్‌ల అందమైన స్నానపు గదుల వంటి చారిత్రక సంపద బయటపడుతోంది. గతంలో బౌద్ధానికి చెందినవాటితో పాటు ఇలాంటి పురాతన కళాఖండాలు కనిపించినప్పుడల్లా నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేసే తాలిబన్లు, వీటిని మాత్రం అపురూపంగా చూసుకుంటామని చెబుతున్నారు. ఇంతకీ ఆ కోట ఎక్కడ ఉంది, దాని కథేంటో ఈ కథనంలో చూద్దాం.

2 వేల ఏళ్ల నాటి చారిత్రక ‘బాలా హిస్సార్’ కోటకు పూర్వ వైభవం
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ ఓల్డ్‌ సిటీకి అభిముఖంగా కొండపై ఠీవీగా నిలిచిన 2వేల ఏళ్ల నాటి చారిత్రక బాలాహిస్సార్ కోట మళ్లీ గత వైభవాన్ని సంతరించుకుంటోంది. శతాబ్దాల పాటు సాగిన దండయాత్రలు, యుద్ధాలతో శిథిలావస్థకు చేరిన ఈ కోటను ఆగాఖాన్ ట్రస్ట్ పునరుద్ధరిస్తోంది. కోటను ఉద్యానవనాలు, మ్యూజియంతో కూడిన పురావస్తు పార్క్‌గా మార్చుతోంది. ఈ క్రమంలో 2 వేల ఏళ్లుగా రాజకీయ, సైనిక కేంద్రంగా ఉన్న ఈ కోటలో తవ్వకాలు జరిపేకొద్దీ ఆశ్చర్యపరిచే చారిత్రక సంపద బయటపడుతోందని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. 5 వేర్వేరు కందకాల్లో జరిపిన తవ్వకాల్లో నాణేలు, బౌద్ధ విగ్రహాలు, బౌద్ధ ఆరామాల ఆనవాళ్లు, ఇస్లామిక్ సిరామిక్స్, నూనె దీపాలు, మట్టి పాత్రలు వెలుగు చూశాయి. కొండపై రాతిలో చెక్కిన నక్షత్రాకారపు కొలను, సింహాసనం, కుడ్య చిత్రాలతో కూడిన మొగల్ ప్యాలెస్ స్నానపు గదులు కనిపించాయి.

కోటలో చాలా భాగాన్ని ధ్వంసం చేసిన బ్రిటిష్‌ దళాలు
దారీ భాషలో బాలా హిస్సార్ అంటే ఎత్తైన కోట అని అర్థం. కుహ్-ఎ-షేర్ దర్వాజా పర్వత శ్రేణిపై ఉన్న ఈ కోట భారత ఉపఖండాన్ని మధ్య ఆసియాతో కలిపే వాణిజ్య మార్గంలో ప్రధాన రాజకీయ, మతకేంద్రంగా విలసిల్లింది. బాలాహిస్సార్ ఎవరి నియంత్రణలో ఉంటే కాబూల్‌ సహా ఆ ప్రాంతమంతా వారి ఆధీనంలోనే ఉంటూ వస్తోంది. క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దం నుంచి మొఘల్, బ్రిటన్‌, సోవియట్, అమెరికా దండయాత్రల వరకు ఈ కోట వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా, ఆయుధాగారంగా, కారాగారంగా సేవలందించింది. 1879లో బ్రిటిష్ అధికారి హత్యకు ప్రతీకారంగా బ్రిటిష్‌ దళాలు ఈ కోటలో చాలా భాగాన్ని ధ్వంసం చేశాయి. నేటికీ కోటపై యుద్ధాల తాలూకు గాయాలు కనిపిస్తాయి. తుప్పుపట్టిన సోవియట్ ట్యాంకులు, యుద్ధ సామగ్రి కుప్పలు, 2021లో అమెరికా సైన్యం వదిలివెళ్లిన ఆయుధాలు అక్కడ దర్శనమిస్తాయి.

చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక సంపదను కాపాడేందుకు తాలిబన్లు ఆసక్తి
అటు 1996- 2001 మధ్య సాగిన తమ గత పాలనకు భిన్నంగా ఇప్పుడు చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక సంపదను కాపాడేందుకు తాలిబన్లు ఆసక్తి చూపుతున్నారు. 2001లో 6వ శతాబ్దం నాటి రెండు భారీ బుద్ధ విగ్రహాలను డైనమైట్లతో పేల్చి, కాబూల్ మ్యూజియంలోని పురాతన విగ్రహాలను ధ్వంసం చేసిన తాలిబన్లు నేడు దేశ చరిత్ర, సంస్కృతిని కాపాడుతామని చెబుతున్నారు.