News

చిదంబరం నటరాజ ఆలయ నిర్వహణకు న్యాయ కమిటీ

7views

చెన్నై: తమిళనాడులోని ప్రసిద్ధ చిదంబరం నటరాజ స్వామి ఆలయ నిర్వహణకు సంబంధించి మద్రాసు హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ పరిపాలనలో అవకతవకలు, పురాతన కట్టడాల పరిరక్షణలో నిర్లక్ష్యం, ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత లోపించాయన్న అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఆలయ నిర్వహణను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డు ఆలయ పరిపాలనా బాధ్యతలను చేపట్టనుంది. అయితే, రోజువారీ పూజలు, మతపరమైన ఆచారాలు, వార్షిక ఉత్సవాల నిర్వహణ అధికారాలు మాత్రం పోధు దీక్షితుల వద్దే కొనసాగుతాయని స్పష్టం చేసింది.

మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి. భారతిదాసన్ బోర్డు ఛైర్మన్‌గా, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సురేష్ కుమార్ సహ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి సి. రాజేంద్రన్ సభ్యుడిగా ఉంటారు. చిదంబరం ఆలయ పోధు దీక్షితుల కార్యదర్శి, తమిళనాడు హిందూ మత, ధర్మాదాయ శాఖ కార్యదర్శి పదవీరీత్యా సభ్యులుగా కొనసాగుతారు.

ఆలయ నిర్వహణలో పలు లోపాలు ఉన్నట్లు విచారణ సందర్భంగా న్యాయస్థానం గుర్తించింది. పురాతన నిర్మాణాలు, శిల్పాలు, కుడ్యచిత్రాల పరిరక్షణలో నిర్లక్ష్యం చోటుచేసుకున్నట్లు పేర్కొంది. ఆలయ ఆస్తుల నిర్వహణ, ఆదాయ వ్యయాల లెక్కల విషయంలోనూ పారదర్శకత అవసరమని అభిప్రాయపడింది. అన్నదానం పేరుతో విరాళాలు సేకరించడం, ఆలయ ప్రాంగణంలోని భోజనశాలను వాణిజ్య, ఇతర కార్యక్రమాలకు ఉపయోగించడం వంటి అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆలయ ప్రాంగణం వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా మారడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఆలయ ఆస్తుల పరిరక్షణ, ఆక్రమణకు గురైన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం, పెండింగ్‌లో ఉన్న అద్దెలు, లీజు బకాయిల వసూలు వంటి బాధ్యతలను కొత్త బోర్డుకు అప్పగించింది. ఆలయంలోని విలువైన వస్తువులు, ఆభరణాలు, ఇతర ఆస్తుల వివరాలతో సమగ్ర జాబితా రూపొందించాలని ఆదేశించింది. పురాతన నిర్మాణాలకు ఎలాంటి నష్టం కలగకుండా తమిళనాడు వారసత్వ కమిషన్‌ సలహాలతో అనధికార నిర్మాణాలను తొలగించాలని సూచించింది.

ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత కోసం ఆలయానికి వచ్చే విరాళాలన్నింటినీ బోర్డు నిర్దేశించే ఖాతాకు ఒకే విధమైన డిజిటల్ చెల్లింపు వ్యవస్థ ద్వారా స్వీకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రత్యేక పనుల కోసం ఇచ్చే విరాళాలను సంబంధిత ఖాతాల్లోనే జమ చేసి, అదే పనులకు ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. ఆలయ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించిన వివరాలను ప్రతి నెలా ఐదో తేదీలోగా బోర్డుకు సమర్పించాలని ఆదేశించింది.

అదే సమయంలో ఆలయ సంప్రదాయాలు, మతపరమైన వ్యవహారాల విషయంలో న్యాయస్థానం స్పష్టతనిచ్చింది. రోజువారీ పూజలు, ప్రత్యేక ఆచారాలు, పండుగల నిర్వహణ పూర్తిగా పోధు దీక్షితుల పరిధిలోనే ఉంటాయని పేర్కొంది. స్థిరపడిన సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించకుండా మతపరమైన కార్యక్రమాలను కొనసాగించాలని సూచించింది. భక్తులందరికీ కనకసభపై నుంచి స్వామివారి దర్శనం చేసుకునే విషయంలో సమాన అవకాశాలు కల్పించాలని కూడా ఆదేశించింది.

చిదంబరం నటరాజ ఆలయ పరిపాలనకు సంబంధించి పోధు దీక్షితులు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు ఇతర వ్యాజ్యాలపై విచారణ జరిపిన జస్టిస్ జి. జయచంద్రన్, జస్టిస్ ఇ. మనోహరన్‌లతో కూడిన ధర్మాసనం అక్టోబరు 30న ఈ తీర్పు వెలువరించింది. ఆలయ నిర్వహణలో గుర్తించిన సమస్యలు పరిష్కారమయ్యే వరకు కొత్త బోర్డు పరిపాలనా బాధ్యతలను పర్యవేక్షించనుంది.