
ముంబై: నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ISIS)తో సంబంధాలున్న కేసులో అనస్థీషియాలజిస్ట్ అద్నాన్ అలీ సర్కార్‌కు ముంబై ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. 2023లో వెలుగుచూసిన ఉగ్రవాద కుట్ర కేసులో నిందితుడైన అద్నాన్ తన నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇతర నిందితులపై విచారణ కొనసాగుతోంది.
ఎన్ఐఏ దర్యాప్తు ప్రకారం, అద్నాన్ అలీ సర్కార్ ఐసిస్ కార్యకలాపాలకు మద్దతు అందించడంతో పాటు, కొత్తగా సంస్థలో చేరేవారికి పేలుడు పదార్థాలు, చిన్న ఆయుధాల తయారీకి సంబంధించిన శిక్షణలో ఉపయోగపడే సామగ్రిని అందించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థకు సహకరించడం, కుట్రలో భాగస్వామ్యం కావడం వంటి అభియోగాలు అతనిపై మోపారు.
తొలుత తాను నిర్దోషినని వాదించిన అద్నాన్, అనంతరం కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. తాను చేసిన పనులకు పశ్చాత్తాపపడుతున్నానని, తన కుటుంబ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నేరాన్ని అంగీకరిస్తున్నానని న్యాయస్థానానికి తెలిపాడు. తనకు తక్కువ శిక్ష విధించాలని కూడా కోరాడు.
ఈ సందర్భంగా ప్రత్యేక న్యాయమూర్తి అభయ్ జోగ్లేకర్, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA), భారత శిక్షా స్మృతి (IPC) కింద అద్నాన్‌ను దోషిగా నిర్ధారించారు. నేరపూరిత కుట్ర, సాక్ష్యాల ధ్వంసం తదితర అభియోగాలు కూడా ఈ కేసులో ప్రస్తావనకు వచ్చాయి.
అద్నాన్కు ఇది మొదటి నేరమైనప్పటికీ, దేశ భద్రతకు ముప్పు కలిగించే ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించడం తీవ్రమైన నేరమని కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలను ఉపేక్షించరాదని, సమాజానికి స్పష్టమైన సందేశం వెళ్లేలా శిక్ష విధించడం అవసరమని పేర్కొంటూ ఆరేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది.





