
35views
భోపాల్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ఆచార్య శ్రీ 108 సమయసాగర్ జీ మహారాజ్ ను దర్శించుకున్నారు. సమయ సాగర్ జీ మహారాజ్ తన చాతుర్మస్య దీక్ష నిమిత్తం భోపాల్‌లో వున్నారు. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ ఆయన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన పాదాల చెంత కొబ్బరికాయను సమర్పించి, ఆశీర్వాదాలు పొందారు.
ఈ సందర్భంగా వారిద్దరి మధ్యా వివిధ సామాజిక అంశాలు, ఆధ్యాత్మిక అంశాలతో పాటు జాతీయ అంశాలపై కూడా చర్చలు జరిగాయి. ఆచార్య శ్రీ సమక్షంలో జరిగిన సంభాషణ సామాజిక సేవ, విద్య, స్వయం సమృద్ధి, సమస్త జీవుల పట్ల కరుణ, భారతీయ సంస్కృతి పరిరక్షణ వంటి ముఖ్యమైన అంశాలపై కేంద్రీకృతమైంది.
ఈ సంభాషణ సందర్భంగా, ఆచార్య శ్రీ ప్రేరణతో చేపట్టిన వివిధ సేవ, ప్రజాహిత కార్యక్రమాల గురించి చర్చించారు. వీటిలో ‘దయోదయ గోశాల’ను స్వయం సమృద్ధం చేసే ప్రయత్నాలు, చేనేత కేంద్రాల ద్వారా కార్మికులకు ఉపాధి కల్పించడం మరియు వారిని స్వయం సమృద్ధులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు, ‘ప్రతిభాస్థలి’ విద్యా సంస్థలు, ఆయుర్వేద ఆసుపత్రులు, అలాగే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్మితమవుతున్న భారీ రాతి జైన దేవాలయాలు.. ఇతరత్రా అంశాలు ఉన్నాయి.
ఈ కార్యక్రమాల ద్వారా జీవరాశుల పట్ల కరుణ, భారతదేశ జ్ఞాన సంప్రదాయాల పరిరక్షణ, విలువలతో కూడిన విద్య, ఆరోగ్య సంరక్షణ, శ్రమకు గౌరవం, మరియు దేశ మతపరమైన, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ వంటి అనేక ముఖ్యమైన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు.

ఆచార్య శ్రీ తో సంభాషిస్తున్న సమయంలో మోహన్ భాగవత్ భావోద్వేగంతో వున్నారని, ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌ఘర్‌లోని చంద్రగిరి తీర్థంలో పూజ్యమైన ఆచార్యను అంతిమ దర్శనం చేసుకున్న జ్ఞాపకాలను కూడా ఆయన పంచుకున్నారు.
ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహారాజ్ జీవితం త్యాగం, తపస్సు, కరుణ, స్వదేశీ, స్వావలంబన మరియు మానవసేవలకు ఒక ఆదర్శవంతమైన నిదర్శనంగా నిలుస్తుంది. ఆయన ప్రేరణతో చేపట్టిన సేవా కార్యక్రమాలు, సమాజాన్ని నిర్మాణాత్మకమైన మరియు సానుకూలమైన మార్గాల వైపు నడిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా భోపాల్‌కు చెందిన ప్రముఖ బాధ్యులతో సహా జైన సమాజ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా భాగవత్ కి శాలువా మరియు శ్రీఫలం (కొబ్బరికాయ) ఇచ్చి స్వాగతం పలికారు, అలాగే సాంప్రదాయ పద్ధతిలో తిలకం దిద్ది ఆయనను సత్కరించారు.





