News

కార్తీక మాసం వేళ శ్రీశైలం నవంబరు నెల దర్శన, ఆర్జిత సేవల టికెట్ల విడుదల

44views

శ్రీశైల దేవస్థానం నవంబరు నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఈ మేరకు శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేశ్​నాయుడు, ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు ఒక సంయుక్త ప్రకటనలో వివరాలను వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం ఈ సారి టికెట్ల కేటాయింపులో సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. మొత్తం కోటాలో 80 శాతం టికెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘మనమిత్ర’ వాట్సాప్ నెంబర్ ద్వారా, మిగిలిన 20 శాతం టికెట్లను అధికారిక వెబ్‌సైట్ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచారు.

 

టికెట్లు బుక్ చేసుకునే విధానం:

80% కోటా: భక్తులు తమ మొబైల్‌లో 95523 00009 అనే ‘మనమిత్ర’ వాట్సాప్ నంబరును సేవ్ చేసుకుని, చాట్‌లో “Hi” అని పంపడం ద్వారా సులభంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

• 20% కోటా : ఆంధ్రప్రదేశ్ దేవాలయాల అధికారిక పోర్టల్ ద్వారా మిగిలిన టికెట్లను పొందవచ్చు.

• బుకింగ్ సమయం: భక్తులు టికెట్ల లభ్యతను బట్టి దర్శన సమయానికి ఒక గంట ముందు వరకు కూడా ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకునే వీలుంది. దేవస్థానానికి చెందిన మొత్తం 14 రకాల ఆర్జిత సేవలను ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

కార్తీక మాసోత్సవాల వేళ కీలక మార్పులు (నవంబరు 10 – డిసెంబరు 9): కార్తీక మాసంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందున, సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా నవంబరు 10 నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు ఆలయ దర్శన వేళల్లో, సేవలలో పలు మార్పులు చేశారు.

• రద్దు చేసిన సేవలు: రద్దీ రోజుల్లో రూ.5,000ల గర్భాలయ అభిషేకాలు, రూ.1,500 ల సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా రద్దు చేశారు. వీటితో పాటు ఉదయాస్తమాన సేవ, ప్రాతఃకాల సేవ, ప్రదోషకాల సేవల టికెట్లను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

•కుంకుమార్చన స్థలం మార్పు: కార్తీక మాస రద్దీ రోజుల్లో అమ్మవారి అంతరాలయంలో జరిగే రూ.1,000 కుంకుమార్చన సేవను, భక్తుల రద్దీ దృష్ట్యా ‘ఆశీర్వచన మండపం’ లో నిర్వహించేలా మార్పులు చేశారు.

• యథావిధిగా సాగే సేవలు: ఆలయంలో జరిగే ఆర్జిత హోమాలు, కల్యాణోత్సవ సేవలు మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.

కార్తీక మాసంలో మల్లన్నను దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ మార్పులను గమనించి, ముందస్తుగా ‘మనమిత్ర’ వాట్సాప్ ద్వారా లేదా వెబ్‌సైట్ ద్వారా తమ దర్శన స్లాట్లను బుక్ చేసుకోవాలని దేవస్థాన అధికారులు సూచించారు.