జీవితంలో ఏదైనా పనిని కష్టంగా కాకుండా ఇష్టంగా భావించి చేస్తే కచ్చితంగా విజయం వరిస్తుంది. ఇదే విషయాన్ని నిజం చేసి చూపించారు బంగాల్లోని బంకురా జిల్లాకు చెందిన ప్రసిద్ధ శిల్పి మాణిక్ కర్మాకర్. ఆయన రాళ్లకు ప్రాణం పోస్తూ వాటితో అద్భుతమైన కళాఖండాలను సృష్టిస్తున్నారు. సంప్రదాయ రాతి శిల్పకళను ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు. గత ఐదు దశాబ్దాలుగా కఠినమైన రాళ్లతో అద్భుతాలు సృష్టించడంలో బిజీగా ఉన్నారు.
చిన్నప్పటి నుంచే ఆసక్తి
సుసునియాకు చెందిన మాణిక్ కర్మాకర్‌కు (64) చిన్నతనం నుంచే చదువుతో పాటు హస్తకళలపై ఆసక్తి ఉండేది. తన తండ్రి మార్గదర్శకత్వంలో రాతి శిల్పకళలో తొలి అడుగులు వేశారు మాణిక్. రాయిపై ఎక్కడ ఎంత ఒత్తిడి తేవాలి, ఏ దెబ్బతో రాయి రూపం మారుతుందో తండ్రి దగ్గరే నేర్చుకుని ఈ విద్యలో ఆరితేరారు. ఒక్కమాటలో చెప్పాలంటే పూర్తి నైపుణ్యం సాధించారు. మాణిక్ కళా జీవితంలో 1993వ సంవత్సరం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఆయన తన చేతులతో చెక్కిన ఒక అద్భుతమైన రాతి శంఖానికి గానూ అప్పటి భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పురస్కారం అందుకున్నారు. 12వ ఏట శిల్పాలను చెక్కడం ప్రారంభించిన మాణిక్, ఇప్పటికి అదే వృత్తిలో సంతృప్తికరంగా కొనసాగుతున్నారు.
ఆ పురస్కారం అందుకునే సమయానికి నా తండ్రి లేరు : మాణిక్
తనకు చిన్నతనంలో తన తండ్రి ఈ రాతి శిల్పకళను నేర్పించారని మాణిక్ తెలిపారు. అప్పటి నుంచి శిల్పాలను చెక్కడమే తన అభిరుచిగా, వృత్తిగా మారిపోయిందన్నారు. “1993లో నేను రాతితో శంఖాన్ని తీర్దిదిద్దాను. అందుకుగానూ నాకు రాష్ట్రపతి పురస్కారం లభించింది. ఆ అవార్డును అందుకునే సమయానికి నా తండ్రి చనిపోయారు. ఆయన ఈ విజయాన్ని చూసే అదృష్టానికి నోచుకోలేదు. అందుకు నేను చాలా బాధపడ్డాను” అని మాణిక్ పేర్కొన్నారు.
దేశవిదేశాల్లో ఫుల్ ఫేమస్
మాణిక్ చేతిలో రూపుదిద్దుకున్న కళాఖండాలు కొనుగోలుదారుల నుంచి విశేష ప్రశంసలు పొందాయి. సెలబ్రెటీలు సైతం రాతితో మాణిక్ చెక్కిన శంఖాల పట్ల ఆకర్షితులయ్యారు. అందులో నటుడు విక్టర్ బెనర్జీ ఒకరు. ఓ ప్రదర్శన నిమిత్తం ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మాణిక్ రూపొందించిన శంఖాన్ని చూసి ముగ్దుడైన విక్టర్ దాన్ని కొనుగోలు చేశారు. మాణిక్ సృష్టించిన కళాఖండాలు దేశంలోనే కాకుండా, విదేశాల్లోని కళాభిమానులను కూడా ఆకట్టుకున్నాయి. అయితే మాణిక్‌కు ఈ గుర్తింపు రాత్రికి రాత్రే రాలేదు. సంవత్సరాల తరబడి శ్రమించారు. అత్యంత కచ్చితత్వంతో తనదైన శైలిలో డిజైన్ల రూపొందించారు. ఈ క్రమంలో మంచి పేరు సంపాదించుకున్నారు.
ఇతరులకు ట్రైనింగ్
మాణిక్ తన తండ్రి నుంచి నేర్చుకున్న విద్యను మరికొంత మందికి నేర్పించారు. ఆయన వద్ద రాతి శిల్పకళను నేర్చుకున్న చాలా మంది ప్రస్తుతం నిలకడైన జీవనోపాధిని పొందారు. కాగా, మాణిక్ రాతి శిల్పకళను కేవలం జీవనోపాధి మాత్రమే చూడట్లేదు. అది తరతరాలుగా వస్తున్న ఒక కళాత్మక వారసత్వంగా భావిస్తూ ముందుకు సాగుతున్నారు. కాగా, మాణిక్ కర్మాకార్ సుదీర్ఘ శిల్పకళా ప్రయాణంలో ఆయన కుటుంబం అందించిన సహకారం ఎంతో కీలకం.
కొడుకుపై తల్లి ప్రశంసలు
మాణిక్ చిన్నతనం నుంచే చదువుతో పాటు హస్తకళల పట్ల ఎంతో ఆసక్తిని కనబరిచేవారని ఆయన తల్లి పార్లీ కర్మాకర్ తెలిపారు. కాలక్రమేణా ఆ ఆసక్తే మాణిక్ వృత్తిగా మారిందన్నారు. రాతి శిల్పకళ (స్టోన్ క్రాఫ్ట్) తమ కుటుంబంలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయమని చెప్పారు. తన కుమారుడు సాధించిన విజయాల పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రసిద్ధ శిల్పి మాణిక్ కర్మాకర్ పనితనం గురించి స్థానికుడు నయన్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మాణిక్ వద్ద ఒక శంఖాన్ని రూ.7వేలకు కొనుగోలు చేశానన్నారు. దానిలో అత్యద్భుతమైన పనితనం ఉందని కొనియాడారు. తాను దానిని వ్యక్తిగత ఆసక్తితో కొన్నానని చెప్పారు. ఆ రాతి శంఖం నుంచి వచ్చే శబ్దం చాలా మధురంగా ఉంటుందని ప్రశంసించారు.





